Saturday, May 10, 2025

ఫీ’జులుం’

- Advertisement -

హైదరాబాద్‌లో ఓ ప్రయివేటు పాఠశాల బరితెగింపు
– 2025-26 విద్యాసంవత్సరం ఫీజు ఏప్రిల్‌ 15 నాటికి కట్టాల్సిందే
– సకాలంలో చెల్లించకుంటే రోజుకు రూ.20 జరిమానా
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఓ ప్రయివేటు పాఠశాల యాజమాన్యం వింత నిర్ణయం తీసుకుంది. ఫీజుల వసూలు కోసం తల్లిదండ్రులపై జులుం ప్రదర్శిస్తున్నది. 2025-26 విద్యాసంవత్సరం ఫీజులను ఇప్పుడే కట్టాలని తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నది. యాజమాన్యం చెప్పిన తేదీలోగా ఫీజు కట్టకుంటే జరిమానా (ఫైన్‌) చెల్లించాలని హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. యాజమాన్యం తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఆ ప్రయివేటు పాఠశాల యాజమాన్యం తీరులో మార్పు రాలేదు. ఇంకా జరిమానాతోనే ఫీజులను తీసుకుంటుండడం గమనార్హం.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హిమాయత్‌నగర్‌ ప్రాంతంలో ఓ ప్రయివేటు పాఠశాల ఉన్నది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)తోపాటు సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ (ఎస్‌ఎస్‌సీ) విద్యార్థులు చదువు తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 12 వరకు ఆ పాఠ శాలలోని సీబీఎస్‌ఈ విద్యార్థులకు వార్షిక పరీక్షలను నిర్వహించారు. మార్చి 13 నుంచి 19 వరకు విద్యార్థులకు తాత్కాలిక సెలవులిచ్చారు. అదేనెల 20 నుంచి 2025-26 కొత్త విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభవ ుయ్యాయి. గత విద్యాసంవత్సరంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.66 వేలు ఉన్న ఫీజును ప్రస్తుత విద్యా సంవత్సరంలో రూ.68 వేలకు పెంచారు. ఆరు నుంచి పదో తరగతి వరకు రూ.68 వేలు ఉన్న ఫీజును రూ.70 వేలకు పెంచారు. కొత్త విద్యాసంవత్స రం ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే అంటే మార్చి 24న ఫీజు సర్క్యులర్‌ను ఆ పాఠశాల యాజ మాన్యం జారీ చేసింది. మొదటి టర్మ్‌ ఫీజు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు రూ.23 వేలు, ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు రూ.24 వేలు ఏప్రిల్‌ 15 నాటికి చెల్లించాలని కోరింది. కేవలం 23 రోజుల్లో మొదటి టర్మ్‌ ఫీజును కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రెండో టర్మ్‌ ఫీజు ఆగస్టు 15 నాటికి, మూడో టర్మ్‌ ఫీజు డిసెంబర్‌ 15 నాటికి కట్టాలని తెలిపింది. ఒకవేళ ఆయా తేదీల నాటికి చెల్లించకుంటే రోజుకు రూ.20 జరిమానా (ఫైన్‌) కట్టాలని ఆదేశించింది. ప్రతిరోజూ గుర్తు చేస్తున్నది. ఉపాధ్యాయులతో ఫోన్‌ చేయించి తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నది.
తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత
ఆ ప్రయివేటు పాఠశాల యాజమాన్యం లాభార్జన కోసం బరితెగించి తీసుకున్న నిర్ణయంతో తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా ఆ పాఠశాల యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. జరిమానాతోనే ఫీజులను వసూలు చేస్తుండడం గమనార్హం. ఇదేంటని అడిగితే కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ను అలా తయారు చేశామని సాకులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు సకాలంలో ఫీజులు కట్టాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేసిన యాజమాన్యాలున్నాయి. ఫీజు కట్టకుంటే హాల్‌టికెట్లను నిరాకరించిన యాజమాన్యాలున్నాయి. కానీ సకాలంలో ఫీజు చెల్లంచకుంటే జరిమానా విధించిన ప్రయివేటు పాఠశాల యాజమాన్యం ఇదే కావడం విశేషం. మరెక్కడా లేదంటే అది అతిశయోక్తి కాదు. 2024-25 విద్యాసంవత్సరంలో ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన వార్షిక పరీక్షలను ఆ నెలలో లేదా మార్చిలోనే తల్లిదండ్రులు చెల్లించారు. అది కట్టి నెలరోజులు గడవక ముందే 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన మొదటి టర్మ్‌ ఫీజు ఏప్రిల్‌ 15 నాటికి చెల్లించాలన్న ఆదేశాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల మెడపై కత్తి పెట్టి ఫీజులుంకు యాజమాన్యం పాల్పడుతున్నది. టర్మ్‌ ఫీజు అంటే నాలుగు నెలలకు కలిపి తీసుకునేది. అంటే మొదటి టర్మ్‌ ఫీజు మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ వరకు ఉంటుంది. ఈ లెక్కన జూన్‌ వరకు మొదటి టర్మ్‌ ఫీజు చెల్లించడానికి తల్లిదండ్రులకు అవకాశం కల్పించాలి. కానీ ఆ పాఠశాల యాజమాన్యం మాత్రం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన 23 రోజుల్లోనే నాలుగు నెలల ఫీజు కట్టాలని ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే ప్రతినెలా ఫీజు ఎంత ఉందో అంత వసూలు చేయాలని కోరుతున్నారు. ఆ పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తేవాలని భావిస్తున్న ఈ తరుణంలో అధిక ఫీజులను వసూలు చేయడంతోపాటు జరిమానా విధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
ఫీజులను చెల్లించాలంటూ తల్లి దండ్రులను వేధిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) హైదరాబాద్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఏప్రిల్‌ 15 నాటికే మొదటి టర్మ్‌ ఫీజు చెల్లించాలంటూ తల్లి దండ్రులకు నోటీసులివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు లెనిన్‌ గువేరా, కార్యదర్శి కె అశోక్‌రెడ్డి తెలిపారు. సకాలంలో ఫీజు కట్టకుంటే ఫైన్‌ కట్టాలని అరాచకం సృష్టించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ చర్యలను ఆ పాఠశాల యాజమాన్యం వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ డీఈవో, విద్యా శాఖాధికారులు ఈ అంశంపై జోక్యం చేసుకుని ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆ పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -