రాష్ట్రం నుంచి దేశ విదేశాలకు నాణ్యమైన విత్తనాల ఎగుమతి : సీడ్మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో ‘గ్లోబల్ సీడ్ క్యాపిటల్’గా అవతరించబోతున్నదని తెలిపారు. గురువారం సీడ్మెన్ అసోసియేషన్ 30వ వార్షికోత్సవ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ 25 ఏండ్లుగా సీడ్మెన్ అసోసియేషన్ రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, ప్రభుత్వాల మధ్య బలమైన వారధిగా నిలిచిందని అభినందించారు. నాణ్యమైన విత్తనాల తయారీలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రస్తుతం 3.5 లక్షల మంది రైతులు…ఎనిమిది లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా రాష్ట్రం నుంచి రూ.2వేల కోట్ల విలువైన లక్ష టన్నుల విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ విత్తనాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. రైతుల కష్టం, క్రమశిక్షణ, అవగాహనతో ఈ విజయం సాధ్యమవుతున్నదని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.3 లక్షల ఎకరాల్లో సాగుతున్న ఆయిల్‌పామ్, భవిష్యత్తులో మరింత విస్తరించి రాష్ట్రాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనుందని స్పష్టం చేశారు. నిజాయితీగా పని చేసే విత్తన కంపెనీలను ప్రోత్సహించడం, నకిలీ విత్తనాల నుంచి రైతులను రక్షించడం రెండూ ముఖ్యమని చెప్పారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు తెలంగాణ విత్తన చట్టానికి సవరణలను తీసుకొస్తున్నామనీ, ప్రస్తుతం అవి ముసాయిదా దశలో ఉన్నాయని తెలిపారు. సీడ్ ఇండిస్టీ అభివృద్ధికి అవసరమైన అన్ని సహకారాలను అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. విత్తనాలను సరఫరా చేయడమే కాకుండా జ్ఞానాన్ని పంచే కేంద్రంగా కూడా తెలంగాణ నిలిచిందన్నారు. 1995 నుంచి రైతులు, కంపెనీలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల మధ్య అనుసంధానంగా పని చేస్తూ విత్తన రంగానికి విశేష సేవలందించినందుకు సీడ్మెన్ అసోసియేషన్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సెర్ఫ్‌్ ఈసీవో విజరుకుమార్, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, సీడ్‌మెన్ అసోషియేషన్ సభ్యులు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.