నవతెలంగాణ – దుబ్బాక
కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కూడవెళ్లి వాగు ( మాండవ్య నది) ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఆగస్టు నెలలో నీళ్లు లేక బోసిపోయిన వాగులో సకాలంలో వర్షాలు కురవక ఇసుక కోసం కొందరు దళారులు తీసిన గుంతల్లో మాత్రమే నీళ్లు కనిపించేవి. సెప్టెంబర్ నెల లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఈ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా కూడవెళ్లి వాగు పరిసర ప్రాంతాల రైతులు కూడవెళ్లి వాగులో పైపులు వేసి మోటార్లతో ఇందులోని నీటిని తోడుకుంటూ పంటలు సాగు చేసుకుంటారు.
38 చెక్ డ్యామ్ లు.. 54 కిలోమీటర్ల పొడవున ప్రవాహం..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని జగదేవ్ పూర్ (ప్రస్తుతం మర్కుక్) మండలం చేబర్తి నుంచి ప్రారంభమయ్యే కూడవెల్లి వాగు .. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తోగుట, మిరుదొడ్డి, అక్బర్ పేట భూంపల్లి, దుబ్బాక మండలాల (చివరిగా దుబ్బాక మండలం గోసాన్ పల్లి గ్రామ శివారు వరకు ) మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోని శ్రీగాద, కొల్లమద్ది వరకు సుమారు 54 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ అప్పర్ మానేరు డ్యాం లో కలుస్తుంది. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) కి చేరుతుంది.ఈ కూడవెల్లి వాగు పై 38 చెక్ డ్యామ్లు నిర్మించారు.
40 వేల ఎకరాలకు కూడవెళ్ళి వాగు నీళ్లే ఆధారం..
దుబ్బాక నియోజకవర్గ పరిధిలో తొగుట, మిరుదొడ్డి, అక్బర్ పేట భూంపల్లి, దుబ్బాక మండలాల రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న పంటలకు ప్రధానంగా కూడవెళ్ళి వాగు నీళ్లే ఆధారం. ఈ ఏడాది వానకాలం లో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురవక అన్నదాతల్లో నిరాశే మిగిల్చినా.. సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు వాగు మీద నిర్మించిన 38 చెక్ డ్యాములు నిండిపోయాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగును చూసి అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.