Friday, September 26, 2025
E-PAPER
Homeకరీంనగర్ఉద్విగ్న భరితం.. కన్నీటి సాగరం

ఉద్విగ్న భరితం.. కన్నీటి సాగరం

- Advertisement -

కడారిని చూసి గుండె పగిలిన గోపాలరావుపల్లె సహచరుడికి… లాల్ సలామంటూ సహచరుల నినాదాలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఒక్కరోజు.. ఒక్క ఏడాది కాదు.అక్షరాలా … నలభై అయిదు వసంతాలు.చక్రాలాంటి కళ్ళతో, చలాకీ తనంతో, అందరినీ ఆకర్షించిన ఆ రూపం.. రెండు పదుల వయసులోనే అదృశ్యమైంది. నలభై ఐదేళ్లు అజ్ఞాతంలో అడవిలో వెన్నెలై, పీడిత ప్రజల గొంతుకై, “ప్రజా యుద్ధ పంథా” లో ఓ దిక్సూచిలా మారీ , దండకారణ్యంలో ఉద్యమ “సాలు” పోసి కొ.సా గా వ్యాప్తి చెంది విగత జీవిగా పురిటి గడ్డకు వచ్చిన తమ బిడ్డడు కడారి సత్యనారాయణ రెడ్డిని చూసి ఆ పల్లె గుండె పగిలింది. ఎక్కడ  ఎన్కౌంటర్ జరిగినా ఇక్కడి పల్లె తల్లితో ఆత్మబంధం ఉన్న ప్రతి వారు ఉలిక్కిపడి  “అమ్మయ్య! తమ కడారి లేడు కదా” అని ఊపిరి పీల్చుకునే గోపాల్ రావు పల్లె ప్రజలు, తాను ప్రజా యుద్ధ ఓనమాలు నేర్పిన బస్తర్ అబూజ్ మడ్ దండకారణ్యంలోనే అమరుడయ్యాడని తెలిసి “తడారి” పోయిన గొంతులతో తమ “కడారి”  పార్థివ దేహం కడసారైనా చూడాలని పరితపించారు.

కడారి సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని తన సోదరుడు కడారి కరుణాకర్ రెడ్డి చత్తీస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా నుంచి తీసుకువచ్చిన అంబులెన్స్ గోపాల్ రావు పల్లి లోకి ప్రవేశించగానే ఒక ఉద్విగ్న భరిత వాతావరణం అక్కడ అలుముకుంది. అప్పటివరకు చినుకు చినుకుగా పడిన వాన”పల్లె బిడ్డా !.. వచ్చావా!!”అన్నట్టుగా మేఘం సైతం ఒక్కసారిగా జోరుగా వర్షించి బోరుమంది.ఇన్నేళ్లకు…. కళ్ళముందు విగత జీవిగా అచేతనంగా పడి ఉన్న కడారి ముఖాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపించారు. ఆ పల్లె ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడకు వచ్చిన బంధుమిత్రులు, విప్లవ సంఘాల నేతలు, మాజీ నక్సలైట్లు ప్రజా యుద్ధ నేతకు జోహార్లు అర్పించారు. తమ పల్లె ప్రజల కోసం పీడిత, తాడిత వర్గాల కోసం “జాతి”కి ప్రాణమిచ్చే ఒక యోధుడిని అందించి నేడు దేశవ్యాప్తంగా కో.స పురిటిగడ్డగా గోపాల్ రావు పల్లి గొప్పదనాన్ని తెలియజేసిందని, ఆ పల్లె ప్రజలు భావిస్తూ కన్నీటితో కడపటి వీడ్కోలు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -