– 2020తో పోలిస్తే 2021లో ఎక్కువ
– 81 లక్షల నుంచి కోటికి పైగా పెరుగుదల
– 0.1 శాతం తగ్గిన జననాల సంఖ్య : రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సమాచారం
న్యూఢిల్లీ: భారత్‌లో 2020తో పోలిస్తే 2021లో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) ప్రచురించిన రెండు నివేదికలు ఈ సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. దాదాపు ఐదేండ్ల విరామం తర్వాత ఆర్‌జీఐ వీటిని ప్రచురించింది.ఆర్‌జీఐ సమాచారం ప్రకా రం..2021లో భారత్ ఒక కోటి మరణాలను నమోదు చేసింది. ఇది 2020 కంటే దాదాపు 21 లక్షల మరణాలు ఎక్కువ. ”2020లో 81.20 లక్షల మరణాలు నమోదయ్యాయి.2021లో అది 102.20 లక్షలకు పెరిగింది. అం టే..26 శాతం పెరుగుదల” అని ‘వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్‌ది సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఫర్ ది ఇయర్ 2021’ అనే నివేదిక పేర్కొన్నది.
2021లో పెరిగిన కోవిడ్-19 మరణాలు
ఆర్‌జీఐ సంకలనం చేసిన మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ డెత్ 2021పై మరొక నివేదిక ప్రకారం.. కోవిడ్-19 మూలకారణంగా 2020లో 1,60,618 మరణాలు నమోదయ్యాయి. 2021లో అవి 4,13,580కి పెరిగాయి. ఇందులో 2,67,363 మంది పురుషులు, 1,46,215 మంది మహిళలు ఉన్నారు. 2021లో నమోదైన 1,02,24,506 మరణాలలో 23,95,128 వరకు వైద్యపరంగా ధృవీకరించబడిన మరణాలు సంభవిం చాయి. ఇది 2020తో పోలిస్తే 5,83,440 ఎక్కువ కావటం గమనార్హం.
ఈ రెండు ఏడాదుల్లో 5.74 లక్షల కరోనా మరణాలు
ఈ రెండు ఏడాదుల్లో కోవిడ్-19 మరణాలు 5,74,198గా నమోదయ్యాయని నివేదిక వివరిస్తున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించే కోవిడ్-19 డాష్‌బోర్డ్ ప్రకారం చూస్తే మే 5 నాటికి మహమ్మారి కారణంగా సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 5,33,665గా ఉన్నది. ప్రపంచ దేశాలతో పాటు భారత్‌నూ కరోనా మహమ్మారి తీవ్రంగా వణికించింది. ఈ మహమ్మారి ధాటికి కోట్లాది మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో 2020లో కరోనా తీవ్ర రూపం దాల్చింది. ఇది లక్షలాది మందికి పీడకలనే మిగిల్చింది. ఆ తర్వాత రెండు, మూడేండ్లూ దీని ప్రభావం కొనసాగింది. ముఖ్యంగా, 2021లోనూ కరోనా విజృంభించింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది.
పల్మనరీ వ్యాధులతో అధిక సంఖ్యలో మరణాలు
2021లో మరణాల విషయంలో ప్రధాన కారణాలను చూస్తే.. పల్మనరీ వ్యాధులతో సహా ప్రసరణ వ్యవస్థ వ్యాధులు 29.8 శాతం ఉన్నాయి. ఆ తర్వాత కోవిడ్-19 వల్ల కలిగే మరణాలు 17.3 శాతంగా ఉన్నాయి. ఇక శ్వాసకోశ వ్యవస్థ వ్యాధులతో కలిగే మరణాలు 12.7 శాతం, కొన్ని అంటు, పరాన్నజీవుల వ్యాధుల వల్ల కలిగే మరణాలు 6.1 శాతంగా ఉన్నాయని నివేదిక పేర్కొన్నది.
కోవిడ్-19 కారణంగా ఇలా..
2021లో మరణాలకు రెండో ప్రధాన కారణంగా కోవిడ్-19 ఉంటే.. 2020లో మాత్రం మూడో ప్రధాన కారణంగా ఉన్నది. దేశవ్యాప్తంగా ఉన్న 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)లలో.. యూపీ, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్నాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఢిల్లీ ల నుంచి 2020 నుంచి 2021 మధ్య మరణాలు గణనీయంగా పెరిగాయి. ఇక నమోదిత జననాల సంఖ్య 2020లో 242.2 లక్షల నుంచి 2021లో 242 లక్షలకు స్వల్పంగా తగ్గింది. ఈ తగ్గుదల శాతం 0.1 అని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక వివరించింది.
21 లక్షల మరణాలు అధికం
- Advertisement -
- Advertisement -