సమాజ రుగ్మతలపై పోరాడేది కమ్యూనిస్టులే : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఆంజనేయులు దంపతుల త్యాగం ఎనలేనిది
అంతరాలు లేని సమాజం కోసం పోరాటాలు : సీపీఐ(ఎం) వనసర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు సతీమణి వరలక్ష్మి మృతదేహం వైద్య కళాశాలకు అప్పగింత
నవతెలంగాణ మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి / వనపర్తి
సమాజంలో చావు బతుకులు సహజమని, సమాజం కోసం శరీర దానం చేయడమంటే.. చనిపోయినా.. మరో 50 ఏండ్లు బతికి ఉండడమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సమాజ రుగ్మతలపై నిరంతరం పోరాటాలు చేసేది కేవలం కమ్యూనిస్టు లేనని తెలిపారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు సతీమణి, ఐద్వా జిల్లా మాజీ నాయకులు వరలక్ష్మి అనారోగ్య కారణాలతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్, అబ్బాస్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి తదితరులు ఆమె మృతదేహంపై పుష్పగుచ్చాల్ని ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం వారి స్వగృహం నుంచి మెడికల్ కళాశాల వరకు ర్యాలీగా వెళ్లి మెడికల్ కళాశాల విద్యార్థుల పరిశోధనాత్మక ప్రయోజనార్థం మృతదేహాన్ని కళాశాలకు అప్పగించారు.
ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. పుట్ట ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు కష్టనష్టాలకు ఓర్చి అన్యోన్యమైన, ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారని చెప్పారు. వనపర్తి జిల్లాలో విద్యార్థి ఉద్యమాలతో పాటు పార్టీ ప్రతిష్టతకు, మహిళా సంఘం ఏర్పాటుకు వరలక్ష్మి కృషి చేశారని తెలిపారు. అలాగే, ఉద్యమంలో పుట్టా ఆంజనేయులుకు అన్ని రకాలుగా అండగా ఉంటూ సహకరించారన్నారు. వరలక్ష్మి మృతి పార్టీకి, ఆ కుటుంబానికి, తీరనిలోటని తెలిపారు. వరలక్ష్మీ లాంటి వాళ్లు చేసిన పోరాటాలను త్యాగాలను స్మరించుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం ముందుకు సాగాల్సిన బాధ్యత కమ్యూనిస్టులుగా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. భవిష్యత్తు తరాలను బాగుపరిచే మెడికల్ విద్యార్థుల పరిశోధనల కోసం మృతదేహాన్ని అప్పగించే త్యాగాన్ని ఆంజనేయులు కుటుంబం తీసుకోవడం గర్వించదగ్గ అంశమని అన్నారు.
అనంతరం టి.సాగర్ మాట్లాడుతూ.. అది తక్కువ కాలంలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ అంతలోనే వరలక్ష్మి చనిపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. కుటుంబంతోపాటు పార్టీలో కీలకపాత్ర పోషించి, జిల్లా కార్యదర్శిగా పుట్ట ఆంజనేయులు ఎదగడానికి ఆమె కృషి ఎనలేనిదని తెలిపారు. అనంతరం అబ్బాస్ మాట్లాడుతూ.. మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో ఈ మధ్యకాలంలో దాదాపు 160కి పైగా కమ్యూ నిస్టు నాయకులు, వారి కుటుంబసభ్యుల భౌతికకాయాలను వైద్య కళాశాలకు అందించేం దుకు ముందుకు వచ్చి వైద్య విద్యా పరిశోధ నకు ఉపయోగపడ్డారని తెలిపారు. ఇది శాస్త్రీయ ఆలోచనా విధానానికి నిదర్శనమని అన్నారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి మాట్లాడుతూ.. చిన్న వయసులో వరలక్ష్మి చనిపోవడం.. ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని అన్నారు. ఉద్యమం రీత్యా జిల్లాకు వచ్చినప్పుడు రాష్ట్ర నాయకులను వరలక్ష్మి తమ సొంత బిడ్డల్లాగా అత్యంత ప్రేమతో చూసుకున్నారని గుర్తుచేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి మాట్లాడుతూ.. మహిళా ఉద్యమంలో వరలక్ష్మి కీలకపాత్ర పోషించారని అన్నారు. వరలక్ష్మి మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించడం స్వాగతించాల్సిన అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. వెంకట్రాములు, భూపాల్, నవతెలంగాణ జనరల్ మేనేజర్ అంబటి వెంకటేశ్, సీపీఐ(ఎం) నాయకులు కిల్లె గోపాల్, ఉమ్మడి జిల్లా కార్యదర్శులు ఏ.రాములు, వర్ధన్ పర్వతాలు, గవినోళ్ల వెంకట్రాంరెడ్డి, ఏ వెంకటస్వామి, వనపర్తి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బార్, బాల్‌రెడ్డి, లక్ష్మి, నాగిరెడ్డి, ఆర్ శ్రీను, భాస్కర్ రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.