– నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలి
– అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ముందుగా కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కోడిపందాలు,పేకాట,బెట్టింగ్ లు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచి దొంగతనాల కట్టడికి కృషి చేయాలని అన్నారు.
పోలీస్ స్టేషన్ ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతీ ప్రదేశంలో “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. గ్రేవ్ కేసుల్లో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా భాద్యతగా పనిచేయాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించే లా అవగాహనా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్ కాబట్టి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పాడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి,ఎస్సైలు యయాతి రాజు, ఊకే రామ్మూర్తి అఖిల, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.