బీజేపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించండి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ పిలుపు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రజా వ్యతిరేక, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రం లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ సీనియర్ నాయకులు లంకా రాఘవులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ఎలా ప్రజలు మోసం చేస్తుంది… మత రాజకీయాలు చేస్తుందనే అంశాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటివరకు దానిని అమోదించకుండా నిర్లక్ష్యం చేయడం ఇది బీసీ లను బీజేపీ పార్టీ అవమానించడమేనని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ(ఎం) స్వతంత్రంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం)ను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించి ప్రజా సమస్యలపై పోరాడే పార్టీని బలపరచాలని కోరారు.
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం..
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జీఎస్.టీ తగ్గింపు పేరుతో ఉత్సవాలు చేయడం విడ్డురమని హెద్దేవా చేశారు. ఎనిమిది ఏండ్ల పాటు ప్రజలను టాక్స్ ల పేరుతో దోపిడీ చేసి, ప్రజల నిత్య జీవనంపై తీవ్ర దెబ్బ కొట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటిని రద్దు చేయకుండా సంబరాలపేరుతో ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముందు నుంచే మత రాజకీయాలు చేసే బీజేపీ బీసీ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్ అమలుకు అసెంబ్లీలో తీర్మాణం చేసి పార్లమెంట్ కు పంపిందన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ కు పంపిన కూడా కేంద్రం ఒత్తిడి తెచ్చి బీసీలకు 42 శాతం రానివ్వకుండా అడ్డుకుందన్నారు.
బీజేపీ వైఖరి కారణంగా ఎప్పుడు రావాల్సిన రిజర్వేషన్ లో జాప్యం జరిగిందని ఆరోపించారు. అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన 4 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. పంటల కాలం అయిన తరువాత యూరియా ఇచ్చిన ఫలితం ఉండదన్నారు. కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజల్లో తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర నాయకులు శోభన్, కోట రమేష్, జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, పూసం సచిన్, కిరణ్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, సురేందర్, ఆశన్న, కిష్టన్న, గంగన్న, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
