క్రెమ్లిన్ వ్యాఖ్యలు
మాస్కో, వాషింగ్టన్ : ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశగా కృషి చేయడానికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా కట్టుబడి వున్నారని తాము భావిస్తున్నామని క్రెమ్లిన్ గురువారం వ్యాఖ్యానించింది. ఈ వారం ప్రారంభంలో ఉక్రెయిన్‌కు అనుకూలంగా ట్రంప్ స్వరం మార్చిన నేపథ్యంలో క్రెమ్లిన్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. రష్యా స్వాధీనం చేసుకున్న భూమిని కీవ్ తిరిగి హస్తగతం చేసుకోగలదని తాను భావిస్తున్నట్లు ట్రంప్ మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశానంతరం వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు తగిన చర్యలు తీసుకోనందుకు రష్యా వైఖరి పట్ల ట్రంప్ చాలా అసహనంగా వున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ బుధవారం విలేకర్లతో వ్యాఖ్యానించారు.
విశ్వాసంతో రష్యా చర్చలు జరపకపోతే అది వారి దేశానికే మంచిది కాదని అధ్యక్షుడు స్పష్టం చేశారని, అంతేకానీ ఇదేమీ వైఖరి మార్చినట్లు కాదని వాన్స్ చెప్పారు. వాన్స్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా వైఖరి మారిందని భావిస్తున్నారా అని విలేకర్లు ప్రశ్నించగా, క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ స్పందిస్తూ, అలా అనుకోవడం లేదని అన్నారు. ఉక్రెయిన్‌కు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనే దిశగా కృషి చేయాలనే రాజకీయ సంకల్పంతోనే వాషింగ్టన్ ఇంకా వుందని తాము భావిస్తున్నామన్నారు.
మూడుసార్లు బాధితుడిని : ట్రంప్
మంగళవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించడానికి తాను వచ్చిన సందర్భంగా మూడు దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ బలగాలు దర్యాప్తు చేపడతాయని ట్రంప్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి వైఖరిని, వ్యవహార శైలిని విమర్శిస్తూ ప్రసంగించిన ట్రంప్, ఆ రోజున జరిగిన మూడు సంఘటనలు చూస్తే తనపై కుట్ర పన్నినట్లు అనుమానం తలెత్తుతోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో పోస్టు పెట్టారు. తాను ఎస్కలేటర్‌పై రాగానే అది ఒక్కసారిగా ఆగిపోయిందని, ఇది పూర్తిగా కుట్రేనని అన్నారు. అలాగే తన టెలీ ప్రాంప్టర్ కూడా పనిచేయలేదని చెప్పారు. అలాగే తాను ప్రసంగిస్తుండగా సౌండ్ ఆగిపోయిందని, దీంతో తానేమీ మాట్లాడుతున్నానో వినబడలేదని చెప్పారు. ఇవేమీ యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనలు కావని, తనపై కుట్రతో చేపట్టిన విద్రోహక చర్యలేనని ట్రంప్ విమర్శించారు. వీటిపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి వివరణ కూడా ఇచ్చారు.
మా నిజమేంటో చెబుతాం : నెతన్యాహు
ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు శుక్రవారం జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ‘మా నిజమేంటో మాట్లాడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ ప్రజలు, సైనికులు మొత్తంగా దేశం వైఖరి తెలియచేస్తామన్నారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా పలు దేశాలు గుర్తించడాన్ని నెతన్యాహు తీవ్రంగా నిరసించారు. ట్రంప్‌తో కూడా మరికొద్ది గంటల్లో ఆయన భేటీ కానున్నారు.
ఉక్రెయిన్‌పై ట్రంప్ వైఖరి మారట్లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES