– ఫాసిజాన్ని తిప్పికొట్టేందుకు కార్మికవర్గం, కష్టజీవులు ఐక్యం కావాలి
– నయాఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈ భూ మండలంపైన్నే ఎర్రజెండా లేకుండా చేస్తానని విర్రవీగిన హిట్లర్ చివరకు ఆ జెండా దెబ్బకు ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పార్టీ హైదరాబాద్ సిటీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ‘సమకాలిన పరిస్థితులు-సవాళ్లు’ అంశంపై సిటీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఫాసిజంమీద సోవియట్ యూనియన్ సాధించిన విజయం సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ ఫాసిజం మీద సోవియట్ యూనియన్ ఎర్రసైన్యం విజయం సాధించటం, బెర్లిన్ కోటపై ఎర్ర జెండా ఎగిరేయటంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దాంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుందని గుర్తు చేశారు. 1920వ దశకంలో నెలకొన్న తీవ్ర ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి, రాజ్యాధికారంపై ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి పాలక శక్తులు ఫాసిజాన్ని ఆశ్రయించాయన్నారు. ప్రపంచవ్యాపంగా అనేక దేశాల్లో కార్మికవర్గ పోరాటాలు వెల్లువెత్తి, కమ్యూనిస్టు ఉద్యమాలు ఉధృతంగా పెరుగుతూ వచ్చాయని వివరించారు. ఆర్థిక సంక్షోభ కాలంలో కార్మిక వర్గానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీలు అధికారం చేజిక్కించుకోకుండా చూడడానికి పాలక శక్తులు రకరకాల ఫాసిస్టు ఎత్తుగడలను అవలంబిం చాయని చెప్పారు. ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లర్, జపాన్‌లో హిరోహితోలు ఫాసిస్టు శక్తులకు ప్రాతినిధ్యం వహించారని వివరించారు. ఆయా దేశాల్లో ఫాసిజం తలెత్తడానికి దేశీయ బూర్జువా వర్గంతో పాటు ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ వంటి పెట్టుబడిదారీ దేశాల్లోని బూర్జువావర్గం కూడా ఎంతగానో తోడ్పడిందన్నారు ఫాసిజం అంటే ‘కార్మికవర్గ విప్లవాలకు బెదిరి ఫైనాన్స్ పెట్టుబడి బాహాటంగా ఉగ్రవాద నియంతృత్వానికి పాల్పడడం’ అని కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ నాయకుడు, ఫాసిస్టు వ్యతిరేక యోధుడు అయిన జార్జి డెమిట్రోవ్ నిర్వచించాడని గుర్తు చేశారు. హిట్లర్ ఫాసిజాన్ని తిప్పికొట్టడానికి ‘ఫ్రంట్’ కడదాం రమ్మని స్టాలిన్ ప్రతిపాదించి నపుడు బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు గట్టిగా తిరస్కరించాయని వివరించారు. హిట్లర్ తన సైన్యాన్ని ఫ్రాన్స్ మీదకు నడిపించి ఆ దేశాన్ని ఓడించి, బ్రిటన్‌ను బెదిరించిన తర్వాత ఆ దేశాలు కళ్లు తెరిచాయన్నారు. అయినా ‘ఫాసిజానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుదాం’ అని స్టాలిన్ పదేపదే చేసిన ప్రతిపాదనలను నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. సోషలిస్టు రష్యాను హిట్లర్ ఓడించి తీరతాడన్న ఆశలు పెట్టుకున్నాయనీ, ఈ ఆశలతోనే ఫాసిజంపై రెండవ దిక్కు నుంచి సాగించాల్సిన యుద్ధాన్ని అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు రెండేండ్లు ఆలస్యంగా మొదలుపెట్టాయని చెప్పారు. ఇన్ని ఆటంకాల మధ్య హిట్లర్ నాజీ సైన్యాన్ని ఎదుర్కొని, ఫాసిజాన్ని మట్టి కరిపించడంలో సోషలిస్టు రష్యా కీలకపాత్ర పోషించిందని చెప్పారు. ఈ యుద్ధంలో 2 కోట్ల మంది రష్యన్లు అసువులు బాశారనీ, 30 లక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగాలను మర్చిపోలేమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఫాసిస్టు ధోరణులు పెచ్చరిల్లడానికి దోహదం చేసే పరిస్థితులకు దారితీస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని వీరయ్య ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
సామ్రాజ్యవాదానికి, నయా ఉదారవాద విధానాలకు, పాలక శక్తులు అనుసరిస్తున్న విద్వేష, విభజిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల మధ్య ఐక్యతను నెలకొల్పడం ద్వారా మాత్రమే ఫాసిజాన్ని ఓడించగలమని చరిత్ర మనకు చెబుతోందనీ, ఫాసిజం దాడులను తిప్పికొట్టడానికి కార్మికవర్గం, కష్టజీవుల ఐక్యత పునాదిగా సమాజంలోని వివిధ తరగతుల ప్రజానీకాన్ని విశాల ప్రాతిపదికన సమీకరించడమే మార్గమని చెప్పారు. సదస్సులో సీటీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్, ఎం. శ్రీనివాస్‌రావు, ఎం దశరథ్, మహేందర్, రాజన్న, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విర్రవీగిన హిట్లర్ ఏమయ్యాడు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES