Saturday, September 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమెట్రో రైల్‌ నష్టాలకు కారణమెవరు?

మెట్రో రైల్‌ నష్టాలకు కారణమెవరు?

- Advertisement -

గత మూడు దశాబ్దాల సరళీకరణ యుగంలో నష్టాలు వచ్చే సంస్థలను ప్రభుత్వానికి అప్ప చెప్పడం, లాభాలు వచ్చేవాటిని ప్రయివేటు పరం చేయడాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విషయంలో ఇదే జరుగుతున్నది, మెట్రో రైల్‌ నిర్వహణ చేయలేక పోతున్నాం భారీగా నష్టాలు వస్తున్నాయని ఎల్‌ అండ్‌ టి కార్పొరేట్‌ కంపెనీ చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది. నిజంగా లాభాలు వచ్చి ఉంటే ఎల్‌అండ్‌టి సంస్థ మెట్రో రైల్‌ నిర్వహణను వదులుకునేదా? రెండో దశలో నిర్మించబోతున్న మెట్రో రైల్‌ కొత్త రూట్లను కూడా తనకే కావాలని డిమాండ్‌ చేసేదికాదా? దేశంలో పబ్లిక్‌, ప్రయివేటు భాగస్వామ్యంతో మొదలుపెట్టిన అతిపెద్ద మెట్రో రైల్‌, అనేక అంతర్జాతీయ అవార్డులు సాధించానంటూ ప్రచార అర్బాటాలు సాగించి అనతి కాలంలోనే చేతులెత్తేసింది. ప్రభుత్వానికి అత్యంత భారమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజారవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెట్రో రైల్‌ నిర్వహణను ఎల్‌ అండ్‌ టి నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్‌అండ్‌టి సంస్థ అప్పులు రూ.13 వేల కోట్లను ప్రభుత్వానికి మార్చుకోవడం,ఈక్విటీ వాటా కింద రెండు వేల కోట్లు ఎల్‌అండ్‌టికి చెల్లించడం ద్వారా ప్రభుత్వం మెట్రో రైల్‌ నిర్వహణను స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నిర్వాహణకు 2008లో మేటాస్‌ కంపెనీతో ఒప్పందం కుదిరినప్పటికీ ఆ సంస్థ దివాలా తీయడంతో ఆ కాంట్రాక్టర్‌ రద్దయింది. 2010లో ఎల్‌ఎంటి సంస్థతో ఒప్పందం కుదిరింది, 14 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మొదట ప్రకటించగా ప్రాజెక్టు ఖర్చు 22వేల కోట్లకు పెరిగిందని ప్రకటించారు. మూడు రూట్లలో 71 కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరిగింది, ప్రస్తుతం ప్రతిరోజు నాలుగున్నర లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఖర్చు 50శాతం ప్రయాణికుల టికెట్‌ ఆదాయం ద్వారా, 45శాతం ప్రభుత్వం ఇచ్చే భూములను వ్యాపారంగా(రియల్‌ ఎస్టేట్‌) మార్చుకోవడం ద్వారా, 5శాతం వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం రాబట్టుకుంటామని ఒప్పందంలో రాసుకున్నారు. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం సరిగానే లభిస్తున్నప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ ద్వారా ఆదాయం రాబట్టుకోవడంలో ఎల్‌అండ్‌టి విఫలమైంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 269 ఎకరాలు కేటాయించింది, ఈ భూమిలో 18 1/2 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో మాల్స్‌ ఇతర వ్యాపార అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పిన ఎల్‌అండ్‌టి రెండు లక్షల చదరపు అడుగుల ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయింది. రియల్‌ ఎస్టేట్‌ ద్వారా ఆదాయం రాబట్టుకోలేకపోయామని ఎల్‌అండ్‌టి సంస్థ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవుట్‌లో కూడా తెలిపింది. ఈ వైఫల్యానికి ప్రభుత్వంపై నింద వేయడం ఏ రకంగా సమంజసం?

అలైన్మెంట్‌ మార్పులు, యుటిలిటీస్‌ షిఫ్టింగ్‌, రైట్‌ ఆఫ్‌వే ఇవ్వకపోవడం తదితర కారణాల వల్ల ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా ఈ మొత్తం పెండింగ్‌లో ఉందని, కేంద్ర ప్రభుత్వం వయాబులిటీ గ్యాప్‌ ఫండ్‌ (విజి ఎఫ్‌)కింద 258 కోట్లు ఇప్పటివరకు విడుదల చేయలేదని, కరోనా కష్టాలు, రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణమిస్తామని ఇవ్వలేదని తదితర కారణాలవల్ల నష్టాలు సంభవించాయంటూ ఎల్‌అండ్‌టి సంస్థ ప్రభుత్వంపైనే ఎదురు దాడి మొదలుపెట్టింది. ఒప్పందం ప్రకారం ఓల్డ్‌ సిటీలో ఐదున్నర కిలోమీటర్ల రైలు నిర్మాణం చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం విజిఎఫ్‌ నిధులను నిలిపివేసింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మా ణానికి భూసేకరణ కోసం మూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది, 269 ఎకరాల భూమిని ఎల్‌అండ్‌టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి కేటాయి ంచింది. అదే సమయంలో అలైన్మెంట్‌ మార్పుల పేరుతో కేసీఆర్‌ మొండి వైఖరి తీసుకోవడం ప్రాజెక్టు ఖర్చు పెరగడానికి దారితీసింది, దీనికి నష్టపరిహారం అనే విధంగా ఒప్పందం ప్రకారం మెట్రో రైల్‌ టికెట్‌ గరిష్ట చార్జి 19 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 60కి పెంచు కుంటున్నప్పటికీ ఎల్‌అండ్‌టికి అభ్యంతరం చెప్పలేదు. ఇది పూర్తిగా ఒప్పంద ఉల్లంఘనే! బీ(టీ)ఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌అండ్‌టిి మధ్య జరిగిన చీకటి ఒప్పందం కారణంగా ప్రజలపై టికెట్‌ భారం భారీగా పడింది. టికెట్‌ చార్జీల పెంపు ఒప్పంద ఉల్లంఘనే కాదు, ఇది ఎల్‌అండ్‌టి దారి దోపిడీ అని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు, ఈ ఒప్పందాన్ని డ్రాఫ్ట్‌ చేసిన వ్యక్తి కీ.శే గజేంద్ర హల్దియా పేర్కొన్నారు. ఒప్పందానికి విరు ద్ధంగా టికెట్‌ చార్జీలు పెంచినందుకు విజిఎఫ్‌ కింద ఇప్పటికే ఇచ్చిన 1200 కోట్లు వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడే డిమాండ్‌ చేశారు.

హైదరాబాదులో పెరుగుతున్న ప్రజా రవాణా డిమాండ్‌ రీత్యా రెండవ దశలో 2ఏ 2 బి కింద 168 కిలోమీటర్ల పొడవులో ఎనిమిది నూతన కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. డిపిఆర్‌లు తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏడాది గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకుండా మోకాలడ్డుపెడుతున్నది. మొదటి దశ నిర్వహిస్తున్న ఎల్‌అండ్‌టి సంస్థకు రెండవ దశలో చేపడుతున్న ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదరకుండా అనుమతి ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం మెడపై కత్తి పెట్టింది. ఎల్‌ అండ్‌టి సంస్థ ఇదే అదునుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది, తాను నిర్వహించలేనని, విస్తరించబోతున్న కారిడార్లలో తాను భాగస్వామ్యం కాలేనని తేల్చేసింది. భారమైనప్పటికీ ప్రజా రవాణా బాధ్యతను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ నిర్మాణ సంస్థ అయినా ప్రాజెక్టు ఖర్చులో ఒక్క శాతం లేబర్‌ సెస్‌ కింద చెల్లించాలి, లేబర్‌ సెస్‌ కింద 163 కోట్లు చెల్లించాలని జాయింట్‌ కమిషన్‌ ఆఫ్‌ లేబర్‌ 2014 లోనే నోటీసులు జారీ చేసినప్పటికీ హైకోర్టులో స్టే తెచ్చుకొని ఒక రూపాయి కూడా చెల్లించలేదు, వడ్డీతో కలిపి ఇప్పుడు 400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌అండ్‌టి సంస్థ దోపిడీపై 2024లో కాగ్‌ నివేదిక అనేక వివరాలను ప్రకటించింది, వందల కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా కొల్లగొట్టిందని తన నివేదికలో స్పష్టంగా, వివరంగా పేర్కొన్నది.

ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సౌకర్యాలు పెంచకపోగా అనేక రాయితీలు, సౌకర్యాలకూ కోత పెట్టింది. రద్దీ సమయాల్లో మెట్రో రైల్లో ప్రయాణం చేయడం నరకంగా మారింది, కనీసం నిలబడే చోటు లేదు, రైలు ఎక్కగలిగే పరిస్థితి కూడా లేదు. మెట్రో రైలు ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్నవి, వాటిని ఆరు కోచ్‌లకు పెంచాలనే విషయాన్ని పెడచెవిన పెట్టింది, పార్కింగ్‌, పబ్లిక్‌ టాయిలెట్స్‌ యూజర్‌ చార్జీలను భారీగా వసూలు చేసింది. లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు చేపడతానని తగిన చర్యలు ఏమి చేయలేకపోయింది. దేశంలో మెట్రోరైల్‌ నిర్వహణ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపడుతున్నప్పటికీ, హైదరాబాదులో ప్రయివేటు భాగస్వామ్యంతో మొద లైన ఈ ప్రాజెక్టు విఫలమైంది. ఆశించిన లాభాలు రాకపోవడంతో ప్రయివేటు సంస్థ చేతులెత్తేసి తప్పుకుంది, గరిష్టంగా వాటా నిధులు రాబట్టు కోవడానికి తీవ్ర ఒత్తిడి,బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నది, ఎల్‌అండ్‌టి కొల్లగొట్టిన నిధులను తిరిగి రాబట్టుకోవడంతోపాటు ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టాలి.

ఎం శ్రీనివాస్‌ 9490098661

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -