Saturday, May 10, 2025
Homeమానవిసంపాదన ఆమెది జల్సా అతనిది

సంపాదన ఆమెది జల్సా అతనిది

- Advertisement -

ఈ రోజుల్లో కూడా మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమా? అనే ప్రశ్న వస్తుంది. మహిళ ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా ఆమె సంపాదించిన డబ్బులను తన సొంతం కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం లేదు. ఆమె సంపాదించిన మొత్తం భర్త చేతిలోనో, తండ్రి చేతిలోనే పెట్టాలి. తనకు ఏదైనా కావాలంటే వాళ్లను అడగాలి. సంపాదన తనదే అయినా దానిపై ఆమెకు ఎలాంటి హక్కూ ఉండదు. ఇలా చాలా మంది మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో మీకోసం…
స్వాతికి సుమారు 48 ఏండ్లు ఉంటాయి. ఆమె ప్రభుత్వ ఉద్యోగి. భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఒక పాప, బాబు. ఇద్దరికీ మంచి ఆదాయం వస్తుంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా చదువుకొని జీవితంగా చక్కగా స్థిరపడ్డారు. కూతురు పెండ్లి చేసుకొని వేరే రాష్ట్రంలో ఉంటుంది. కొడుకు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అత్తామామా వీళ్ల దగ్గరే ఉంటారు.
అయితే స్వాతి జీతం మొత్తం భర్త అనీల్‌ తీసుకునేవాడు. అయినా స్వాతి ఎప్పుడూ ‘నాకు ఇది కావాలి’ అని అడిగేది కాదు. ఆమెకు ఏదైనా కావాలి అంటే ఇప్పటికీ తన తల్లిదండ్రులే చూసుకుంటారు. అనీల్‌ దుబారా ఖర్చులు బాగా చేస్తాడు. అందుకే స్వాతి పిల్లల భవిష్యత్‌ కోసం పదేండ్ల కిందట లోన్‌ తీసుకొని ఇల్లు కొన్నది. అయితే దానికి వచ్చే కిరాయి కూడా భర్తే తీసుకుంటాడు. అలాగే ప్రతి నెల పాప కోసం బంగారం కొనాలని కొంత మొత్తం కట్‌ చేయించేది. ఎల్‌ఐసీ కొంత కట్‌ చేయించేది. అవన్నీ పోను వచ్చిన జీతం మొత్తం అనీల్‌ తీసుకుంటాడు. ఏం చేస్తున్నాడో ఇంట్లో వాళ్లకు చెప్పేవాడు కాదు. స్వాతికి ప్రతి నెల బస్‌ చార్జీల కోసం మూడు వేలు మాత్రం ఇచ్చేవాడు. ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత అవి కూడా ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు చెప్పినా వినేవాడు కాదు. కొన్ని రోజులు చెప్పి వాళ్లు కూడా వదిలేశారు.
కూతురు పెండ్లికి సుమారు 80 లక్షల వరకు ఖర్చు అయింది. అందులో స్వాతి కట్టిన ఎల్‌ఐసీ డబ్బులే 50 లక్షలు ఉన్నాయి. బంగారం కూడా ఉంది. 30 లక్షలు అప్పు తెచ్చారు. అయితే ఇప్పుడు అప్పు తెచ్చిన డబ్బు కట్టడం లేదు. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటికి వచ్చి అడుగుతున్నారు. అనీల్‌ ఏమీ పట్టించుకోవడం లేదు. అదేంటని అడిగితే ‘నా దగ్గర డబ్బులు లేవు’ అంటున్నాడు.
‘ఇద్దరి జీతంతో పాటు ఇంటి కిరాయి కలిపితే నెలకు మొత్తం మూడు లక్షల వరకు వస్తాయి. ఇంత డబ్బు ఏం చేస్తున్నారు. నా జీతం డబ్బులు నాకు ఇచ్చేయండి. నేనే మొత్తం అప్పు కట్టుకుంటాను. అప్పులోళ్లు ఇంటి ముందుకు వచ్చి తిట్టడం బాగోలేదు. చూసే వాళ్లు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు. అయినా అప్పులు చేసి కట్టలేకపోవడం ఏంటీ అనుకుంటున్నారు’ అని భర్తను నిలదీసింది. దాంతో ‘ఇంట్లో నుండి వెళ్లిపో, నువ్వు నాకు అవసరం లేదు, విడాకులు తీసుకుంటాను’ అని స్వాతిని బెదిరిస్తున్నాడు.
అత్తమామలు ఆమెను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ‘నువ్వు ఎక్కడ ఉంటే మేమూ అక్కడే ఉంటాం’ అంటున్నారు. కానీ అనీల్‌ ఇన్నేండ్ల నుండి డబ్బు మొత్తం ఏం చేశాడో తెలియదు. అది తెలుసుకునేందుకు స్వాతి ఎన్నో ప్రయత్నాలు చేసింది. తెలిసిన విషయం ఏమిటంటే ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ఇల్లుపై కూడా అనీల్‌ అప్పు తీసుకు న్నాడు. అది కూడా చెల్లించాలి. అలాగే అతను వేరే ఆవిడతో కలిసి ఉంటున్నాడు. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. వచ్చిన డబ్బులు మొత్తం ఆమెకు ఇచ్చేస్తున్నాడు. గట్టిగా అడిగినందుకు స్వాతికి విడాకులు ఇస్తా అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక స్వాతి ఐలమ్మ ట్రస్ట్‌ ఐద్వా అదాలత్‌ దగ్గరకు వచ్చింది.
మేము ఫోన్‌ చేసి అనీల్‌ను పిలిపించాము. స్వాతి చెప్పిన విషయం గురించి అడిగితే ‘మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరమా? ఇస్తే మగవాళ్ల మాట అస్సలు లేక్క చేయరు. అందుకే డబ్బు వ్యవహారాలన్నీ నేను చూసుకుంటున్నాను. అయినా నాకు చెప్పకుండా ఆమె జీతంలో సగం డబ్బులు బంగారం, ఇల్లు అంటూ కట్‌ చేయించింది. అయినా నేను ఆమెను ఏమీ అనలేదు. సంసారాన్ని నడిపించేటప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి’ అన్నాడు. ‘సరే డబ్బుల వ్యవహారం గురించి తర్వాత మాట్లాడుకుందాం.. మీరు ఇంకో పెండ్లి ఎందుకు చేసుకున్నారు. భార్య ఉన్న తర్వాత మరో పెండ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం అనే విషయం మీకు తెలియదా? స్వాతి నిలదీసే సరికి విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నారు. ముందు ఈ విషయం గురించి చెప్పండీ’ అన్నాము.
‘నేను ఇంకో పెండ్లి చేసుకోలేదు. సహజీవనం చేస్తున్నాను. ఆమెను నేను ప్రేమిస్తున్నాను. అందుకే ఆమెతో కలిసి ఉంటున్నాను. స్వాతితో ఉండలేను. ఎప్పుడూ పిల్లలు, ఇల్లు, అత్తమామ అంటూ ఉంటుంది. నా గురించి అస్సలు ఆలోచించదు. అదే ఆమె ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తుంది. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నేను ఇది కావాలి అని చెప్పక ముందే తెచ్చి ఇస్తుంది. స్వాతి అయితే ఎప్పుడూ ఉద్యోగం.. ఉద్యోగం అంటూ తిరుగుతుంది. వున్న కొద్ది సమయంలో కూడా అత్తమామలను, పిల్లలను చూసుకోవ డంలో గడిపేస్తుంది. నేను ఆమెతో ఉండను’ అన్నాడు.
‘మరి మీ తల్లిదండ్రులు, పిల్లల పరిస్థితి’ అంటే ‘వాళ్లకూ నేను అవసరం లేదు. అందరూ స్వాతి గురించే ఆలోచిస్తారు’ అన్నాడు. అనీల్‌ తల్లిదండ్రులను కూడా పిలిచి మాట్లాడితే ‘కోడలైనా కూతురిలా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటుంది. అనీల్‌కు బాధ్యత అనేదే లేదు. మేము వాడితో ఉండలేము. ఇంత వయసు వచ్చినా కుటుంబం పట్ల వాడికి ఎలాంటి బాధ్యతా లేదు. సమాజం అంటే భయమూ లేదు. వాడిని వెళ్లిపొమ్మని చెప్పండి. మా కోడలికి మేము ఇంకో పెండ్లి చేస్తాము’ అన్నారు.
ఈలోపు స్వాతి ఏదో మాట్లాడబోతుంటే ‘మాకు అన్యాయం చేయొద్దు స్వాతి. వాడు నీచుడు. నీకు మేము అండగా ఉంటాము. రా పోదాము’ అన్నారు. కానీ స్వాతి, అనీల్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తే ‘నువ్వు నాకు అవసరం లేదు. నా తల్లిదండ్రులను నాకు కాకుండా చేశావు’ అన్నాడు. అయితే స్వాతి మాత్రం ‘ఆమెను వదిలి పెట్టి మాతో రండీ, మిమ్మల్ని బాగా చూసుకుంటాను’ అని ఎంతో బతిమలాడింది. కానీ అతను మాత్రం ఆమెతోనే ఉంటాను అన్నాడు.
దాంతో ‘స్వాతి అతను రానంటున్నాడు. ప్రస్తుతం వదిలేయండి. మీ జీతం నుండి ఇకపై అతనికి ఒక్కపైసా కూడా ఇవ్వకండి. అప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఎలా వుంటుందో. మంచి ఉద్యోగం చేస్తున్నారు, కుటుంబం మొత్తం మీకు అండగా ఉంది. ధైర్యంగా ఉండండి. తర్వాత అతనే మీ దారికి వస్తాడు’ అని చెప్పి పంపించాము.

  • వరలక్ష్మి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -