Friday, September 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రపంచంపై ట్రంప్‌ యుద్ధం !

ప్రపంచంపై ట్రంప్‌ యుద్ధం !

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచంపై యుద్ధం ప్రకటించాడా అంటే అవుననే చెప్పాలి. మంగళవారం నాడు ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ 80వ సమావేశంలో తనకు కేటాయించిన వ్యవధి కంటే నాలుగు రెట్లు అదనంగా తీసుకొని 56 నిమిషాల పాటు చేసిన ప్రసంగం దాన్నే సూచిస్తున్నది. ‘నా ఇష్టం ఎంతసేపైనా, ఏదైనా మాట్లాడతా, ప్రపంచానికి రారాజును, నన్ను ఆపేదెవరు’ అన్నట్లుగా వ్యవహరించాడు. సభ మొత్తం అవాక్కయింది. వర్తమాన చరిత్రను చూసినపుడు ఏ మూలన ఏ అశాంతి తలెత్తినా, సంఘర్షణ చోటుచేసుకున్నా, యుద్ధం జరిగినా పరోక్షం లేదా ప్రత్యక్షంగా అమెరికా హస్తం కనిపిస్తుంది. అలాంటి దేశాధినేతగా ప్రపంచ ఘర్షణల విషయంలో ఐరాస పనితీరును చూస్తే వివక్ష, అసమర్ధత కనిపిస్తున్నదని ధ్వజమెత్తటం తెంపరితనం తప్ప మరొకటి కాదు. గాజాలో పాలస్తీనియన్లను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని, ఐరాస అధ్వర్యంలో నడుస్తున్న మానవతాపూర్వక సహాయ కేంద్రాలు, నిర్వాసిత ప్రాంతాలపై జరుగుతున్న దాడులను కూడా నిస్సిగ్గుగా సమర్ధించాడు. వాటిని ఖండిస్తూ నివారణకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆరుసార్లు వీటో చేసిన సంగతిని దాచిపెట్టేందుకు ఐరాస మీద ధ్వజమెత్తటం గుండెలు తీసే బంట్లకు తప్ప మరొకరికి సాధ్యం కాదు. సామ్రాజ్యవాదులు సృష్టించిన సంక్షోభాల కారణంగానే అనేక చోట్ల నిర్వాసితుల సమస్య తలెత్తింది. అలాంటి చోట్ల మానవతా పూర్వక సాయం అందచేయటంలో ఐరాస విఫలమైందని, పశ్చిమదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులకు తోడ్పడుతున్నదని కూడా ధ్వజమెత్తాడు.

ఐరాస విఫలమౌతున్నమాట నిజం. దానికి కారణం ఆ వ్యవస్థ నిర్మాణంలో ఉన్న లోపాన్ని అమెరికా వినియోగించుకోవటమే.. ఆ లోపాలను సరిదిద్ధి సంస్కరిస్తే తప్ప అది కూడా నానాజాతి సమితి బాటలోనే నిర్వీర్యంగాక తప్పదు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులు, క్యూబాపై అమెరికా దిగ్బంధనంపై ప్రతియేటా అత్యధిక మెజారిటీతో సాధారణ అసెంబ్లీ తీర్మానాలు చేస్తున్నప్పటికీ వాటికి వీసమెత్తు విలువ లేదు. భద్రతామండలిలో వీటో అధికారంతో అమెరికా సైంధవుడిలా అడ్డుకుంటున్నది.గతంలో అమెరికా కూటమి దుర్మార్గాలను అడ్డుకొనేందుకు నాటి సోవియట్‌ యూనియన్‌ వీటో అధికారాన్ని ఎక్కువసార్లు ఉపయోగిస్తే ఇప్పుడు అదే అమెరికా దుర్మార్గాలను అడ్డుకొనే తీర్మానాలను స్వయంగా అడ్డుకుంటున్నది. అసమర్ధంగా ఉందంటూ ఐరాస మీద ధ్వజమెత్తుతున్నది. జర్మన్‌ పార్లమెంటును స్వయంగా తగులబెట్టించి కమ్యూనిస్టుల మీద నెపం నెట్టిన దుర్మార్గుడు హిట్లర్‌కూ ట్రంప్‌కు తేడా ఏముంది? ప్రపంచంలో నియంతలు, నరహంతక నాజీలు, ఫాసిస్టులందరూ ఇలాగే చేశారు. తమ దుర్మార్గ అజెండాను అమలు జరిపేందుకు ఇలాంటి సాకులనే చెప్పారు.

ట్రంప్‌ ప్రసంగంలో రెండు అంశాలు గమనించాల్సినవి. ఒకటి తమను వ్యతిరేకించే చైనా, రష్యా, భారత్‌ వంటి దేశాల మీద ధ్వజమెత్తటమే కాదు, తన అడుగులకు మడుగులొత్తని ఐరోపా మిత్రదేశాలను కూడా వదలిపెట్టలేదు. వలసలను పరిమితం చేయటం, వచ్చిన వారిని వెనక్కు పంపటంలో ఐరోపా దేశాలు గట్టిగా వ్యహరించటం లేదన్నాడు. హరిత ఇంథనం వంటి ఆత్మహత్యా సదృశ్యమైన విధానాలను అనుసరిస్తున్నాయని కూడా ఆరోపించాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే తన పాటకు అనుగుణంగా నృత్యం చేయటం లేదని మండిపడ్డాడు. రష్యా చమురు కొనుగోలు చేసి భారత్‌, చైనా పుతిన్‌కు తోడ్పడుతున్నాయని ఇప్పటి వరకు పాట పాడిన అమెరికా కొత్త పల్లవి అందుకుంది. రష్యా ముడిచమురుతో భారత్‌ నుంచి వస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఐరోపా కూడా రష్యాకు సాయపడుతున్నదంటూ అమెరికా విత్తమంత్రి స్కాట్‌ బెసెంట్‌ తాజాగా ధ్వజమెత్తాడు. అందరూ కలసి సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ఐరోపా దేశాల మీదకు నెట్టి తాను బయటపడేందుకు అమెరికా చేసిన యత్నాన్ని ఫ్రాన్సు, జర్మనీ వంటి అగ్రదేశాలు ఒక విధంగా వమ్ము చేశాయి.

ఎందుకంటే సామ్రాజ్యవాదులుగా ఎవరి అజెండా వారిది. అధికారానికి వచ్చిన 24గంటల్లోనే పోరు నిలిపివేస్తానని చెప్పిన ట్రంప్‌ రష్యా కాగితపు పులి అని, యుద్ధంలో ఉక్రెయిన్‌ గెలుస్తుందని, గతంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటుందని తాజాగా చెప్పాడు. అంటే సంక్షోభాన్ని పరిష్కరించేదిశలో లేనట్లు స్పష్టం చేశాడు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయిల్‌ దుర్మార్గాన్ని సమర్ధించటం లో అమెరికాతో పాటు ఐరోపా అగ్రరాజ్యాలు కూడా తక్కువ తినలేదు. ఇప్పుడు కొన్ని పాలస్తీనాను గుర్తించటంతో తమ మీద పెరుగుతున్న ఒత్తిడిని అమెరికా తట్టుకోలేక పోతున్నది. ఎవరి ప్రయోజనాలకు వారు పెద్దపీట వేసుకుంటున్న తరుణంలో అమెరికా దిక్కుతోచని స్థితి, తెగింపు కూడా ఐరాస ప్రసంగంలో కనిపించింది, ప్రపంచానికి ప్రమాద ఘంటికలను మోగించింది!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -