Friday, September 26, 2025
E-PAPER
Homeసినిమావాస్తవంగా జరిగింది ఇది..

వాస్తవంగా జరిగింది ఇది..

- Advertisement -

గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశంలో జగన్‌ హయంలో చిత్ర పరిశ్రమ పరిస్థితి గురించి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్‌, బాలకృష్ణ మాట్లాడారు. ‘ఇండిస్టీ మొత్తం అప్పటి సీఎం జగన్‌ని కలవడానికి వచ్చినప్పుడు మొదట ఆయన అందుబాటులోకి రాకుండా, సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారు. దానిపై చిరంజీవి గట్టిగా అడిగితే, సీఎం జగన్‌ అందుబాటులోకి వచ్చారు’ అని శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్‌ చెప్పగా, దీనికి సభలోనే ఉన్న బాలకృష్ణ స్పందిస్తూ, ‘చిరంజీవి గట్టిగా అడిగాక జగన్‌ దిగి వచ్చారన్నది అబద్ధం. అవమానం జరిగింది మాత్రం నిజం’ అని అన్నారు. అసెంబ్లీ సమావేశంలో తన పేరు ప్రస్తావిస్తూ మాట్లాడటంపై అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను నేను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూశా. ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొందరు నిర్మాతలు నన్ను కలిశారు. టికెట్‌ ధరల పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. సీఎం ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను.

భోజనం చేస్తున్న సమయంలోనే సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని ఆయనకు వివరించా. ఇండిస్టీకి, మీకు మధ్య గ్యాప్‌ ఉందని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని కోరాను. కొన్ని రోజుల తరువాత పేర్నినాని నాకు ఫోన్‌ చేసి ‘కోవిడ్‌ వల్ల ఐదుగుర్ని మాత్రమే రమ్మన్నారు’ అని చెప్పారు. బాలకృష్ణను కలిసేందుకు ప్రయత్నించినా అప్పుడు అందుబాటులోకి రాలేదు. ఆర్‌.నారాయణమూర్తితో సహా కొంతమందితో వెళ్లి సీఎంను కలిశాం. సినీ పరిశ్రమలోని సమస్యల్ని వివరించి, సహకారం కావాలని కోరాం. అప్పుడు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను చొరవ తీసుకోవడం వల్లే ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసింది. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలకు టికెట్‌ ధరలు పెరిగాయి. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లుకు లాభం చేకూరింది. సీఎంతోనైనా, సామాన్యుడితోనైనా సహజసిద్ధమైన ధోరణిలో మాట్లాడుతా. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడతా. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -