Sunday, May 11, 2025
Homeఎడిట్ పేజిఅరుదైౖన గొప్ప సినిమా 'ఫూలే'

అరుదైౖన గొప్ప సినిమా ‘ఫూలే’

- Advertisement -

‘పూలే’ అరుదైన గొప్ప చిత్రం. సెన్సార్‌ వారు మోకాలడ్డినా, పరిమిత థియేటర్లు లభించినా ఆ సినిమా విజయయాత్రను అడ్డుకోవడం అసాధ్యం. చరిత్రను కలుషితం చేసే, వక్రీకరించే సినిమాల పరం పర సాగుతున్న దశలో ‘ఫూలే’ గొప్ప ఉపశమనం. కాచిగూడ చౌరస్తాలోని ఐనాక్స్‌లో సినిమా చూసినప్పుడు నాకు ఒక సంతోషదాయక అనుభవం ఎదురైంది. సినిమా ముగిసి దర్శకుడు అనంత్‌ మహాదేవన్‌ పేరు తెరపై కనబడగానే ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. హీరో ప్రవేశానికి, అతని స్టంట్లకు చప్పట్లు కొట్టొచ్చు. కాని సినిమాను ఆసాంతం నిశ్శబ్దంగా చూసిన ప్రేక్షకులు ముగింపులో చప్పట్లు చరచడం చాలా అరుదు. అలాంటి అరుదైన స్పందనకు కారణం ఫూలే దంపతుల పోరాటం. ఆ పోరాటాన్ని చక్కగా తెరకెక్కించింది, అనంత్‌ మహదేవన్‌, ఆయన టీమ్‌.
‘మహాత్మా ఫూలే’ పేర 1954లో మరాఠీలో ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రం విడుదలైంది. దాన్ని హిందీలోకి కూడా డబ్‌ చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేదర్కర్‌ చేసిన రచన ఆధారంగా, ప్రహ్లాద్‌ కేశవ్‌ ఆత్రే దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించారు. 1955లో ఆ మరాఠీ చిత్రానికి రెండవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రజత పథకం లభించింది. తెలుగులో ఇప్పటిదాకా ఫూలేపై ఒక చిత్రం కూడా రాలేదు. చిత్రాల మాట అలా ఉంచి, ఫూలే రచనలు కూడా వందేళ్లు దాటాకే తెలుగు పాఠకులకు అందుబాటు లోకి వచ్చాయి.
మరాఠీ సినిమా ‘మహాత్మా ఫూలే కు’ నేటి ‘ఫూలే’ చిత్రానికి ఒక తేడా కన్పిస్తుంది. సినిమా పేరుతోనే ఆ తేడా స్ఫురిస్తుంది. మరాఠీ చిత్రంలో జోతిరావుది ప్రధానపాత్ర. నేటి ‘ఫూలే’ చిత్రంలో దంపతులిద్దరిదీ సమాన భాగస్వామ్యం. నిజానికి సావిత్రిబాయికి రవ్వంత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అనంత్‌ మహదేవన్‌ స్త్రీ విద్య పట్ల ఫూలే దంపతుల దృఢనిశ్చయాన్ని, తెగువను చక్కగా చూపారు. జోతిరావు ఫూలే 1890లో మరణించారు. దానికి ముందే పక్షవాతం వల్ల ఆయన కుడికాలు, కుడిచేయి చచ్చుబడ్డాయి. ఆదశ నుండి తాను చనిపోయే దాక సావిత్రి బాయి సత్యశోధక్‌ సమాజ్‌ బాధ్యతలను చేపట్టారు. 1887లో సావిత్రిబాయి చనిపోయారు. ఆమె కవయిత్రి కూడా. భర్త ఆశయాలను ఆమె పాటలుగా రాయడమే గాదు. కళాకారుల బృందాలను నియమించి మహారాష్ట్ర అంతటా పాడించారు. 19వ శతాబ్ధంలో మహిళలు ఇంటి నుండి బయటికి అడుగుపెట్టడమే పాపంగా భావించే వారు ఆ రోజుల్లో సావిత్రిబాయి, ఆమె స్నేహితురాలు ఫాతిమా చూపిన ధైర్యం అసమానం. మహిళల అణిచివేత హిందువుల్లోనే కాదు ముస్లింల్లో కూడా ఉందని, మతపెద్దలు ఆచరణలో ఖురాన్‌ బోధనలను వక్రీకరిస్తున్నారని చూపెట్టడంలో దర్శకు డు మెలుకువ చూపాడు.
ఫూలే స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామి కాలేదన్న విమర్శకు కూడా దర్శకుడు తగిన విధంగా సమాధానం ఇచ్చాడు. విద్య విషయంలో సైతం బ్రిటిష్‌ పాలకుల చిత్తశుద్ధిపై ఫూలేకు పెద్ద నమ్మకం లేవు. వారు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చారని సినిమాలో చాలాసార్లు ఫూలే చేత చెప్పించారు. అయితే తన మొదటి పుస్తకం గులాంగిరి రాసేనాటికి సామ్రాజ్యవాదుల ఎత్తుగడల పట్ల ఆయనకు అంత స్పష్టమైన అవగాహన ఉన్నట్లు అనిపించదు. విద్యారంగంలో చేపట్టాల్సిన మార్పుల పై హంటర్‌ కమిషన్‌కు తాను సమర్పించిన నివేదికను బ్రిటిష్‌ ప్రభుత్వం పట్టించుకోదు. ఆ సందర్భంగా ఫూలే బ్రిటిష్‌ పాలకులపై విమర్శలు కురిపిస్తాడు. వందేళ్లుగా నెలకొన్న బ్రిటిష్‌ దాస్యం కంటే ఎన్నో వందల ఏళ్ల ముందు నుండి నెలకొన్న శూద్రుల దాస్యంపై తాను పోరాడుతున్నాని ఫూలే చెప్తారు.
ఫూలేను నాస్తికుడని చెప్పలేము. అదే మాట సావిత్రిబాయి చేత చెప్పిస్తాడు దర్శకుడు. ”గులాంగిరి” ముగింపులో ఫూలే ఈ ప్రశ్నను తానే లేవనెత్తుతారు. సర్వశక్తిమంతుడు, దయామయుడైన భగవంతుడు ఎందుకు ఇంత అసమానతలతో కూడిన ప్రపంచాన్ని సష్టించాడన్న ప్రశ్నకు, తాను ఇప్పుడు జవాబు చెప్పలేనంటూ ఫూలే పుస్తకం ముగించారు. అయితే దేవుడికి భక్తుడికి మధ్య బ్రాహ్మణుడు ఎందుకు? అన్న ప్రశ్న మాత్రం లేవనెత్తారు.
ఫూలే ఆంగ్లేయుల ఏజెంట్‌ అని, శూద్రులకు ఆంగ్లభాష నేర్పించి సంస్కృతానికి ప్రమాదం తెచ్చి పెడుతున్నారని బ్రాహ్మణులు వాపోతారు ఒక సన్నివేశంలో సావిత్రిబాయి ఎవరైనా డాక్టర్‌, ఇంజనీర్‌ కావాలంటే సంస్కత భాషతో సాధ్యమౌతుందా అని ప్రశ్నిస్తుంది. జోతిబా సంస్కత భాషను పరాయిభాషగా భావించాడు. సాధారణ జనం మాట్లాడుకునే భాషలోను అదే పద్ధతిలోనే రాయాలనీ చెప్పారు. తన పేరును రాసినప్పుడు ‘జో’ కు ‘య’ ఒత్తును తొలగించారు. సాధారణ ప్రజలు ‘జో’ కు ‘య’ ఒత్తు జోడించి పలుక లేరు. వారు జోతి అనే పిలుస్తారు. కనుక తన పేరు నుండి ‘య’ ఒత్తును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లీషులో సింపుల్‌ గా ‘జెఓటిఐ’ అని రాసుకున్నారు. అలా చూస్తే తెలుగులో వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యుడు గిడుగు రామ్మూర్తి, కాగా మరాఠీలో ఆ పని ఆయనకంటే ముందే ఫూలే చేపట్టారు.
పురోహితుడు లేకుండా జరిగే పెళ్లిపై బ్రాహ్మణులు భౌతిక దాడి చేస్తారు. కోర్టుకెక్కుతారు. హిందూ ధర్మ శాస్త్రాలకు భిన్నంగా జరిగే పెళ్లి పెళ్లే కాదని వాదిస్తారు. చివరికి అలాంటి పెళ్లిళ్ల వల్ల తమకు చేరాల్సిన డబ్బు చేరడం లేదని, సాంప్రదాయం ప్రకారం ఆ డబ్బునయినా ఇప్పించమని న్యాయస్థానాన్ని అడుగుతారు. పూలే జోక్యం చేసుకొని పిటీషన్‌దారు న్యాయవాదిని ”మీరు రోజూ గడ్డం చేసుకుంటారు. గడ్డం మీరే చేసు కున్నారు సరే, ఆ డబ్బు సాంప్రదాయం ప్రకారం క్షురకులకు ఇస్తున్నారా?” అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్న విన్న న్యాయమూర్తి కేసు కొట్టేస్తాడు. బ్రాహ్మణుల తరపు వాదనలు అపహాస్యంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తారు. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల జాబితాలో చేర్చిన వారిని ఇప్పుడు దళితులని అంటున్నారు. ఫూలే తన రచనల్లో శూద్రులు, అతిశూద్రులు అన్నారు. సినిమాలో మాత్రం సావిత్రిబాయి సోదరులందరూ దళితులే అని అన్నట్లు చెప్పారు. దళితులు అన్న పదం షెడ్యూల్డ్‌ కులాల వారికి స్థిరపడక ముందు ఆధునిక భారతదేశంలో దళితులు అన్న పదంపై గందరగోళం ఉండేవి.
అంబేద్కర్‌ అనుయాయులమని చెప్పుకునేవారు తరచూ ఒక గందరగోళాన్ని ప్రదర్శిస్తుంటారు. అంబేద్కర్‌ను దళితుల నాయకుడిగా, ఫూలేను వెనుకబడిన కులాల నాయకుడిగా చూపెడ్తారు. అది వాస్తవ విరుద్ధ భావన. ఫూలే సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలు వేర్వేరు అన్న భావన ఆయన రచనల్లో, ఉద్యమంలో కనిపించదు. సినిమాలోనూ ఆ జాగ్రత్త తీసుకున్నారు. ‘గులాంగిరి’లో ఫూలే భారతీయులను రెండే తరగతులుగా ప్రతిపాదిస్తారు. ఒకటి బ్రాహ్మణులు కాగా, రెండవ వారు క్షత్రియులని అంటారు. ఆర్యులైన బ్రాహ్మణులు, బయటి నుండి వచ్చిన వారు. బ్రాహ్మణులు కాని వారంతా క్షత్రియులు దేశ మూలవాసులు అని విశ్లేషిస్తారు. శవాలను పూడ్చడం దక్కన్‌ సంస్కతి. తగలబెట్టడం ఆర్యుల ఆచారమని చెప్పారు. అయితే ఫూలే భౌతికకాయాన్ని దహనం చేసినట్లు సావిత్రిబాయి చితికి నిపుపెట్టి నట్లుగా చూపారు. స్త్రీని తక్కువ చేసి చూసే సాంప్రదాయనికి వ్యతిరేకంగా చేసిన పోరాటం పట్ల ఆయనకున్న నిష్టను స్త్రీపురుష పదం చాటుతుంది. వితంతువుల తలగొరిగించే సాంప్రదాయంపై ఫూలే దంపతులు పోరాడారు.
మానవ హక్కుల కోసం ఫూలే దంపతులు చేసిన పోరాటాన్ని సంభాషణ రూపంలో సినిమాలో చక్కగా చూపెట్టారు. ఫ్రెంచి విప్లవం, అమెరికాలో లింకన్‌ బానిస విధానాన్ని రద్దు చేయడం వంటి ప్రస్తావనలు తెచ్చారు. అలాంటి పోరాటాలు చేసి విజయం సాధించిన వివిధ దేశాల ఉద్యమాలను ప్రస్తావిస్తారు. ప్రపంచ ఉద్యమాలపై అవగాహనలో సావిత్రిబాయి వెనుకబడలేదని చూపెడ్తారు. ఫూలేపై ప్రముఖ జీవితచరిత్రల రచయిత ధనంజయ ఖీర్‌ రాసిన పుస్తకం లేని అంశాలు కూడా సినిమాలో కనిపిస్తాయి. చారిత్రక ఇతివత్తాలను, జీవిత చరిత్రలను సినిమాగా తీస్తునప్పుడు భావోద్వేగ సన్నివేశాలను సృష్టించడం పరిపాటి. అయితే అవి మూలకథను దెబ్బతీసేవి కారాదు. ఆ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సినిమా గురించి సాధారణ ప్రేక్షకుడికి చెప్తే నటీనటులు ఎవరు? హీరో ఎవరు? హీరోయిన్‌ ఎవరు? అని అడుగుతున్నారు. ఈ సినిమాలో గోవిందరావు ఫూలే పాత్రను మినహాయిస్తే పాపులర్‌ నటీనటులు ఎవరూ లేరు. వందల కోట్లు హీరోకు పారితోషకంగా చెల్లిస్తే ఇక సినిమాకు మిగిలేదేముంది మట్టి తప్ప. బడా కార్పొరేట్‌ కంపెనీలు ఈ రోజుల్లో సినిమాలు నిర్మిస్తున్నాయి, ప్రదర్శిస్తున్నాయి. ఆ సినిమాలకు ఆశించిన లాభాలు రాకపోయినా ప్రజలను నిద్రపుచ్చడంలో, మతపర భావోద్వేగాలు రెచ్చగొట్ట డంలో మాత్రం అలాంటి సినిమాలు చాపకింద నీరులాంటి పాత్ర పోషిస్తున్నాయి. కార్పొరేట్లకు అంతకంటే కావాల్సింది ఏముంది. సినిమా ముగింపులో భారతీయులు భావోద్వేగాలకు ఎంతగా లోనవుతారో జోతిబా చేత చెప్పించారు. ఈ దేశంలో కులం, మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టడం చాలా సులభం, అ పనే ఇప్పుడు జరుగుతుంది. భవిష్యత్‌లోనూ జరుగుతుంది అంటూ జోతిబా చెప్పినప్పుడు కూడా ధియేటర్‌లో కాసిన్ని చప్పట్లయినా వినిపించడం శుభసూచకం, ఆశావాహం.
ఎస్‌.వినయ కుమార్‌
9989718311

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -