Sunday, September 28, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీ'మోహన' నటనకు దాదాసాహెబ్‌

‘మోహన’ నటనకు దాదాసాహెబ్‌

- Advertisement -

”మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

ఈ నెల 23 వ తేదీన 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో 2023 సంవత్సరానికి గాను మోహన్‌ లాల్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ‘కంప్లీట్‌ యాక్టర్‌’ అనే పేరు సంపాదించుకున్న మోహన్‌ లాల్‌ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు అందుకోవడంతో, ఆయన నట సామర్థ్యానికి తగిన గౌరవం దక్కిందని సినీప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.”

భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ ను వరించింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌తో ప్రభుత్వం ఆయనను సత్కరించింది. అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే మోహన్‌ లాల్‌ అద్భుతమైన సినీ ప్రయాణం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు అజరామరం. ఆయన తన అసమాన ప్రతిభ, వైవిధ్యంతో భారత సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని నెలకొల్పారు. మోహన్‌ లాల్‌ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆయన ప్రదర్శించిన నటన అద్భుతం.

‘లలేట్టన్‌’ అని మలయాళి ప్రేక్షకులు అభిమానంతో పిలుస్తున్న మోహన్‌ లాల్‌ 48 ఏళ్ల సుధీర్గ సినీ ప్రయాణంలో దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించాడు. ‘మనరత్నం’, ‘ద్రువపద్మం’, ‘వన్‌స్‌ ఫుల్‌ రెడ్‌ ఈవెనింగ్‌’ వంటి భారతీయ సినిమాకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో తన పాత్రలతో ప్రశంసలు అందుకున్నారు. కథానాయకుడిగా విభిన్న పాత్రలు పోషించిన మోహన్‌ లాల్‌ తెలుగులో నటించినవి తక్కువేగానీ అనువాద చిత్రాల ద్వారా మన ప్రేక్షకులను మెప్పించారు. ‘ఇద్దరు, కంపెనీ’, తెలుగు చిత్రం ‘జనతా గ్యారేజ్‌’ లాంటివి తెలుగు వారికి బాగా గుర్తుండిపోయాయి. తన సినీ ప్రస్థానంలో అయిదు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులతోపాటు మరెన్నో అవార్డులు అందుకున్న మోహన్‌ లాల్‌ ను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్‌ వంటి పురస్కారాలతో సత్కరించింది. ఈ అవార్డుతో మోహన్‌ లాల్‌ ప్రస్థానం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంది.

మోహన్‌ లాల్‌ కేరళలోని పథనంతిట్ట జిల్లాలోని ఎలాంథుర్‌ అనే గ్రామంలో 1960 మే21 వ తేదీన జన్మించాడు. ఆయన పూర్తిపేరు మోహన్‌ లాల్‌ విశ్వనాథన్‌ నాయర్‌ తండ్రి విశ్వనాథన్‌ నాయర్‌ కేరళ ప్రభుత్వం లా సెక్రెటరీగా పనిచేశారు. తల్లి శాంతికుమారి గహిణి. మోహన్‌ లాల్‌ తిరువనంతపురంలోని ప్రభుత్వ మోడల్‌ బాయ్స్ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నాడు. తిరువనంతపురంలోనే మహాత్మా గాంధీ కళాశాలలో కామర్స్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఆరవ తరగతి లోనే మోహన్‌ లాల్‌ ”కంప్యూటర్‌ బాయ్” అనే రంగస్థల నాటకంలో తొంభై ఏళ్ల వ్యక్తిగా నటించాడు. ఆ సమయంలో స్కూల్‌ లో వేసే నాటకాలలో నటించడంతో ఆయనకు నటనపై మక్కువ ఏర్పడింది.

‘తిరనోట్టం’తో సినిమాలలోకి..
1978లో 18 సంవత్సరాల వయసులో ”తిరనోట్టం” అనే మలయాళ చిత్రంతో మోహన్‌ లాల్‌ తొలిసారి కెమెరా ముందుకొచ్చిన, 1980లో వచ్చిన ప్రేమకథ చిత్రం ”మంజిల్‌ విరింజపుక్కల్‌” విడుదలై ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ చిత్రంలో ఆయన విలన్‌ పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆ తరహా పాత్రలు ఆయనకు వరసగా వచ్చాయి. తరువాతి సంవత్సరాల్లో ద్వితీయ ప్రధాన పాత్రలకు ఎదిగాడు. ‘ఇవిడే తొండగుణ్ణు’ చిత్రంతో మోహన్‌ లాల్‌ పూర్తిస్థాయి హీరోగా మెప్పించాడు. ‘రాజవింటే మకన్‌’ చిత్రం మోహన్‌ లాల్‌ స్టార్‌ డమ్‌ను పెంచింది. ”కుయిలినే తేడి, ఎంత మొహన్‌ గళ్‌ పువనీంజు, ఇనియొంగిలుమ్‌, వీసా, అట్టకళాశం, కలియిల్‌ అల్పం కార్యం, ఎంత మమట్టుక్కుట్టియమ్మక్కు, ఎంగనే నీ మరక్కుం, ఉనరు, శ్రీకృష్ణ పరుంతు” వంటి చిత్రాలు మోహన్‌ లాల్‌ ఇమేజ్‌ని మార్చాయి. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన కామెడీ ‘పూచక్కోరు మూక్కుతి” చిత్రంలో తన మొదటి హాస్య ప్రధాన పాత్రను పోషించాడు. 2016 నాటికి 44 చిత్రాలలో కలిసి పనిచేసిన మోహన్‌లాల్‌-ప్రియదర్శన్‌ ద్వయం కూడా ప్రారంభమైంది.

1985లో ”ఉన్ననం కున్నిల్‌ ఒరడి కున్నిల్‌” చిత్రంలో మోహన్‌ లాల్‌ ఒక పాటను పాడాడు. ”ఉయరంగళిల్‌, నొక్కేత దూరతు కన్నుమ్‌ నట్టు, బోయింగ్‌ బోయింగ్‌, అరమ్‌ అరమ్‌ కిన్నారం” తదితర చిత్రాలలో తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. మోహన్‌ లాల్‌ ప్రముఖ దర్శకులు జి.అరవిందన్‌, హరిహరన్‌, ఎంటి వాసుదేవన్‌ నాయర్‌, పద్మరాజన్‌, భరతన్‌, లోహితదాస్‌” నిర్మించిన చిత్రాలలో చాలా భిన్నమైన పాత్రలను పోషించాడు, 1986లో సత్యన్‌ అంతికాడ్‌ దర్శకత్వం వహించిన ”టిపి బాలగోపాలన్‌ ఎంఏ” చిత్రంలో ఆయన నటించాడు. దీనికి ఆయన కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడిగా తొలి చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. ‘సన్మనస్సుల్లవర్కు సమాధానం’లో ఆయన నటనకు ఫిలింఫేర్‌ ఉత్తమ నటుడిగా (మలయాళం) అవార్డు లభించింది. 1986 లో ఒక్క ఏడాదిలోనే మోహన్‌ లాల్‌ 36 మలయాళ చిత్రాలలో నటించారు.

1990 ప్రారంభంలో ‘మోహన్‌ లాల్‌ హిస్‌ హైనెస్‌ అబ్దుల్లా, మిధునం, నెం.20 మద్రాస్‌ మెయిల్‌’ వంటి అనేక వాణిజ్య చిత్రాలలో నటించారు. ‘కిలుక్కం’ చిత్రం ద్వారా ఉత్తమ నటుడిగా రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా కూడా నిలిచింది. 1991లో, మోహన్‌ లాల్‌ ‘భారతం’ అనే చిత్రాన్ని నిర్మించి నటించాడు. ఈ చిత్రం విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయవంతమై మోహన్‌ లాల్‌ కు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును సంపాదించిపెట్టింది. ఆయన ‘కమలదళం’లో భరతనాట్య నత్యకారిడిగా నటించాడు. ‘మణిచిత్రతాళు’ అత్యంత విజయవంతమైన మలయాళ చిత్రాలలో ఒకటి, ఇది కొన్ని థియేటర్లలో 365 రోజులకు పైగా ప్రదర్శితమై, కల్ట్‌ హౌదాను పొందింది. ‘స్పాడికం’ చిత్రం తన మూడవ కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి చలనచిత్ర అవార్డును, ఐదవ ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. 1996లో మోహన్‌ లాల్‌ ప్రియదర్శన్‌ ‘కాలాపాణి’ లో నటించాడు. 1997లో రాజీవ్‌ అంచల్‌ దర్శకత్వం వహించిన ‘గురు’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం 1997 సంవత్సరానికి ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో నామినేషన్‌ కోసం ఆస్కార్‌కు భారతదేశం నుండి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.

1997లో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఇరువర్‌’ లో మోహన్‌లాల్‌ (తన మొదటి మలయాళేతర చిత్రంలో) నటించాడు. బెల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. మమ్ముట్టి, జూహి చావ్లాతో కలిసి నటించిన హరికష్ణన్స్‌ చిత్రాన్ని నిర్మించి నటించాడు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది. కానీ విమర్శకుల నుండి పెద్దగా ఆదరణ పొందలేదు. 1999లో షాజీ ఎన్‌. కరుణ్‌ దర్శకత్వంలో మోహన్‌ లాల్‌ నిర్మించిన ఇండో-ఫ్రెంచ్‌ కాలపు నాటకం ‘వానప్రస్థం’ లో ఆయన ఒక కథాకళి కళాకారుడి వ్యక్తిగత జీవితాన్ని విషాదభరితంగా చిత్రీకరించారు. మోహన్‌ లాల్‌ కు ఈ చిత్రం రెండవ ఉత్తమ నటుడి జాతీయ అవార్డును తెచ్చిపెట్టడమే కాకుండా, వివిధ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించడం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పోటీ విభాగానికి ఎంపికైంది. ఇది ఆయనకు నాల్గవ కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడి చలనచిత్ర అవార్డు, ఆరవ ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటుడి అవార్డు (మలయాళం)లను కూడా సంపాదించిపెట్టింది.

మోహన్‌ లాల్‌ ‘నరసింహం, రావణప్రభు, ప్రజ, ఒన్నమన, తాండవం, చతురంగం’ వంటి చిత్రాలలో యాక్షన్‌ హీరో పాత్రలలో నటించాడు. మజా, మధురనోంబరక్కట్టు వంటి మహిళా-ఆధారిత చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. 2002లో మోహన్‌ లాల్‌ తన మొదటి బాలీవుడ్‌ చిత్రం ‘కంపెనీ’ ద్వారా భారతదేశంలోని హిందీ మాట్లాడే ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మోహన్‌ లాల్‌ అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర అకాడమీ(ఐపా) అవార్డు, ఉత్తమ సహాయ నటుడిగా స్టార్‌ స్క్రీన్‌ అవార్డును గెలుచుకున్నాడు. తన యాక్షన్‌ హీరో ఇమేజ్‌ ని మార్చుకోవడానికి ”కిలిచుందన్‌ మాంపజమ్‌, బాలేట్టన్‌ , హరిహరన్‌ పిళ్ళై హ్యాపీ, మిస్టర్‌ బ్రహ్మచారి చిత్రాలలో హాస్య పాత్రలలో నటించాడు. 2004లో ‘నట్టురాజావు, మాంబఝక్కలం’ చిత్రాలు విజయం సాధించగా, 2005లో బ్లాక్‌ కామెడీ చిత్రం ఉదయనాను తరంలో ఒక అభిరుచి గల చిత్ర దర్శకుడిగా నటించాడు. దర్శకుడు బ్లెస్సీ రెండవ చిత్రం ‘తన్మాత్ర’లో కనిపించాడు. ఈ చిత్రానికి మోహన్‌ లాల్‌ తన నటనకు ఉత్తమ నటుడుగా 5వ సారి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును, ఉత్తమ నటుడుగా ఏడవ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును గెలుచుకున్నాడు.

2006లో దర్శకుడు మేజర్‌ రవి తీసిన ‘కీర్తిచక్ర’ లో మోహన్‌ లాల్‌ నటించాడు. ఇందులో ఆయన భారత ఆర్మీ అధికారి మేజర్‌ మహాదేవన్‌ పాత్ర పోషించాడు. ఈ చిత్రం కాశ్మీర్‌లో చిత్రీకరించబడింది. మేజర్‌ మహాదేవన్‌ సిరీస్‌లోని ‘కురుక్షేత్ర, కాందహార్‌’ సీక్వెల్స్‌లో కూడా మోహన్‌ లాల్‌ నటించాడు. 2009లో భారత ప్రభుత్వం అతనికి ఇండియన్‌ టెరిటోరియల్‌ ఆర్మీలో ‘లెఫ్టినెంట్‌ కల్నల్‌’ గౌరవ బిరుదును ప్రదానం చేసింది. 2007లో పి.టి. కుంజు ముహమ్మద్‌ దర్శకత్వం వహించిన ‘పరదేశి’ చిత్రంలో తన నటనకు మోహన్‌ లాల్‌ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఇదే ఏడాది విడుదలైన ‘హల్లో’ ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మోహన్‌ లాల్‌ తన రెండవ బాలీవుడ్‌ చిత్రం ‘ఆగ్‌’ (రామ్‌ గోపాల్‌ వర్మ కి ఆగ్‌ అని కూడా పిలుస్తారు), ఇది బాలీవుడ్‌ క్లాసిక్‌ ‘షోలే’ రీమేక్‌. 2008లో మోహన్‌ లాల్‌ మల్టీ-స్టారర్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ట్వంటీ:20’ లో ప్రధాన పాత్ర పోషించాడు. 2009లో కమల్‌ హాసన్‌తో కలిసి తమిళ చిత్రం ‘ఉన్నైపోల్‌ ఒరువన్‌’లో నటించాడు.

2010లో మోహన్‌ లాల్‌ ఐదు చిత్రాలలో నటించాడు. మొదటిది ‘జనకన్‌’, ఇందులో సురేష్‌ గోపితో కలిసి నటించాడు. మురళి నాగవల్లి దర్శకత్వం వహించిన ‘అలెగ్జాండర్‌ ది గ్రేట్‌’ హాస్యభరితమైన చిత్రం. టి.కె. రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ‘ఒరు నాల్‌ వరుమ్‌’, తదుపరి చిత్రం ‘షిక్కర్‌’, తరువాత 1999లో ఇండియన్‌ ఎయిర్లైన్స్‌ ఫ్లైట్‌ హైజాక్‌ ఆధారంగా మేజర్‌ రవి దర్శకత్వం వహించిన యుద్ధ చిత్రం ‘కాందహార్‌’ వచ్చింది. ఈ చిత్రంలో మోహన్‌ లాల్‌ మేజర్‌ మహాదేవన్‌ పాత్రను తిరిగి పోషించాడు. ఇది మేజర్‌ మహాదేవన్‌ చిత్రాల సిరీస్‌లో మూడవ భాగం కాగా అమితాబ్‌ బచ్చన్‌కు తొలి మలయాళ చిత్రం. మోహన్‌ లాల్‌ నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘క్రిస్టియన్‌ బ్రదర్స్‌’, దీనిలో సురేష్‌ గోపి, దిలీప్‌, శరత్‌ కుమార్‌లతో కలిసి నటించాడు. ‘చైనా టౌన్‌’లో జయరామ్‌, దిలీప్‌లతో కలిసి నటించిన మరో మల్టీస్టారర్‌ చిత్రం. ‘స్నేహవీడు’ చిత్రం మోహన్‌ లాల్‌ 300వ చిత్రం. 2012లో ఆయన ఆరు చిత్రాలలో నటించాడు. బాలీవుడ్‌ చిత్రం ‘తేజ్‌’ లో అతిధి పాత్రలో కనిపించాడు. ఆయన తదుపరి చిత్రం బి. ఉన్నికష్ణన్‌ ‘గ్రాండ్‌మాస్టర్‌”, ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైన మొదటి మలయాళ చిత్రం. రంజిత్‌ దర్శకత్వం వహించిన ‘స్పిరిట్‌’ విజయవంతమైంది. ఓనం పండుగ సందర్భంగా విడుదలైన ‘రన్‌ బేబీ రన్‌’ జోషి దర్శకత్వం వహించిన కామెడీ థ్రిల్లర్‌.

ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తర్వాత ఆల్‌-టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘దశ్యం’ విడుదలైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు వసూలు చేసింది. 2016లో మోహన్‌ లాల్‌ నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి, అవి ప్రపంచవ్యాప్తంగా 378 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం జనతా గ్యారేజ్‌ విడుదలై ప్రపంచవ్యాప్తంగా 135 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మేజర్‌ రవి దర్శకత్వం వహించిన ‘1971: బియాండ్‌ బోర్డర్స్‌’ లో నటించాడు. 1971 భారతదేశం-పాకిస్తాన్‌ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. 2019లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించిన లూసిఫర్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించిన సీక్వెల్‌ దశ్యం 2 లో మోహన్‌ లాల్‌ తన పాత్రను తిరిగి పోషించాడు. 2025లో మోహన్‌ లాల్‌ కెరీర్‌ తిరిగి పుంజుకుంది. అతను మొదట సీక్వెల్‌ -2: ఎంపురాన్‌లో తన పాత్రను తిరిగి పోషించాడు. ఆ తర్వాత అతను తుడారుమ్‌లో టాక్సీ డ్రైవర్‌గా నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయవంతమైంది.

తెలుగు చిత్రాలలో..
మోహన్‌ లాల్‌ తొలిసారి బాలకృష్ణ, రోజా నటించిన ‘గాండీవం’ చిత్రంలోని ”గోరువంక వాలగానే..” అంటూ సాగే పాటలో అతిథి పాత్ర పోషించారు. ఆ తర్వాత ”జనతా గ్యారేజ్‌, మనమంతా, కన్నప్ప” తదితర చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన ఈ సినిమాల కోసం తెలుగు భాషను నేర్చుకుని మరీ సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. మోహన్‌ లాల్‌ నటించిన ”యోధ, అభిమన్యు, కాలాపానీ, ఇద్దరు, మన్యంపులి, పులిజూదం, మరక్కార్‌, లూసిఫర్‌, ఎల్‌ 2 ఈ, తుడరుమ్‌” తదితర చిత్రాలు అనువాదాలుగా వచ్చి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

వ్యక్తిగత జీవితం
మోహన్‌ లాల్‌ తమిళ చిత్ర నిర్మాత కె. బాలాజీ కుమార్తె సుచిత్రను 28 ఏప్రిల్‌ 1988న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ప్రణవ్‌ మోహన్‌ లాల్‌, విస్మయ మోహన్‌ లాల్‌. ప్రణవ్‌ కొన్ని చిత్రాలలో నటించాడు, మోహన్‌ లాల్‌ నటించిన ఒన్నమన్‌ (2001)లో తొలిసారిగా నటించాడు. తన కుమారుడు నటించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు మోహన్‌ లాల్‌ అభ్యంతరం చెప్పలేదు. మోహన్‌ లాల్‌ తనను తాను ఆహార ప్రియుడిగా చెప్పుకుంటాడు. అతను శ్రావ్యమైన సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తాడు.

రంగస్థల నటుడుగా
మోహన్‌ లాల్‌ అనేక నాటకాల్లో నటించాడు. 2001లో కవలం నారాయణ పనికర్‌ దర్శకత్వం వహించిన సంస్కత భాషా నాటకం ‘కర్ణభారం’లో కర్ణ పాత్రను పోషించి ప్రొఫెషనల్‌ డ్రామాలో అడుగుపెట్టాడు. ఇది నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా జాతీయ థియేటర్‌ ఫెస్టివల్‌లో భాగంగా 29 మార్చి 2001న న్యూఢిల్లీ లోని సిరి ఫోర్ట్‌ ఆడిటోరియంలో ప్రదర్శించబడింది. 2003లో టికె రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ‘కథాయాట్టం’ అనే నాటకంలో మోహన్‌ లాల్‌ నటించాడు. ‘చాయముఖి’ నాటకంలో పాత్ర పోషించిన మోహన్‌ లాల్‌ శోభన దర్శకత్వం వహించిన ఇంగ్లీష్‌ బ్యాలెట్‌ ‘మాయా రావణ్‌’ లో హనుమంతుడికి గాత్రదానం చేశాడు. మోహన్‌ లాల్‌ 2015 లో గిరీష్‌ కర్నాడ్‌ కన్నడ నాటకం ‘నాగ’లో తన పాత్రను పోషించారు. ఈ నాటకం కలాడి లోని సెయింట్‌ జార్జ్‌ చర్చిలో ప్రదర్శించబడింది.

గాయకుడిగా
సంగీతం అంటే మోహన్‌ లాల్‌కు అమితమైన ప్రేమ. 1985లో తన ‘కండు కండరింజు’ అనే చిత్రంతో గాయకుడిగా పరిచయమైన ఆయన ఆ తర్వాత ఎన్నో పాటలు పాడాడు. సంగీత కారుడు రతీష్‌ వేఘాతో కలిసి ‘లాలిసోమ్‌ – ది లాల్‌ ఎఫెక్ట్‌’ అనే సంగీత బ్యాండ్‌ను స్థాపించాడు. దీని ద్వారా సంగీత ప్రధానంగా సాగే పలు టెలివిజన్‌ షోల్ని నిర్వహించారు.

ఒకే ఏడాదిలో 36 సినిమాలు
మోహన్‌ లాల్‌ 1986 లో ఒకే ఏడాదిలో 36 సినిమాలలో నటించి రికార్డు సృష్టించాడు. ఒక్కొక్క ఏడాదిలో పదుల సంఖ్యలో సినిమాలు చేసి మలయాళ చిత్రరంగాన్ని కళకళలాడించారు. ఆయన ‘పులి మురుగన్‌’ సినిమాతో వంద కోట్ల వసూళ్ల మార్క్‌ని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం ఇదే. ఆ తర్వాత వచ్చిన లూసిఫర్‌ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లని సాధించగా, ‘ఎల్‌ 2 ఈ’ ఏకంగా 265 కోట్లు వసూలు చేసి మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డ్‌ సృష్టించింది.

డా. పొన్నం రవిచంద్ర,
9440077499

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -