నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహిళా సంఘం సహాయకుల (వీవోఏ) జీతాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశంతో మహిళా సంఘాల ప్రతినిధులతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతీరాథోడ్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులకు ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని మంత్రులు అందజేశారు. తాజా పెంపుతో వారి వేతనాలు నెలకు రూ.ఎనిమిది వేలకు పెరగనున్నాయి. రాష్ట్రంలో 17,608 మంది వీఓఏలుగా పని చేస్తున్నారు. పెరిగిన వేతనాలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ.106 కోట్లు అదనపు భారం పడనున్నది. వీఓఏల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రెన్యూవల్ విధానం ఏడాదికి పెంచాలనీ, జీవిత బీమా అమలు చేయాలనీ, యూనిఫాం డ్రెస్ విధానం కోసం ఏడాదికి రూ.2 కోట్లు విడుదలకు సీఎం అంగీకరించినట్టు తెలిపారు. దీనికి సంబంధించి విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం ఆదేశించినట్టు తెలిపారు.