Sunday, October 19, 2025
E-PAPER
Homeమానవిమష్రూమ్‌ లేడీ బినా దేవి

మష్రూమ్‌ లేడీ బినా దేవి

- Advertisement -

తెతిహా బాంబోర్‌లోని తిల్కారి గ్రామంలో నివసించే బినా దేవి వద్ద పెట్టుబడి పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు లేదు. కానీ అపారమైన సంకల్పం ఉంది. గ్రామీణ వైద్యుడిగా భర్త సంపాదించే స్వల్ప ఆదాయంతో నలుగురు పిల్లల్ని పెంచుతూ, ఇల్లు నడపడం ఆమెకు ఓ సవాలుగా ఉండేది. ఓ చిన్న గదిలో వ్యవసాయం ప్రారంభించింది. అదే నేడు గ్రామీణ సాధికారతా ఉద్యమంగా మారింది. ఇప్పుడు 70 వేల మంది గ్రామీణ మహిళలకు సాధికారత కల్పిస్తోంది. ఆమె తెచ్చిన ఈ మార్పుకు ‘ది మష్రూమ్‌ లేడీ’గా ప్రసిద్ధి చెందింది.

బీహార్‌లోని ముంగేర్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం తిల్కారి. ఒకప్పుడు తన నలుగురు పిల్లలను పోషించడానికి ఒక మహిళగా ఎంతో ఇబ్బంది పడింది బీనాదేవి. పేదరికంతో పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోయేది. ఆ కుటుంబానికి స్థిరమైన ఆదాయం లేదు. రేపటి రోజు ఎలా గడుస్తుందో తెలియక నిత్యం ఓ పోరాటమే. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలోనే బినా దేవి అసాధారణమైన, శక్తివంతమైన మార్గాన్ని ఎంచుకుంది. తాను నిద్రపోయే మంచం కింద పుట్టగొడుగులను పండించడం ప్రారంభించింది.

అసాధారణ మార్గం
బీనాదేవి కుటుంబానికి వ్యవసాయం చేయడానికి భూమి లేదు. పెట్టుబడి పెట్టడానికి మూలధనం లేదు. కానీ పేదరిక చక్రాన్ని బద్దలు కొట్టాలని నిశ్చయించుకుంది. సాంప్రదాయ వ్యవసాయం అందుబాటులో లేక ఆమె అసాధారణ మార్గాన్ని ఎంచుకుంది. అదే పుట్టగొడుగుల సాగు. పొలాలు, ఖరీదైన మౌలిక సదుపాయాలు అవసరం లేని వ్యవసాయం ఇది. ఆమె తన మొదటి ప్రయత్నంలో కేవలం కిలో పుట్టగొడుగుల విత్తనాలను ఆర్డర్‌ చేసి, తన మంచం కింద పరిమిత స్థలంలో వాటిని పెంచడం ప్రారంభించింది.

పోరాటంతో నేర్చుకుంది
పుట్టగొడుగుల పెంపకం గురించి బినా అతి తక్కువ కాలంలోనే తెలుసుకుంది. అయితే అది కనిపించినంత సులభం కాదు. దీనికి తేమ, ఉష్ణోగ్రత, పరిశుభ్రతతో పాటు కచ్చితమైన నియంత్రణ అవసరం. సరైన, శిక్షణ సౌకర్యాలు లేకుండా సాగు చేయడం చాలా కష్టమైన విషయం. ప్రారంభంలో దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ బీనా ధైర్యంగా ముందుకు కొనసాగింది. భాగల్పూర్‌లోని సబోర్‌లోని బీహార్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ఎన్నో మెలకువలు తెలుసుకుంది. అక్కడే ఆమె తన జీవితాన్ని మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంది. క్రమంగా ఉత్పత్తి పెరగడంతో ఆమె ప్రయత్నాలు ఫలించాయి.

ఇంటి పనిని జీవనోపాధిగా
స్థానిక మార్కెట్లో పుట్టగొడుగులకు డిమాండ్‌ ఉండేది. కిలోకు రూ. 200 నుండి రూ. 300 వరకు ధరలు పెరిగింది. దాంతో బీనా లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. క్రమంగా ఆమె ఆదాయం ఏడాదికి లక్షలకు చేరుకుంది. ఇది ఆమె ఇంటినే మార్చివేసింది. ఒకప్పుడు చదువుకు దూరంగా ఉన్న ఆమె పిల్లలు ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు. ఆమె పెద్ద కొడుకు ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. మిగిలిన ముగ్గురు కూడా నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారు. విజయం సాధిస్తున్న కొద్దీ ఆమె ఆశయాలు కూడా పెరిగాయి. కేవలం ఆమె కోసం మాత్రమే కాకుండా తన లాంటి ఇతర మహిళలకు కూడా పని కల్పించడం మొదలుపెట్టింది.

గ్రామీణ మహిళలకు సాధికారత
బీనా తాను సాధించిన విజయం కేవలం తనకు మాత్రమే పరిమితం కావాలని కోరుకోలేదు. ఇతర మహిళలకు కూడా పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. నేడు 100కి పైగా గ్రామాల నుండి మహిళలు ఆమె సహకారంతో పుట్టగొడుగుల సాగు మొదలుపెట్టారు. బీనా వారికి వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చి, వారు స్వావలంబన పొందేందుకు మద్దతు, అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ‘మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు అయినప్పుడే వారి ఆత్మగౌరవం పెరుగుతుంది. అప్పుడే వారు ఆత్మవిశ్వాసంతో ఉండగలరు. కుటుంబం, సమాజంలో వారి స్థానం మెరుగుపడుతుంది’ అంటుంది బీనాదేవి.

జాతీయ గుర్తింపు
బీనా చేస్తున్న కృషికి మంచి గుర్తింపు కూడా లభించింది. 2014లో బీహార్‌ ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం పొందింది. 2018లో మహిళా రైతు అవార్డు, 2019లో కిసాన్‌ అభినవ్‌ పురస్కార్‌ అందుకుంది. 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఆమెను సత్కరించారు. ప్రధానమంత్రి కూడా తన మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో ఆమె గురించి ప్రస్తావించారు. ‘నేను ప్రధానినీ, రాష్ట్రపతిని కలిసినప్పుడు కంగారు పడ్డాను. వారి కోసం పుట్టగొడుగులు, నిమ్కి, ఊరగాయలు, బిస్కెట్లు తీసుకెళ్లాను. నేను ఈ పుట్టగొడుగుల సాగు ప్రారంభించినప్పుడు చాలా మంది నన్ను పిచ్చిది అన్నారు. నా పనిని ఎగతాళి చేశారు. కానీ నేను ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. నేను నమ్మింది చేస్తూనే ఉన్నాను. వెనక్కి తిరిగి చూడలేదు’ అంటూ బీనా పంచుకుంది. ప్రస్తుతం ఆమె డిజిటల్‌ అక్షరాస్యతకు మద్దతుదారుగా, బీహార్‌లోని ధౌరి పంచాయతీకి సర్పంచ్‌గా కూడా ఉంది.

సేంద్రీయ వ్యవసాయానికి స్వరం
బినా లక్ష్యం పుట్టగొడుగుల సాగుతో ఆగలేదు. ఆమె ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. రైతులు రసాయన ఆధారిత వ్యవసాయం నుండి వైదొలగాలని ఆమె ప్రచారం చేస్తోంది. ఆరోగ్య ప్రయోజనాలు, పర్యావరణ బాధ్యత రెండింటినీ నొక్కి చెబుతూ రసాయన రహిత వ్యవసాయం కోసం ఆమె కృషి చేస్తోంది. అయితే తాను చేస్తున్న కృషికి అట్టడుగు స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అపారమైన గుర్తింపు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రత్యక్ష మద్దతు లభించలేదని బినా పంచుకుంది.

ప్రభుత్వానికి విజ్ఞప్తి
‘ఇప్పటి వరకు నాకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదు. మా లాంటి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. దాని వల్ల ఆర్థిక ప్రయోజనం పొందగలుగుతాము. ఈ విష యంలో నేను ప్రధానమంత్రికి, బీహార్‌ ప్రభు త్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పటి వరకు 60,000 నుండి 70,000 మంది మహిళల్లో అవగాహన పెంచాను. ఈ మహిళలు ఇప్పుడు సంపాదించుకుంటున్నారు. తమ పిల్లలకు విద్యను అందిస్తున్నారు, గౌరవంగా జీవిస్తున్నారు. వారు ఇకపై తమ భర్తలను డబ్బు అడగాల్సిన అవసరం లేదు’ అని ఆమె అంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -