మనుషులను చంపగలరేమో కానీ,వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవవీరుడు సర్దార్ భగత్‌సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి,స్వరాజ్య సాధన పోరాటంలో చిరుప్రాయంలోనే ప్రాణాలను తణప్రాయంగా అర్పించిన యోధుడు. గొప్ప విప్లవకారుడిగా,స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు భగత్‌సింగ్. ఉరికొయ్య ముందు నిల్చొని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదమిచ్చారు.ఆ ధైర్యమే విప్లవ ప్రవాహంలా మారి నేటి తరాలకు మార్గ దర్శకమైంది.1907 సెప్టెంబర్ 28న నేటి పాకిస్తాన్‌లోని లాహోర్ సమీపంలోని ఓగ్రామంలో జన్మించిన భగత్‌సింగ్ మతాల మధ్య సామరస్యతకు,దేశ ప్రజల నడుమ శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచారు. రష్యాలో 1917 అక్టోబర్ విప్లవ ప్రభావంతో భగత్‌సింగ్ 1919లో జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన మూకుమ్మడి హత్యల తర్వాత బ్రిటీష్ వారు అవలంబించిన ‘విభజించి-పాలించు’ పద్ధతికి వ్యతిరేకంగా మరింత పదునుపెట్టారు.రష్యాలో మాదిరిగా భారతదేశంలో కూడా సోషలిస్టు రాజ్యం, సమ సమాజం ఏర్పడాలని భావించారు. జైలుకు వెళ్లడానికి ముందు,జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తూ ఆయన విస్తతంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి మారు పేర్లతో పత్రికలకు రహస్యంగా వ్యాసాలు రాసి పంపారు.మార్క్స్,ఎంగెల్స్,లెనిన్, ట్రాట్ స్కీల రచనలే కాదు అనార్కిస్టుల,నిహిలిస్టుల రచనలను,యూరప్‌లోని ఉద్యమాలను కూడా అధ్యయనం చేశారు.తన వ్యాసాల్లో ఆయన మతతత్వ ప్రమాదం గురించి దూరదష్టితో ఖచ్చితమైన హెచ్చరిక చేశారు.మతవాదుల పట్ల ఉదాసీనత ప్రమాదకరం అని బోధించారు.
తనకు గురుతుల్యుడు,పిత సమానులైన లాలా లజపత్ రారు హిందూ మహాసభకు అనుకూలంగా మారినప్పుడు ఆయన ఘాటుగా విమర్శించారు.భగత్‌సింగ్ కార్యకలాపాలపై లాలా కూడా విరుచుకుపడ్డారు.నన్ను లెనిన్‌లా మార్చడానికి భగత్‌సింగ్ ప్రయత్నిస్తున్నాడని,అతను రష్యన్ ఏజెంట్ అని నిందించారు.అయినప్పటికీ లాలాను బ్రిటీష్ పోలీసులు కొట్టి చంపడాన్ని భగత్‌సింగ్ సహించలేదు.ప్రతిగా బ్రిటీష్ పోలీస్ అధికారిని తుపాకీతో కాల్చి చంపారు.మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా ఖండించారు. అంటరానితనంపై కూడా ఘాటైన వ్యాసాలు రాశారు.విప్లవం అంటే బాంబులు,తుపాకుల సంస్కతి కాదు.విప్లవం అంటే ప్రస్తుత పరి స్థితుల్లో మార్పు తేవడమనేది ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి జరగాలి అంటూ భగత్‌సింగ్ వివరించారు. జలియన్‌వాలాబాగ్ ఘటనలో మరణించిన వారిలో అన్ని మతాల వారున్నారు.కానీ ఆ సంఘటన తర్వాత 1924లో దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి.1925లో ఆరెస్సెస్ ఏర్పడింది.ముస్లిం మతతత్వం కూడా ఆ సమయంలో విస్తరిస్తోంది.బ్రిటీష్ ఎత్తుగడల వల్ల ఆనాడు ప్రజల్లో మత ప్రాతిపదికన లోతైన చీలిక ఏర్పడుతోంది.కొహాట్,పంజాబ్‌లో ఘర్షణల ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నది.ఈ ఘర్షణలపై ఒక జాతీయ చర్చ తెరపైకి వచ్చింది.సార్వత్రికంగా అలాంటి మత ఘర్షణలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నదని స్వాతంత్య్రోద్యమం గుర్తించింది.
మతతత్వం పట్ల ఆనాడు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల పట్ల భగత్‌సింగ్ అసమ్మతి వ్యక్తం చేశారు.నాటి కాంగ్రెస్ నాయకత్వం హిందూ,ముస్లిం నాయకులతో శాంతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించే ప్రయత్నం చేసింది.దీనికి భగత్‌సింగ్ కూడా మద్దతు ఇస్తూ ‘నేడు భారతదేశ పరిస్థితి దయనీయంగా ఉన్నది, ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్తులను శత్రువులుగా భావిస్తున్నారు.కనుక రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారమని, మతం వ్యక్తిగతమైన విషయం, దానిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని’ భగత్‌సింగ్ అన్నారు. ఎవరూ మతాన్ని రాజకీయాల్లోకి జొప్పించే ప్రయత్నం చేయకూడదు.ఎందుకంటే మతం ఎవ్వరినీ ఐక్యంగా ఉంచదు,అందరూ కలిసి ఐక్యంగా పనిచేసుకోనివ్వదన్నారు.నాటి గదర్ పార్టీ పిలుపుతో ఉద్యమంలో సిక్కులు,హిందువులు,ముస్లింలు ఉరికంబాలెక్కేందుకు ముందుండేవారు.మతాన్ని రాజకీయాల నుంచి వేరుచేస్తే,మనం భిన్న మతాలకు చెందిన వారమైనప్పటికీ,రాజకీయాల్లో మనమంతా కలిసి ఒకచోటకు రావచ్చని భగత్‌సింగ్ ఆనాడే వర్గచైతన్య ప్రాముఖ్యం గురించి నొక్కిచెప్పారు.మతతత్వాన్ని నిర్మూలించడానికి ఏకైక మార్గం వర్గ చైతన్యమే అన్నారు. స్వేచ్ఛాయుత ఆలోచనలకు అడ్డుపడే ప్రతీదీ నశించాల్సిందే అని పేర్కొన్నారు. సమా నత్వం,సామాజిక న్యాయం గురించి భగత్‌సింగ్ చాలా రచనలు చేశారు.
సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్‌సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. అందుకే నేడు దేశంలో ‘భగత్‌సింగ్ తమ్ములం..భరతమాత బిడ్డలం’ అని పైకి నినాదాలిచ్చే ఆరెస్సెస్ సంఘీయులు,కర్నాటకలో బీజేపీ అధి కారంలో ఉన్నప్పుడు పదోతరగతి పాఠ్యపుస్తకంలో భగత్‌సింగ్ పాఠాన్ని తొలగించి దానికి బదులు ఆరెస్సెస్ వ్యవ స్థాపకుడు హెగ్డేవార్ పాఠాన్ని చేర్చారు. భగత్‌సింగ్ బలంగా నమ్మి ప్రచారం చేసిన లౌకిక,ప్రజాస్వామ్య భావాలపట్ల వారిలో దాచిపెట్టుకున్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.దేశ ప్రజలకు సంపూర్ణ స్వాతంత్రాన్నిచ్చే మేలైన భారతదేశాన్ని సష్టించేందుకు భగత్‌సింగ్ చేసిన కషిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనపై ఉన్నది.ప్రజాస్వామిక వ్యవస్థ స్థాపన కోసం సమిధలైపోయిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని నేడు ప్రతి భారత పౌరుడూ ఆస్వాదిస్తున్నాడంటే ఆ ఘనత భగత్‌సింగ్ వంటి వీరులు,ధీరులకే దక్కుతుంది.అందుకే నేడు దేశంలో వేళ్లూనుకుపోయిన కుల,మత మౌఢ్యాలు పోవాలంటే లౌకిక,ప్రజాస్వామిక శక్తులు భగత్‌సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్యపరచాలి.
నాదెండ్ల శ్రీనివాస్, 9676407140