బట్వాడలో 10 శాతం కలిపి పీఎఫ్ చెల్లించాల్సి ఉండగా.. 2, 3 శాతానికి పరిమితం
1600 మంది కార్మికులకు లక్షల రూపాయల పీఎఫ్ డబ్బుల ఎగవేత..?
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న కార్మిక శాఖ
నవతెలంగాణ-రామాయంపేట
బతుకుదెరువు కోసం బీడీలు చుట్టి తమ రక్తాన్ని చెమటగా మార్చుకుంటున్న బీడీ కార్మికుల జీవితాలతో ‘ఉత్తమ్ బీడీ కంపెనీ’ ఆడుకుంటోంది. కార్మికులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బును అక్రమంగా దోచుకుంటూ యాజమాన్యం వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. రామాయంపేట, మెదక్, పాపన్నపేట, నిజాంపేట వంటి పలు మండలాల్లో సుమారు 1600 మంది కార్మికులు ఈ మోసానికి బలవుతున్నారు. కార్మికుల తరపున మాట్లాడాల్సిన కార్మిక శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉత్తమ్ బీడీ కంపెనీ, తమ కార్మికుల సంక్షేమాన్ని పక్కనపెట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చట్ట ప్రకారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)లో జమ చేయాల్సిన మొత్తాన్ని తక్కువగా జమ చేస్తూ, కార్మికులను మోసం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలపై కార్మిక శాఖ చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నియమాలను ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్’ యాజమాన్యం
సాధారణంగా, బీడీ కార్మికులకు చెల్లించే నెలవారీ వేతనంలో 10శాతం చొప్పున పీఎఫ్ కోసం కట్ చేయాలి. అంతేకాకుండా, కంపెనీ యాజమాన్యం కూడా తమ వాటాగా మరో 10శాతం కలిపి మొత్తాన్ని కార్మికుల పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. అయితే, ఉత్తమ్ బీడీ కంపెనీ ఈ నిబంధనలను పాటించడం లేదు. కార్మికుల వేతనం నుంచి కేవలం రెండు లేదా మూడు శాతం మాత్రమే పీఎఫ్ కింద కట్ చేస్తోంది. దీనివల్ల కంపెనీ కూడా తక్కువ మొత్తాన్ని మాత్రమే జమ చేస్తూ, కార్మికులకు రావాల్సిన పీఎఫ్ డబ్బును దోచుకుంటోంది. రామాయంపేట, పాపన్నపేట, నిజాంపేట, మెదక్ వంటి పలు మండలాల్లో సుమారు 1600 మంది ఈ కంపెనీలో బీడీ కార్మికులుగా పని చేస్తు న్నారు. ఒక బీడీ కార్మికురాలు నెలకు సుమారు రూ.2500 వేతనం అందుకుంటే, నిబంధనల ప్రకారం రూ.250 పీఎఫ్ కోసం కట్ చేయాలి. అంతేకాకుండా, కంపెనీ తన వాటాగా మరో రూ.250 కలిపి మొత్తం రూ.500 కార్మికురాలి పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. కానీ, ఉత్తమ్ బీడీ యాజమాన్యం కేవలం రూ.50 నుంచి రూ.60 మాత్రమే కట్ చేసి, అదే మొత్తాన్ని కంపెనీ కలిపి పీఎఫ్ జమ చేస్తోంది. దీనివల్ల ఒక్కో కార్మికురాలికి ప్రతి నెలా రూ.200 నష్టం జరుగుతోంది. కొంతమందికి రూ.20, రూ.30 కూడా పీఎఫ్ కట్ చేస్తున్నట్టుగా కార్మికులు చెప్తున్నారు.
ప్రతి నెలా లక్షల్లో దోపిడీ..?
1600 మంది కార్మికులను మోసం చేస్తూ ఉత్తమ్ బీడీ కంపెనీ ప్రతి నెలా రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు కార్మికులకు పీఎఫ్ చెల్లించకుండా తప్పించు కుంటుందని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో, పెద్ద మొత్తంలో బీడీ కార్మికులకు కుచ్చుటోపి పెట్టినట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికులు తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తుంటే, యాజమాన్యం వారి శ్రమను దోచుకుంటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మిక శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం
కార్మికుల హక్కులను కాపాడాల్సిన కార్మిక శాఖ ఈ సమస్యపై దృష్టి సారించడం లేదని తీవ్ర ఆరోపణలున్నాయి. కార్మిక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కార్మికులకు న్యాయం జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కార్మిక శాఖ వెంటనే స్పందించి ఉత్తమ్ బీడీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, కార్మికులకు రావాల్సిన బకాయిలను వెంటనే జమ చేయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
కార్మికుల శ్రమను దోచుకుంటున్నఉత్తమ్ బీడీ కంపెనీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES