నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల విధానాన్ని సవాలు చేస్తూ, ఓ 11 ఏళ్ల బాలుడు ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఎం శ్రీ పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ జన్మేశ్ సాగర్ అనే విద్యార్థి సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం శ్రీ పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్షలు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009 స్ఫూర్తికి విరుద్ధమని జన్మేశ్ తన పిటిషన్‌లో స్పష్టం చేశాడు. తాను 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నానని, జులై 23న ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ మేరకు సెప్టెంబర్ 13న పరీక్ష కూడా రాశానని తెలిపాడు.
అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించరాదని విద్యాహక్కు చట్టం స్పష్టంగా చెబుతోందని పిటిషన్‌లో గుర్తుచేశాడు. ఈ ప్రవేశ పరీక్షల విధానం వల్ల పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేసి, పరీక్షలకు బదులుగా లాటరీ పద్ధతిలో ప్రవేశాలు కల్పించాలని కోరాడు.