అమెరికా-పాక్ దేశాధినేతల సమావేశం
పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ కూడా హాజరు
శ్వేతసౌధంలో చర్చలు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కలిశారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్ వేదికగా ఇరు దేశాల అధినేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి షెహబాజ్ షరీఫ్‌తో కలిసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ కూడా హాజరయ్యారు. యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇటీవల ట్రంప్.. ఆసిం మునీర్‌తో వైట్‌హౌజ్‌లో భేటీ అయిన విషయం విదితమే.
షెహబాజ్ షరీఫ్ గొప్ప నాయకుడు : ట్రంప్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, పాక్ దేశాల మధ్య బంధాలు బలపడుతున్నట్టు కనబడుతున్నది. పాక్‌కు అనుకూలంగా ట్రంప్ ప్రకటనలు చేయటం, భారత్‌పై అధిక శాతం సుంకాలు విధించటం వంటివి ట్రంప్ వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు.. ఈ సమావేశానికి ముందు కూడా ట్రంప్.. షెహబాజ్ షరీఫ్, మునీర్‌లను గొప్పనాయకులుగా అభివర్ణించటం గమనార్హం. తనను కలవటానికి ముందు వేచిచూస్తున్న వీరిని ఉద్దేశిస్తూ విలేకరులతో ట్రంప్ పైవిధంగా స్పందించారు.
ఏం చర్చించారు?
ఈ సమావేశంలో యూఎస్, పాక్ మధ్య వాణిజ్య ఒప్పందం గురించి చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఏం చర్చించారన్నదానిపై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉన్నది. అలాగే వీరి భేటీకి మీడియాను కూడా అనుమతించకపోవటం గమనార్హం. న్యూయార్క్‌లో మంగళవారం నిర్వహిం చిన యూఎన్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ట్రంప్, షెహబాజ్‌లు కొంత సమయం పాటు సమావేశమైన విషయం విదితమే. కొన్ని రోజుల వ్యవధిలోనే శ్వేతసౌధం వేదికగా ఇప్పుడు వీరిద్దరు కలుసుకోవటం గమనార్హం.
ట్రంప్ కోసం అర్ధ గంట పాటు వెయిటింగ్
అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.52 గంటలకు పాక్ ప్రధాని.. ట్రంప్‌ను కలవటానికి వైట్‌హౌజ్‌కు వచ్చారు. ఆయనకు అక్కడి అధికారులు స్వాగతం పలికారు. షెహబాజ్ షరీఫ్, ఆసిం మునీర్‌లు వచ్చే సమయానికి ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడుతున్నారు. అధ్యక్షుడిని కలవటం కోసం పాక్ నేతలిద్దరూ అర్ధగంట పాటు వేచి ఉన్నట్టు తెలుస్తున్నది. ట్రంప్‌తో భేటీ తర్వాత పాక్ ప్రధాని 6.18 గంటలకు శ్వేతసౌధాన్ని వీడారు.
ట్రంప్‌తో షెహబాజ్ భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES