నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్రంలో పలు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాల్లో చేతికి వచ్చిన పంట నీట మునిగిపోయింది, అంతేకాకుండా విరామం లేని వర్షాలతో కోతకు వచ్చిన పంటలను రైతులు కొయలేకపోతున్నారు. ఈక్రమంలో తాజాగా మద్నూర్, డోంగ్లి, ఉమ్మడి మండలాల్లో దాదాపు సోయా పంట 35 వేల ఎకరాల్లో పలువురు రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేల ఎకరాల్లో వేసిన పంట కోత దశకు వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానాలకు..సోయా పంట నీటి పాలై ప్రమాదం పొంచి ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి మండలం వ్యాప్తంగా సుమారుగా ఆరువేల ఎకరాలకు పైగా వివిధ పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. విరామం లేని వానాలతో పంట చేనుల్లో వరద నీరు వచ్చి చేరిందని, దీంతో కోత మిషన్లు చేనుల్లోకి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. పెద్దమొత్తంలో తాము నష్ట పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోతకు వివిధ ప్రాంతాల నుంచి కోత మిషన్లు తీసుకొచ్చామని, నిరంతర వానాలతో పంటలు కోసే పరిస్థితి లేదని, దీంతో తమపై అదనపు భారం పడుతుందన్నారు. ఆరుగాలం శ్రమించి పడించిన పంట నీటి పాలువుతుందని రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.