Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంనాలుగు నెలల నుంచి ఏం చేస్తున్నారు?

నాలుగు నెలల నుంచి ఏం చేస్తున్నారు?

- Advertisement -

ఆ అధికారులను కాపాడుతున్నారా?
ఇది తీవ్రమైన కోర్టు ధిక్కారమని అర్ధమవుతోందా
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, సీబీఐలపై మండిపడ్డ సుప్రీం
కస్టడీ మరణాలపై ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేయలేదని ఆగ్రహం

న్యూఢిల్లీ : గతేడాది జులైలో కస్టడీలో వుండగా ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమైన ఇద్దరు పోలీసు అధికారులను అరెస్టు చేయడంలో విఫలమైనందుకు మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీబీఐని సుప్రీం కోర్టు గురువారం తీవ్రంగా మందలించింది. మే 15న జారీ చేసిన ఆదేశాలను ఇంతవరకు అమలు చేయకపోవడాన్ని తీవ్రమైన కోర్టు ధిక్కారంగా పరిగణించామని పేర్కొంది. ”నాలుగు నెలలకు పైగా గడిచాయి. కానీ కోర్టు ఆదేశాలు ఇంతవరకు అమలు కాలేదు.అంటే మీరు ఆ అధికారులను కాపాడుతున్నట్లు కనిపిస్తోంది.” అని జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతుని పిల్లలు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆదేశాలు ఉల్లంఘించారని ఆ పిటిషన్‌ ఆరోపించింది. గతంలో రాష్ట్ర పోలీసులు ఈ దర్యాప్తులో వాస్తవాలను దాచిపెడుతూ రాజీపడే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును మధ్యప్రదేశ్‌ పోలీసుల నుంచి సీబీఐకి బదలాయించారు. దర్యాప్తు బాధ్యతలను సిబిఐకి బదలాయిస్తూ కోర్టు, కస్టడీ మరణాలకు కారణమైన పోలీసు అధికారులను వెంటనే అరెస్టు చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు దాటకుండా ఈ అరెస్టులు జరగాలని పేర్కొంది. కోర్టు ఇంత స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ నిందితులైన అధికారులకు వేతనాలు జారీ చేస్తూనే వుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది పాయోషి రారు వాదించారు.

దీనిపై నాగరత్న తీవ్రంగా స్పందించారు. అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ అయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేతనాలు మంజూరు చేస్తుందని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. అయితే అరెస్టు చేయాల్సిన బాధ్యత సీబీఐదేనని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. దానికి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన జస్టిస్‌ మహదేవన్‌, ఇంత తీవ్రమైన నేరం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన మీరు బాధ్యతలను ఎలా వదిలించేసుకుంటారని తీవ్రంగా ప్రశ్నించారు.దానిపై సీబీఐ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్‌ జనరల్‌ రాజా థాకరే మాట్లాడుతూ, బుధవారం వారిద్దరినీ సస్పెండ్‌ చేశామని కోర్టుకు తెలియచేశారు. వారి ఆచూకీ తెలియచేసిన వారికి ఒక్కొక్కరికీ రూ.2లక్షలు నగదును కూడా ప్రకటించామన్నారు. నిన్నే ఎందుకు చేశారు? ఏప్రిల్‌ నుండి వారు పరారీలో వున్నారని మీరు చెబుతున్నారు. అంటే అర్ధం ఏమిటి? మీ ప్రయత్నాలన్నీ కేవలం కంటి తుడుపు చర్యలే అని న్యాయమూర్తులు తీవ్రంగా వ్యాఖ్యానించారు. తక్షణమే వారి అచూకీని కనుగొనేందుకు రాష్ట్ర డిజిపిని కలవాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. ఆ పోలీసు అధికారులు ఇండోర్‌లో ఒక సెషన్స్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారని పిటిషనర్‌ తరపు న్యాయవాది చెప్పారు. దానిపై జస్టిస్‌ మహదేవన్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ‘మీరు వారిని కాపాడుతున్నారు. సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకంగా ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసే ధైర్యం వారికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన అభ్యర్ధనల మేరకు ఈ నెల 26కి కేసును కోర్టు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -