పూల పూల చీరెకట్టి
పసుపు కుంకుమల రైకె జుట్టి
పూబోడుల గారాలపట్టి
పెత్తరమాసనాడు
పుత్రికై పురుడు పోసుకుంటుంది!
తొమ్మిది దినాలూ
తొందర తొందరగా సాగి
అప్పుడే అయిపోవస్తివా
మల్లెన్నడస్తావు చందమామా అంటూ
మళ్ళీ మళ్ళీ అడిగించుకుంటుంది
తన ఆయుష్షును ప్రతీయేడాదికి
పొడిగించి పెంచుకుంటుంది!
పువ్వుల అమరికలో
అపూర్వ శిల్పవిశేషాలు!
పాటల అంతరార్థాల్లో
అనన్య సందేశాలు!
ఆటల ప్రదర్శనలో
అపురూప లయవిన్యాసాలు
అడుగడుగునా ఆమె
ఆత్మ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది!
పగలంతా చెమటోడ్చిన పల్లెపడతులు
సాయంత్రానికి చిక్కిన చందమామలై
తీరొక్క పూలసింగిడీలతో
చిగురెంతల చిబ్బులౌతారు!
బతుకమ్మబాయి ముందర
దరువు చప్పట్ల డప్పులౌతారు
వర్తులాకార వరుసల్లో నర్తిస్తూ
వాగ్గేయకారులకు
వంతపాడే వనకన్యలౌతారు
ప్రకతి కాంతులై ప్రజ్వరిల్లి
పంచభూతాలకు
ప్రగాఢ ప్రణతులర్పిస్తారు!!
కరిపె రాజ్ కుమార్, 8125144729