Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంఏపీలో రోడ్డెక్కిన గంగపుత్రులు

ఏపీలో రోడ్డెక్కిన గంగపుత్రులు

- Advertisement -

అనకాపల్లి : బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుపై రాజయ్యపేట మత్స్యకారులు భగ్గుమన్నారు. ఉప్పొంగిన కెరటంలా గ్రామమంతా తరలివచ్చి ఆందోళనను ఉధృతం చేశారు. శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో రోడ్డెక్కారు. రాజయ్యపేటలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌కు సంబంధించి ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ చేపడుతున్న పని ప్రదేశంలో గురువారం బైఠాయించారు. జరుగుతున్న పనులను, వాహనాలను అడ్డగించారు. పూరీ, కోణార్క్‌ ప్రాంతాలకు వలసలు వెళ్లిన మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులతో గ్రామానికి తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, జెడ్‌పిటిసి సభ్యురాలు గోసల కాసులమ్మ, వైసిపి నాయకులు వీసం రామకృష్ణ, జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు, సిపిఐ నాయకులు రాజాన దొరబాబు, ఎపి మత్స్య కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పి.నాగాంజనేయులు ఆందోళనకు మద్దతు తెలిపారు. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేసి తమ పొట్టకొట్టొద్దని, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ స్పందించి న్యాయం చేయాలంటూ మత్స్యకారులు పెద్దపెట్టున నినదించారు. అక్కడే వంటావార్పు నిర్వహించారు.

కోటేశ్వరరావు అరెస్టు
బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు ప్రాంతానికి వెళ్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరావును యలమంచిలిలో పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం విడిచిపెట్టారు. ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తూ జిల్లాలో పలుచోట్ల సిపిఎం ఆధ్వర్యాన నిరసనలు తెలిపారు. సిపిఎం నాయకులపైనా, మత్స్యకారులపైనా పదేపదే నిర్బంధం ప్రయోగించడం అప్రజాస్వామికమని నాయకులు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -