– కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
– డీమిటేషన్‌కు తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య
– అయితే అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలంటూ సూచన
– ‘ది హిందూ హడిల్-2025’ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరైన సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సామాజిక న్యాయంతోపాటు ఇతర అంశాల్లో తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన తెలిపారు. ది హిందూ దిన పత్రిక ఆధ్వర్యంలో శుక్రవారం బెంగళూరులో ‘ది హిందూ హడిల్-2025’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి వర్చువల్ (వీడియో కాన్ఫరెన్సు)గా హాజరయ్యారు. సభికులు, వీక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకెళుతోందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. దేశంలోనే మొట్టమొదటిగా నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీలకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రద్దు, 360 కిలో మీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, పారిశ్రామిక పార్కులు, ఐటీ, ఆటోమొబైల్ రంగాలకు మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలను చేపట్టినట్టు వివరించారు. డీలిమిటేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, కానీ కేంద్రం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి స్పష్టమైన ప్రాతిపదికను వెల్లడించాలని సీఎం డిమాండ్ చేశారు. అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలను శిక్షించకూడదని అభిప్రాయపడ్డారు. దేశంలో సామాజిక, రాజకీయ న్యాయం కోసం చర్చ జరగాలని కోరారు. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. దేశ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తున్న సైనికులకు అందరూ మద్దతు తెలపాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రానికి రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించామని రేవంత్ తెలిపారు. ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సహేతుకమైన ప్రణాళికలతో పరిశ్రమలు, ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జపాన్ పర్యటనలో తెలుసుకున్న అంశాల ఆధారంగా, జపనీస్ భాషను తెలంగాణలో నేర్పించి, ఆ దేశానికి మానవ వనరులను సమకూర్చే దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే దేశానికి మోడల్‌గా నిలిచిందని సీఎం అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు.
తెలంగాణ మోడల్‌ను అనుసరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES