Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంనచ్చితే సై…లేకుంటే నై

నచ్చితే సై…లేకుంటే నై

- Advertisement -

సెన్సార్‌బోర్డ్‌లా పనిచేస్తున్న సీబీఎఫ్‌సీ
ఆందోళనలో ఫిల్మ్‌ మేకర్స్‌
కష్టపడి తీసిన సినిమాల్లో అడ్డగోలు ‘కట్‌’లు చేస్తున్నారని ఆవేదన
జాతీయ స్థాయిలో సినీ ఇండిస్టీ తీవ్ర అసంతృప్తి

న్యూఢిల్లీ : భారతీయ చలనచిత్రరంగాన్ని రాజకీయాలవైపు మళ్ళించిన ఘనత ఎన్డీఏ సర్కార్‌దే! సినిమాలు సర్కారుకు అనుకూలంగా లేకుంటే, సెన్సార్‌బోర్డ్‌ పేరుతో అడ్డగోలు ‘కట్‌’ చెప్పి, సూపర్‌హిట్‌ మూవీని శూన్యంలోకి నెట్టేదాకా నిద్రపోవట్లేదు. అసలు జాతీయ స్థాయిలో సినిమాను విడుదల చేయాలంటే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) అనుమతి తప్పనిసరి. దీని బోర్డు 2019 నుంచి ఇప్పటి వరకు భేటీనే కాలేదు. అయినా అనధికారికంగా పదవుల్లో వ్యక్తులు కొనసాగుతూనే ఉన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏవైనా సినిమాలు వస్తే, సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన ఈ సంస్థ సెన్సార్‌బోర్డు బాధ్యతల్ని కూడా నెత్తికెత్తుకుంటోంది. దీనికి బాలీవుడ్‌, టాలివుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌ఉడ్‌ వంటి భేదాలేం లేవు. జాతీయ స్థాయిలో విడుదలకు సిద్ధమయ్యే సినిమాలైతే చాలు. ‘నచ్చితే సై…లేకుంటే నై’ అన్నట్టే వ్యవహరిస్తున్నారని ఫిల్మ్‌ మేకర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లోని కంటెంట్‌ కంటే, ‘మాకేంటి?’ అనే అవినీతి ధోరణికూడా పెరిగిపోయిందని ఆవేదన చెందుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20కి పైగా భాషల్లో ఏడాదికి 2,500 కంటే ఎక్కువ చిత్రాలు విడుదలవుతున్నాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.

వినోదం సహా అనేక రకాల పన్నుల్ని చెల్లిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని చిత్రాలు మాత్రమే అతి కష్టం మీద ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతున్నాయి. అయితే ఆస్కార్‌ వరకు వెళ్లడం గగనంగా మారుతున్నది. చిత్ర దర్శకుడు ఎంతో నైపుణ్యంతో సినిమాను రూపొందించినా, దాని విడుదల దర్శకుడు, నిర్మాత చేతిలో ఉండదు. దానికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికెషన్‌ (సీబీఎఫ్‌సీ) తప్పనిసరి. దేశవ్యాప్తంగా ఒక సినిమా విడుదల కోసం ఈ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ను పొందాలి. అనుమతులు ఇవ్వడం, తిరస్కరించడం ఆ బోర్డులో ఉండే సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే సీబీఎఫ్‌సీపై చిత్ర పరిశ్రమలో తీవ్ర అసంతృప్తి ఉంది. సినిమాలకు సర్టిఫికెట్లు జారీ చేయాల్సిన ఈ బోర్డు, సెన్సార్‌షిప్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సిద్ధాంతానికి అనుకూలంగా ఉండే చిత్రాలకు గ్రీన్‌ సిగల్‌ ఇస్తూ, ఇతర సినిమాలకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నది. సినిమాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక, ప్రాంతీయ అంశాలను కారణాలుగా పేర్కొంటూ కోతలకు ఆదేశిస్తున్నది. దీంతో డైరెక్టర్‌ తాను అనుకున్న సినిమా స్వభావమే మారిపోతుండటంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉంటున్నాడు. ఫిల్మ్‌ బోర్డు పదుల సంఖ్యలో కోతలు విధిస్తుండటంతో దర్శకుడు చెప్పదలుచుకున్న కథ తలాతోకా లేకుండా మిగులుతోంది.

ఆ రెండు చిత్రాలకు అవే తిప్పలు
‘హోమ్‌బౌండ్‌’ సినిమాను అమెరికన్‌ ఫిల్మ్‌మేకర్‌ మార్టిన్‌ స్కొర్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా నిర్మించారు. దీనిని ఆస్కార్‌ ఎంట్రీకి భారత్‌ అధికారికంగా నామినేట్‌ చేసింది. పోస్టర్‌ నుంచి మార్టిన్‌ పేరును తొలగించాలని బోర్డు ఆదేశించింది. అలాగే సినిమాలోని కులం పేరుతో ఉన్న పలు సన్నివేశాల మార్పులు, చేర్పులను ప్రతిపాదించింది. ఇలా సీబీఎఫ్‌సీ నుంచి చాలా అడ్డంకులను ఎదుర్కొన్న ఈ చిత్రం నేడు భారత్‌లో విడుదల కానున్నది. ఇక ప్రముఖ సిక్కు మానవ హక్కుల కార్యకర్త జస్వంత్‌ సింగ్‌ ఖల్రా జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘పంజాబ్‌ 95’. మూడేండ్ల నుంచి ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తున్నది. చిత్ర బృందం 2022 నుంచి కేంద్ర సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ కోసం ఎదురు చూస్తున్నది. ఈ చిత్రంలో తొలుత 21 సన్నివేశాలు తొలగించాలని చెప్పిన బోర్డు, ఆ తర్వాత దానిని 130 కట్‌లకు పెంచింది. పంజాబ్‌ పోలీస్‌ సినిమా టైటిల్‌ మార్చాలని కూడా ఆదేశించింది. ఈ రెండు చిత్రాలపై విధించిన ఆంక్షలు ఏకపక్షంగా కఠిన వైఖరితో కూడుకున్నవని చిత్ర పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.

బోర్డు మీటింగే లేదు
సీబీఎఫ్‌సీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే చట్టబద్ధమైన సంస్థ. సినిమాటోగ్రాఫ్‌ యాక్ట్‌ 1952 ద్వారా ఇది భారత్‌లోని చలనచిత్రాల ప్రదర్శనను నియంత్రిస్తుంది. సినిమాటోగ్రాఫీ (సర్టిఫికెషన్‌) రూల్స్‌-2024ను బోర్డు పాటిస్తున్న దాఖలాలే లేవు. సదరు నిబంధనల ప్రకారం బోర్డు ప్రతి మూడు నెలలకోసారైనా సమావేశం కావాలి. వార్షిక నివేదికను రూపొందించి, ప్రచురించాలి. దాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించాలి. మూడేండ్ల పదవీకాలానికి సభ్యులను నియమించాలి. సీబీఎఫ్‌సీ అంటే ప్రేక్షకులు చూసేలా చిత్రాలను సర్టిఫై చేయాల్సిన ఒక బోర్డు. అది సెన్సార్‌షిప్‌ సంస్థగా పని చేయొద్దు. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరగలేదు. ఆ సంస్థ వెబ్‌సైట్‌లో 2016-17కు చెందిన సీబీఎఫ్‌సీ వార్షిక రిపోర్టు మాత్రమే ఉంది. 2017లో బోర్డులో సభ్యులను మూడేండ్ల కాలానికి నియమించారు. 2020లో వారి పదవీ కాలం ముగిసినా, వారే ఇప్పటికీ అనధికారికంగా పదవుల్లో కొనసాగుతున్నారు. దీనిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చైర్‌పర్సన్‌ ఇష్టారాజ్యం
సీబీఎఫ్‌సీ బోర్డ్‌ చైర్‌పర్సన్‌ ప్రసూన్‌ జోషి. ఇక్కడ ఆయన ఆడిందే ఆట…పాడిందే పాట. పూర్తిగా ఒన్‌మ్యాన్‌ షో నడుస్తోందని చిత్ర పరిశ్రమ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ‘తనకు నచ్చినవారితో కలిసి బోర్డును నడిపిస్తున్నారు. మిగతావారిని దగ్గరకు కూడా రానివ్వట్లేదు’ అని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఏ అధికారాలు లేకున్నా, గతంలో ఉన్న ఫిల్మ్‌ సర్టిఫికెషన్‌ ట్రిబ్యునల్‌ (ఎఫ్‌సీఏటీ)ని 2021లో రద్దు చేశారు. దీంతో ఫిల్మ్‌మేకర్లు బోర్డు నుంచి ఏదైనా సమస్య ఎదురైతే, హైకోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పడుతున్నది. బోర్డు నుంచి చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించకపోతే మొత్తం ఇండిస్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నదని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం నడుచుకోవాలనీ, చట్టబద్ధంగా విధుల ను నిర్వర్తించాలని కోరుతున్నారు. ఆ ప్రకారం సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -