నవతెలంగాణ-హైదరాబాద్ : ఎగువన కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదలడంతో హైదరాబాద్ నగరం మధ్యలో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహోగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసీ వరద బస్డాండ్‌లోకి చేరింది. వేల మంది ప్రయాణికులు బస్డాండ్‌లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితిని స్వయంగా అర్ధరాత్రి సమీక్షించారు.
మూసీ అంతకంతకు పెరగడంతో పరీవాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట) నిండుకుండలా ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో 13,500 క్యూసెక్యుల నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి 8 గంటల తర్వాత 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో మూసీ పొడవునా భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు. ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పురోగతిలో ఉన్న పైవంతెన నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయింది.