గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేదెవరు?

– ఆచితూచి అడుగులు వేస్తున్న ప్రతిపక్షాలు
నవతెలంగాణ- గజ్వేల్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ నుంచి మూడోసారి పోటీ చేస్తుండటంతో ఆయనను ప్రత్యర్థిగా ఎవరు ఢకొీంటారని, ఏ స్థాయి నాయకుడై ఉంటే గట్టి పోటీ ఇస్తారని గజ్వేల్‌తో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢ కొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలని ప్రతిపక్ష పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. 1983 నుంచి ఇప్పటివరకూ సీఎం కేసీఆర్‌ ఒక్కసారి మినహా ఓటమి చవిచూడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద పోటీ చేస్తానని బీజేపీలో చేరిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ గతంలో బహిరంగంగా ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రజా గాయకుడు గద్దర్‌ గతంలో కేసీఆర్‌పై పోటీ చేస్తారనే చర్చ జరగగా, ఇప్పుడు ఆయన కొడుకు కాంగ్రెస్‌ నుంచి రంగంలోకి దిగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వినిపిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది జరిగే సాధారణ శాసనసభ ఎన్నికల్లో మరోసారి గజ్వేల్‌ నుంచే పోటీ చేస్తున్నానని తొలి జాబితాలోనే ప్రకటించుకున్నారు. ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లా కామారెడ్డి అసెంబ్లీ స్థానంలోనూ పోటీ చేస్తున్నారు. 1983 నుంచి 2004 వరకు కేసీఆర్‌ సిద్దిపేట అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. 1983లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌ మోహన్‌ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట అసెంబ్లీ నుంచి వరుసగా కేసీఆర్‌ ఆరుసార్లు విజయం సాధించారు. అంతేకాకుండా 2004లో కరీంనగర్‌ ఎంపీగా, 2009లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో మారిన పరిణామాల్లో గజ్వేల్‌ను ఎంచుకున్నారు. గజ్వేల్‌ బరిలో తొలిసారిగా 2014 అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కూడా గజ్వేల్‌ నుంచే విజయం సాధించారు. మూడోసారి కూడా గజ్వేల్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
కాంగ్రెస్‌, బీజేపీల నుంచి..
గజ్వేల్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తూముకుంట నర్సారెడ్డి, ఆయన కూతురు అంక్షారెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు జస్వంత్‌ రెడ్డి, బండారు శ్రీకాంత్‌ రావు, కాంగ్రెస్‌ యూత్‌ నాయకులు రాచకొండ ప్రశాంత్‌, కొండపాక చెందిన విజరు కుమారులు దరఖాస్తు చేసుకు న్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి బలా బలాలను నాయకత్వం అంచనా వేస్తోంది. బీజేపీ పార్టీ నుంచి.. నల్లమల్ల శ్రీనివాస్‌, నంద గౌడ్‌, రాంప్రసాద్‌ రావు తదితరులు టికెట్‌ ఆశిస్తున్నారు. ఇంకా బీఎస్పీ, ఇతర పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.

Spread the love