Saturday, September 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅశాంతిలో లడఖ్‌

అశాంతిలో లడఖ్‌

- Advertisement -

ఆర్టికల్‌ 370ని రద్దుచేసి, కాశ్మీర్‌ను మూడు ముక్కలు చేసి, శాంతిని నెలకొల్పామని ప్రచారాలతో హోరెత్తించినవారే నేడు హిమాలయశ్రేణుల్లో నెత్తురు పారిస్తున్నారు. న్యాయంగా తమకు దక్కాల్సిన రాజ్యాంగపరమైన హక్కుల కోసం, గౌరవప్రదమైన రాజకీయ గుర్తింపుకోసం లడఖ్‌ ప్రజలు చేసిన నిరసనలు పోలీసుల ఇనుప బూట్ల కింద నలిగిపోయాయి. గత రెండు వారాలుగా లేహ్‌ లో కొనసాగిన శాంతియుత నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. కారణం? ప్రజలతో అర్థవంతమైన చర్చలు జరపడానికి బదులుగా కేంద్ర పాలిత ప్రాంత పరిపాలన ఆ నిరసనకారులను బలవంతంగా అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ అణచివేతలో నలుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఫలితంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే లడఖ్‌ నేలమీద ఇప్పుడు భయానకమైన అశాంతి నెలకొంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే… ప్రజలు అడుగుతున్న హక్కులను ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తోంది? వారు అడుగుతున్నవేమీ గొంతెమ్మకోరికలు కావే! తమ సొంత భూమి మీద తమకు హక్కులు కావాలంటున్నారు. తమ జీవితంపై, తమ భవిష్యత్తుపై తమ నియంత్రణ కోరుతు న్నారు. కానీ ఏలినవారు వాటిని ”అస్థిరత సృష్టించే ప్రయత్నం”గా చూపుతూ రాజకీయ కుతంత్రానికి పాల్పడుతున్నారు. వేర్పాటు వాదమనే ఆరోపణలతో అణచివేతకు పూనుకుంటున్నారు. ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇది ఎంత అన్యాయం?

2019లో ఆర్టికల్‌ 370రద్దు, తద్వారా జమ్మూకశ్మీర్‌ పునర్విభజన తర్వాత లడఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. కానీ ఈ సందర్భంలో కేంద్రం వారికిచ్చిన వాగ్దానాలేవీ నేటికి ఏడేండ్లు గడిచినా ఫలించలేదు. ఏలినవారు చెప్పిన అభివృద్ధి కనుచూపుమేరలో కనిపించకపోగా, స్థానిక ప్రజల రాజకీయ స్వయం ప్రతిపత్తి ఆపదలో పడింది. రాష్ట్ర హోదా లేకపోవడం, ప్రజాప్రాతినిద్యం లేకపోవడం, స్థానిక సంస్కృతి-ఆర్థిక ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడటం. ఇవన్నీ కలసి ఆందోళ నకు బీజం వేశాయి. రాష్ట్రహోదా, ఆరో షెడ్యూల్‌ రక్షణ, స్థానికు లకు ఉద్యోగాలు, భూహక్కుల హామీ.. ఇవి లడఖ్‌ ప్రజల నాలుగు ప్రధాన డిమాండ్లు. ఇవేమీ అలవిమాలిన కోరికలు కావు. ఇవి అక్కడి పర్వతాల్లాగే వారికి రక్షణగా నిలిచే వారి సహజమైన హక్కులు. ఇవి లేకుంటే లడఖ్‌ తన సొంత గడ్డమీదే పరాయి అవుతుంది. అందుకే పోరాడుతున్నారు. ఇది జీవన పోరాటమే తప్ప వేర్పాటువాదమెలా అవుతుంది? ఇప్పటి వరకూ హై పవర్డ్‌ కమిటీ పేరుతో జరిగిన చర్చలు వాస్తవానికి ఓ ”మోసపూ రితమైన సాంత్వన”. ప్రజల సమస్య ఒక్కటంటే ఒక్కటైనా పరిష్కరించకుండానే ”అద్భుత పురోగతి” అంటూ ఏలినవారు ఊదరగొడుతున్నారు. ఇది ఏ మాత్రం నైతికత అనిపించుకోదు. ఇక వాంగ్‌చుక్‌పై హింసకు ప్రేరేపకుడు అనే ముద్ర వేయడం అణచివేతకు ముసుగు తొడగడమే. ఈరోజు అతడిని అరెస్ట్‌ చేయడం సత్యాన్ని బంధించే కుయుక్తి మాత్రమే.

లడఖ్‌ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నది పూర్తి అధికారాలతో కూడిన రాష్ట్ర హోదా. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్పు. ఆరవ షెడ్యూల్‌లో ఉండడం వలన ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా లడఖ్‌లోని స్థానిక జాతులకు ప్రత్యేక హక్కులు, భూసంపదల రక్షణ, సాంస్కృతిక భద్రత లభిస్తాయి. లడఖ్‌ భౌగోళికంగా సున్నిత ప్రాంతమే కాక వ్యూహాత్మక ప్రాధాన్యత కలది కూడా. అటువంటి ప్రాంతంలో ప్రజలకు సు రక్షితమైన రాజ్యాంగ హక్కులు ఇవ్వకపోవడం సహేతుకం కాజాలదు. గడచిన ఆరేండ్లుగా ప్రజలు పదేపదే శాంతియుతంగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. మూడేండ్లుగా దశలవారీగా చర్చలు జరిగాయి. కానీ ప్రతిసారి కేంద్రం వాగ్దానాలకే పరిమితమైంది. అమలులో అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా తాజాగా నిరాహార దీక్ష చేపట్టిన లేహ్‌ అపెక్స్‌ బాడీ, ఇతర ప్రజా సంఘాలను చర్చలకు పిలవకుండా, బల వంతంగా అరెస్టు చేయాలని యత్నించడం ప్రజల ఆగ్రహానికి దారితీసింది.

శాంతియుత నిరసనకారులపై పోలీసులు దాడి చేయడం వల్లే రక్త పాతం జరిగింది. నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయి. బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం, మరణించిన వారిపట్ల కనీస సానుభూతి ప్రకటించకపోగా ప్రజలే తప్పుచేశారంటూ ఆరోపించడం పరిస్థితిని మరింత విషమం చేస్తోంది. లడఖ్‌లో సంభవించిన ఈ హింస, సంక్షోభం, ప్రస్తుత పరిస్థితులు కేంద్రం ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాయి. లడఖ్‌ ప్రజల డిమాండ్లు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిధిలోనే ఉన్నాయి. వాటిని గుర్తించకపోవడం కేంద్రం బాధ్యతారాహిత్యమూ అన్యాయం మాత్రమే కాదు, ప్రమాదకరం కూడా. దీన్ని విధానపరమైన రాజకీయ సమస్యగా గుర్తించి తక్షణం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం బాధ్యతగల ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -