జస్టిస్ ఘోష్ రిపోర్టుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికకు సంబంధించి నాటి సీఎంఓలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు గురువారం హైకోర్టులో పెద్ద ఎత్తున ఊరట లభించింది. ఘోష్ కమిషన్ సిఫారసుల ఆధారంగా సభర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక అమలును నిలిపివేయాలంటూ సభర్వాల్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించి మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. పిటిషనర్‌ను కమిషన్ సాక్షిగా పిలవగా వెళ్లి సమాచారం అందించిన సభర్వాల్‌పై ఏకపక్షంగా ఆరోపణలతో అదే కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆమె తరుపు న్యాయవాది రామచంద్రరావు వాదించారు.
కమిషన్ చట్టంలోని సెక్షన్ 8(బి), 8(సి) కింద నోటీసు ఇవ్వకుండానే తుది నిర్ణయానికి రావడం సరికాదన్నారు. ఆరోపణలకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. సీఎంవోలో అదనపు కార్యదర్శిగా చేసేప్పుడు పిటిషనర్ నిర్లక్ష్యంగా, బాధ్యతరాహిత్యంగా విధులు నిర్వహించారంటూ నివేదికలో పేర్కొన్నదని వివరించారు. పిటిషనర్ చర్యలకు అర్హురాలని కూడా ఉందన్నారు. ఇలాంటి విషయాల అమలును నిలిపివేయకపోతే శాఖాపర, క్రమశిక్షణా చర్యలకు వీలు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, పిటిషనర్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారనే విషయాన్ని తెలిపారు. వాదనల తరువాత హైకోర్టు, జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్లతో దీనిని జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని ప్రకటించింది.
స్మితా సబర్వాల్‌పై చర్యలొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES