Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసిరిసిల్ల కలెక్టర్‌ను మందలించండి

సిరిసిల్ల కలెక్టర్‌ను మందలించండి

- Advertisement -

సీఎస్‌కు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భూసేకరణకు సంబంధించిన వివాదంపై పిటిషన్‌ వేసిన వ్యక్తిపై కలెక్టర్‌ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కలెక్టర్‌ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇంకా సర్వీస్‌ ఉన్నందున చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశిస్తే కెరీర్‌లో నష్టపోతారని చెప్పి వదిలిపెడుతున్నట్టు పేర్కొంది. కలెక్టర్‌ను పిలిచి మందలించాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు ఈ నెల 23న కీలక తీర్పు వెలువరించింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల ఆధారంగా వేములవాడ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్‌ కేసును హైకోర్టు రద్దు చేసింది. దీంతో భూసేకరణ పరిహారం, హక్కుల కోసం పోరాడుతున్న భూ యజమానురాలికి ఊరట లభించింది. అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా పరిహారం చెల్లింపు, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ హక్కుల సాధన పొందే వారి జాబితాలో తన పేరు లేదంటూ ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమెకు పరిహారం చెల్లించాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. సింగిల్‌ జడ్జి ఆర్డర్‌ అమలు చేయలేదని కవిత కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇవి కోర్టులో పెండింగ్‌లో ఉండగానే తప్పుడు సమాచారమిచ్చి ఉత్తర్వులు పొందారనే కారణంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వేములవాడ పోలీస్‌ స్టేషన్‌లో కవితపై మోసపూరిత నేరాభియోగాలపై క్రిమినల్‌ కేసు (క్రైమ్‌ నం.592/2024) నమోదు అయింది. ఈ కేసును కూడా కవిత హైకోర్టులో సవాలు చేశారు. పరిహారం హక్కుల విషయంలో తాము ఎవరినీ మోసం చేయలేదనీ, కలెక్టర్‌ ఆదేశాల ఆధారంగా పోలీసులు తప్పుడు కేసు నమోదు చెల్లదని ఆమె తరఫు సీనియర్‌ న్యాయవాది వివి రమణరావు వాదించారు. పరిహారం పొందడంలో మోసపూరిత చర్యలకు పాల్పడలేదని తెలిపారు. భూమి స్వాధీనం ప్రక్రియలో చట్టబద్ధ హక్కులను ఉపయోగించుకున్నట్టు వివరించారు. పిటిషనర్‌ ఎలాంటి తప్పు చేయలేదనీ, అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. పోలీసులు కేసు విచారణకు తగిన ఆధారాలు లేకుండానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్నారు. పోలీసులు స్వతంత్ర విచారణ జరపకుండా, కేవలం కలెక్టర్‌ ఆదేశాలపై ఆధారపడి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. ఇది న్యాయపరంగా చెల్లదనీ, హక్కులకు భంగం కలిగించడమేనని అన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం తీసుకున్న చర్యలు చట్టపరంగానే ఉన్నాయని పేర్కొన్నారు. భూ పరిహారం కేటాయింపులపై ఎదురైన కీలక విషయాల ఆధారంగా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పరిహారం కోరే విషయంలో పలు సందేహాలు ఉన్నందునే పోలీసులు చట్టపరంగా కేసు నమోదు చేశారని తెలిపారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, పలు కీలక అంశాలతో ఉత్తర్వులను జారీ చేసింది. కేసు నమోదులో పోలీసులు స్వతంత్రంగా విచారణ చేయలేదని తప్పుపట్టింది. కలెక్టర్‌ ఆదేశాలను ఆధారంగా చేసుకుని మాత్రమే వ్యవహరించారని గుర్తించింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణలకు తగిన చట్టబద్ధ ఆధారాలు లేవని ఆక్షేపించింది. పౌరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేప్పుడు చట్టపరమైన ప్రమాణాలు పాటించాలనీ, లేదంటే అది పౌరహక్కుల ఉల్లంఘన అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ వనపట్ల కవితపై నమోదు చేసిన క్రిమినల్‌ కేసు చెల్లదని పేర్కొంటూ దాన్ని రద్దు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణలకు ఆధారాలు లేవని తేల్చింది. పోలీసులు స్వతంత్ర విచారణ జరపకపోవడం, పూర్తిగా కలెక్టర్‌ ఆదేశాలపైనే ఆధారపడటం తీవ్ర తప్పిదమని వ్యాఖ్యానించింది. ఆరోపణలకు తగిన ఆధారాల్లేవని ఆక్షేపించింది. ప్రజలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేప్పుడు అధికారులు చట్ట నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. భూసేకరణ, పరిహారం, భూమి నష్టపోయిన వారి హక్కుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు పోవాలని కోరింది. ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేయరాదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావత్తం కాకూడదని కూడా హెచ్చరించింది. జిల్లా కలెక్టర్‌ను మందలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -