తెలంగాణకొచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 45 శాతం సీట్లిస్తాం : బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్వీ.సుభాష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ఎఫ్ 3 ప్రభుత్వం (ఫేక్, ఫెయిల్డ్, ఫ్రాడ్ ప్రామిసెస్) నడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జి ఎన్వీ.సుభాష్ విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మోడల్‌ను బీహార్‌లో, దేశంలో విస్తరిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందనీ, తెలంగాణలో ఎఫ్3 పాలనను దేశవ్యాప్తంగా అమలు చేస్తానటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో ఎన్ని సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఐదడుగులు పెంచుతుంటే రాష్ట్ర సర్కారు ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,500 కోట్లు నిలిచిపోయినా రాష్ట్ర సర్కారుకు పట్టడం లేదనీ, ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నదని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ బీసీ అభ్యర్థులకు 45 శాతం సీట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
తెలంగాణలో ఎఫ్3 ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES