నవతెలంగాణ – ఉప్పునుంతల
రోజువారి వాడే సరుకులపై జీఎస్టీని 18, 12 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం ఈనెల 21 అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చింది. కానీ ధరలు తగ్గుతాయన్న ఆశలు వమ్మయ్యాయి. షాపు యజమానులు “పాత స్టాక్‌ను తక్కువ రేట్లకు అమ్మలేం” అంటూ బహిరంగంగానే వినియోగదారులకు సమాధానం ఇస్తున్నారు. ఫలితంగా జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కాగితాలపైనే మిగిలిపోయింది.
కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలు కావడంలేదని కొనుగోలుదారులు మండిపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో పాత వస్తువులకే కొత్త రేట్లు వసూలు అవుతున్నాయి. పండుగల సీజన్‌లోనూ సరుకులు అదే ధరలకు దొరకడంతో వినియోగదారులు నిరాశతో పాటు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “ప్రయోజనం మాకేం లేదండీ, లాభం షాపులకే, డీలర్లకే” అని ప్రజలు ఆవేదన చెబుతున్నారు. దసరా, దీపావళి వేళ వినియోగదారులకు ఉపశమనం ఇవ్వాల్సిన కేంద్రం, వ్యాపార వర్గాలకు లాభం చేకూర్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “జీఎస్టీ తగ్గింపు ఎక్కడ? మేము కొనుగోలు చేసే ధరల్లో తగ్గుదల ఏదీ కనిపించడం లేదు. ఇది ప్రజల జేబు కోతే కాదా?” అంటూ కేంద్రాన్ని నిలదీస్తూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
“జీఎస్టీ తగ్గినా – జేబు ఖర్చు తగ్గలేదు”
ఒక వినియోగదారుడు తన అనుభవాన్ని పంచుకుంటూ – “ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఈనెల 23న ఒక పట్టణంలోని షాపులో సిమెంటు బ్యాగులు కొనుగోలు చేశాను. కానీ పాత రేట్లకే ఇచ్చారు. ఒక బస్తా రూ.300 చొప్పున 20 బస్తాలకు రూ.6000 చెల్లించాను. జీఎస్టీ తగ్గిందని చెబుతున్నారు కానీ మా జేబు ఖర్చులో మాత్రం తగ్గుదల కనిపించడంలేదు. నిజంగా రేట్లు తగ్గాయా లేదా అనుమానం కలుగుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. – చింతల రమేష్, గృహనిర్మాణ వినియోగదారుడు, రాయిచెడు, ఉప్పునుంతల మండలం.
“జీఎస్టీ తగ్గింపుపై వ్యాపార దోపిడీ ”
“ఇది బహిరంగ దోపిడీ తప్ప మరేం కాదు. ప్రభుత్వం పన్ను తగ్గింపును ప్రజలకు అందించకుండా వ్యాపారవర్గాల కే వదిలేసింది. పండుగ పేరుతో ధరలు పెంచి సామాన్యుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇది కూలీ, రైతు, చిన్నపాటి ఉద్యోగుల పొట్ట కొట్టడమే తగ్గింపు ధరలు క్షేత్రస్థాయిలో అమలయేలా ప్రజల తరఫున ఎర్రజెండా ప్రజలకు అండగా ఉంటుంది. – సీపీఐ(ఎం)మండల కార్యదర్శి, చింతల నాగరాజు, ఉప్పునుంతల మండలం.