పండుగ రోజుల్లో గిగ్ వర్కర్లపై భారం
పని గంటల పెంపు
న్యూఢిల్లీ : ఇ-కామర్స్, డెలివరీ వేదికల్లో పని చేసే గిగ్ వర్కర్ల జీవితాలు చాలా దుర్బరంగా ఉన్నాయి. దసరా, దీపావళి పండగల సందర్బంగా ఆన్‌లైన్ విక్రయాలు, సరఫరాలు చాలా పెరిగాయి. ఒకప్పుడు పండుగ రోజుల్లో డెలివరీ వర్కర్లకు తక్కువ గంటల పని, స్థిరమైన ఆదాయాన్ని అందించే అవకాశంగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి అత్యంత బిజీగా, ఒత్తిడితో కూడిన పరిస్థితులుగా మారాయి. మూడు సంవత్సరాల క్రితం, డెలివరీ వర్కర్లు ఒక రోజులో సుమారు 20 ఆర్డర్లతో రూ.600-800 సంపాదించగలిగేవారు. ఈ ఏడాది చాలామంది 14-15 గంటలు పనిచేసి, దాదాపు రెట్టింపు ఆర్డర్లను పూర్తి చేసినప్పటికీ, దాదాపు అదే మొత్తాన్ని మాత్రమే సంపాదిస్తున్నారు. దేశంలో 2020-21 నాటికి 77 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని నీతి అయోగ్ వెల్లడించింది. ఇది గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25 నాటికి 1.2 కోట్లకు చేరారని అంచనా. 2029-30 నాటికి 2.35 కోట్లకు చేరొచ్చని తెలిపింది.
ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు
-ఆర్థిక భద్రత లేకపోవడం ప్రధాన ఆందోళనగా ఉంది.
-ప్రావిడెంట్ ఫండ్ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లేకపోవడం.
-శాశ్వత ఉద్యోగ అవకాశాలు తక్కువ.
-రిఫెరల్ బోనసలు, అధిక గంటల వేతనాల్లో అసమానతలు.
-పరిమితంగా సెలవులు.
ప్రస్తుత పండుగ సీజన్‌లో వివిధ ప్లాట్‌ఫారమ్‌లు 2.50 లక్షల మంది కంటే ఎక్కువ సీజనల్ వర్కర్లను నియమించుకున్నాయని అంచనా. ఈ సంఖ్య గత సంవత్సరం కంటే 20-25 శాతం ఎక్కువ. కంపెనీలు ఈ పెరుగుదలను సంబరంగా జరుపుకుంటున్నప్పటికీ, వర్కర్లు మాత్రం ఆర్డర్‌కు తగ్గిన చెల్లింపులు లేకపోవడంతో పాటుగా పెరిగిన పని భారాన్ని సతమతవుతోన్నారు. ఉద్యోగ నియామకాలకు కంపెనీలకు సాయం చేసే స్టాఫింగ్ సంస్థల డేటా ప్రకారం.. పండుగ వారాల్లో గిగ్ వర్కర్లు సాధారణ రోజులతో పోలిస్తే 60-80 శాతం ఎక్కువ ఆర్డర్లను డెలివరీ చేస్తారు. మరోవైపు గత సంవత్సరంతో పోలిస్తే ఆర్డర్‌కు చెల్లించే మొత్తం 25 శాతం వరకు తగ్గిందని ఆ రంగంలో పని చేసే వారు గగ్గోలు పెడుతున్నారు. బయట ఉపాది లేక ఈ రంగంపైన ఆధారపడే గిగ్‌వర్కర్లు పెరగడంతో కంపెనీలు అదను చూసి ఆర్డర్‌కు చెల్లించే రేేట్లను మరింత తగ్గించాయి.
సాధారణ రోజుల్లో గిగ్ వర్కర్లు 12-18 ఆర్డర్లను కలిగి ఉంటే.. పండుగ సీజన్‌లో ఇది 22-32కు చేరిందని అడెకో ఇండియా డైరెక్టర్, జనరల్ స్టాఫింగ్ హెడ్ దీపేష్ గుప్తా తెలిపారు. క్విక్ కామర్స్‌లో ఆర్డర్‌కు చెల్లించే రేట్లు గణనీయంగా తగ్గాయన్నారు. 2024లో రూ.34 నుండి రూ.42 వరకు ఉన్న చెల్లింపులు 2025లో రూ.22-30కి తగ్గాయని గుప్తా తెలిపారు. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు ఒక్కో డెలివరీకి రూ.15-25 మాత్రమే చెల్లిస్తున్నాయన్నారు. పీక్ అవర్స్‌లో రూ.13-15 సర్జ్ బోనస్‌లు అందిస్తున్నాయన్నారు. కానీ భారీ ట్రాఫిక్ కారణంగా వర్కర్లు పూర్తి చేయగల ఆర్డర్ల సంఖ్య తగ్గడంతో ఈ ప్రయోజనాలతో పెద్ద ప్రయోజనం లేదని అంటున్నారు.పని గంటలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని టీమ్‌లీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణియన్ అనంత నారాయణన్ పేర్కొన్నారు. సాధారణంగా 8-10 గంటలతో పోల్చితే పండుగ సీజన్‌లో షిఫ్ట్‌లు 12-14 గంటలకు పెరిగాయన్నారు. తక్కువ చెల్లింపు, అధిక పని గంటలు గిగ్ వర్కర్లను ఆందోళన గురి చేస్తోన్నాయన్నారు.
పని ఎక్కువ పైసలు తక్కువ
- Advertisement -
- Advertisement -