– భారత్, పాక్ సరిహద్దు ఉద్రిక్తతలతో బీసీసీఐ నిర్ణయం
– స్వదేశాలకు విదేశీ క్రికెటర్ల పయనం
భారత్, పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై పడింది. సరిహద్దు నగరాలపై గురువారం పాక్ డ్రోన్ దాడులకు తెగబడటంతో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేసిన బీసీసీఐ.. ఐపీఎల్2025 సీజన్‌ను ఓ వారం పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్18 లీగ్ దశలో మిగిలిన మ్యాచులు సహా ప్లే ఆఫ్స్ రీ షెడ్యూల్‌ను తదుపరి చర్చల అనంతరం వెల్లడించనున్నారు.
నవతెలంగాణ-ముంబయి
ఊహించినదే జరిగింది!. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్థాంతరంగా రద్దు కావటంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ ప్రశ్నార్థకమైంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో సరిహద్దు ఉద్రిక్తతలకు పాకిస్థాన్ ఆజ్యం పోయగా.. పౌరుల మరణానికి ‘ఆపరేషన్ సింధూర్’తో ఉగ్రశిబిరాలపై దాడితో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్‌తో అతలాకుతలమైన పాకిస్థాన్ ఓ వైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే.. మరోవైపు సరిహద్దు సమీపంలోని నగరాలపై డ్రోన్ దాడులతో కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూలోని పలు జిల్లాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకోగా.. దానికి అతి సమీపంలోని ధర్మశాల స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగటంతో బీసీసీఐ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ధర్మశాల బ్లాక్‌అవుట్‌తో గురువారం చాకచక్యంగా అభిమానులను స్టేడియం నుంచి బయటకు పంపించిన బీసీసీఐ యంత్రాంగం.. శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు ఐపీఎల్18ను సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 2.40 గంటలకు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఓ ప్రకటనలో తెలిపారు.
త్వరలోనే కొత్త షెడ్యూల్
ఐపీఎల్18 సీజన్‌ను వారం రోజుల పాటు నిలిపివేయాలని అందరు స్టేకహేోల్డర్లు, ప్రాంఛైజీల ప్రతినిధులు, ప్రసారదారులతో సంప్రదింపులు జరిపి తీసుకున్న నిర్ణయం. భారత సైనిక బలగాల సన్నద్ధత, సామర్థ్యంపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉంది. అయినా, ఇటువంటి సమయంలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ వారం రోజుల పాటు మ్యాచులను సస్పెండ్ చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు, స్టేకహేోల్డర్లు, ప్రాంఛైజీలతో సమగ్ర సంప్రదింపుల అనంతరం ఐపీఎల్18 రీ షెడ్యూల్‌ను వెల్లడిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు.
స్వదేశాలకు క్రికెటర్లు
శుక్రవారం ఉదయమే బీసీసీఐ ఉన్నతాధికారులు ఐపీఎల్18ను కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై సమావేశమయ్యారు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా సహా అధ్యక్షుడు రోజర్ బిన్ని, ఇతర ఆఫీస్ బేరర్లు ఫోన్ కాల్‌లో చర్చించారు. ఉద్రిక్త వాతావరణంలో ఐపీఎల్ నిర్వహణ సబబు కాదని అందరూ భావించినట్టు తెలిసింది. ప్రభుత్వ యంత్రాంగంతోనూ బోర్డు అధికారులు చర్చించినట్టు సమాచారం. వారం రోజుల పాటు ఐపీఎల్18ను సస్పెండ్ చేయటంతో లీగ్‌లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు తిరుగు పయనం అవుతున్నారు. బీసీసీఐ, ప్రాంఛైజీలు, క్రికెటర్ల అసోసియేషన్ల సహాయంతో స్వదేశాలకు బయల్దేరుతున్నారు. భారత క్రికెటర్లు అందుబాటులో ఉంటే విమానం లేదంటే రోడ్డు, రైలు మార్గంలో ఇంటికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ధర్మశాల నుంచి జలంధర్ వరకు పంజాబ్, ఢిల్లీ క్రికెటర్లు రోడ్డు మార్గంలో చేరుకోగా.. అక్కడ్నుంచి రైలు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నారు.
మరో 12 మ్యాచులే!
ఐపీఎల్18 లీగ్ దశలో మరో 12 మ్యాచులే మిగిలి ఉన్నాయి. గురువారం నాటి పంజాబ్, ఢిల్లీ మ్యాచ్‌తో కలిపి ఇప్పటివరకు గ్రూప్ దశలో 58 మ్యాచులు ముగిశాయి. 12 మ్యాచులు జరిగితే లీగ్ దశ ముగియనుంది. లీగ్ దశలో మిగిలిన మ్యాచులకు లక్నో, హైదరాబాద్, ముంబయి, జైపూర్, చెన్నై, బెంగళూర్, అహ్మదాబాద్ సహా ఢిల్లీ వేదికగా షెడ్యూల్ చేశారు. ప్లే ఆఫ్స్ మ్యాచులు హైదరాబాద్, కోల్‌కతలో జరగాల్సి ఉంది. వారంలో ఐపీఎల్18 రీ షెడ్యూల్‌లో దక్షిణాది నగరాల్లో మ్యాచుల నిర్వహణపై బోర్డు దృష్టి నిలిపే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై సహా కోల్‌కతలో మ్యాచులను షెడ్యూల్ అవకాశాలు మెండగా ఉన్నాయి!.
ప్రపంచ యుద్ధం సమయంలో క్రికెట్ మ్యాచులను సస్పెండ్ చేసినా.. సరిహద్దు ఉద్రిక్తతలతో ఓ లీగ్‌ను వాయిదా/సస్పెండ్ చేయటం ఇదే తొలిసారి. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభంలో ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ సీజన్ నెలకు పైగా కొనసాగింది. కానీ ఆ తర్వాత క్రికెట్ సీజన్‌ను రద్దు చేసి ది ఓవల్ వంటి స్టేడియాలను వార్ ఆఫీస్‌లుగా వాడుకున్నారు. 1942-43, 1944-45లో ఆస్ట్రేలియా వార్‌టైమ్ మొబిలైజేషన్ కోసం దేశవాళీ క్రికెట్‌ను సైతం సస్పెండ్ చేశారు. కేవలం కొన్ని ఫ్రెండ్లీ మ్యాచులు మాత్రమే ఆ సమయంలో జరిగాయి.
ఐపీఎల్18 ఓ వారం వాయిదా!
- Advertisement -
- Advertisement -