ప్రముఖ మానసిక నిపుణురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నవతెలంగాణ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని ఎంహెచ్ భవన్‌లో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ మానసిక నిపుణురాలు, సైకాలజిస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ అనేది ఒక్క తెలంగాణకే చెందిన గొప్ప పండుగ అన్నారు. ప్రకృతిని, పూలను పూజించి పర్యావరణాన్ని కాపాడే పండుగైన బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. మహిళలంతా కలిసి సరదాగా అడుతూ పాడుతూ గడిపే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. ఆ ఆటా పాటా మహిళలకు ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందన్నారు.
ఇంకా మాట్లాడుతూ మహిళలంతా వారిలోని శక్తిని గుర్తించి, వారిలో ఏదైనా సాధించే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. అన్నింటికంటే మించి మహిళలందరినీ ఐక్యం చేస్తుంది. ఇలాంటి పండుగలు మనుషులందరినీ ఏకం చేసి కుటుంబ విలువలను పెంచుతాయనీ, పిల్లలను ఇలాంటి పండుగల్లో భాగస్వాములను చేయడం వల్ల వాళ్లు ఆరోగ్యంగా ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బోర్డు సభ్యులు సలీమా అధ్యక్షత వహించగా మేనేజర్ రేణక, హెచ్.ఆర్ జనరల్ మేనేజర్ నరేంద్రర్ రెడ్డి, మేనేజర్ వీరయ్యతో పాటు మహిళా సిబ్బంది, కుటుంబ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.