Sunday, September 28, 2025
E-PAPER
Homeప్రత్యేకంపిడికెడు గుండె పదిలంగా…

పిడికెడు గుండె పదిలంగా…

- Advertisement -

రాత్రి మిత్రులతో కలిసి కులాసాగా కబుర్లు చెప్పిన కిషోర్‌ ఉదయానికల్లా తనువు చాలించాడనే వార్త మిత్రులను బంధువులను షాక్‌ కు గురిచేస్తుంది ఎలా జరిగింది? అని ఆరా తీస్తే గుండెపోటుతో చనిపోయారు అనే సమాధానం వస్తుంది. ముప్పై అయిదు ఏళ్లు కూడా నిండని రమేష్‌ రోజంతా చక్కగా తన విధులు నిర్వహించి ఇంటికి వెళ్లి భోజనం చేసి టీవీ చూస్తూ కూర్చుని కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే గుండెపోటుతో తనువు చాలించాడని డాక్టర్లు చెప్పేశారు. బస్సులో ప్రయాణం చేస్తూ హఠాత్తుగా కన్నుమూసిన వారు, పెళ్లిళ్లలో అందరితో సరదాగా గడుపుతూ కుప్పకూలిపోయిన వాళ్లు, ఆఫీసులో పని చేస్తూనే టేబుల్‌పై తలవాల్చి ఒరిగిపోయిన వాళ్లు ఇలా అనేకమందిని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అబ్దుల్‌ కలాం లాంటి వారే సమావేశంలో మాట్లాడుతూ ఒరిగిపోయారు. ఇలా అనేక, అకస్మాత్తు, అసహజ మరణాలను చూసి బాధపడుతుంటాం. అప్పటిదాకా కులాసాగా ఉన్న వ్యక్తి క్షణాల్లో కుప్పకూలిపోయి మరణించడం ఏమిటి?

గుండెపోటు మనిషిని నిశ్శబ్దంగా కబలించే మనలోని ఒక భూకంపం. అనేక వైద్య విధానాలు రీసెర్చ్‌లకు అంతుపట్టని ఈ పిడికెడు సైజులో ఉండే గుండె కోసం అటు మెడికల్‌ సైన్స్‌ ఇటు ప్రపంచ మానవాళి ఆందోళన పడుతూనే ఉన్నది. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (AHA) నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్స్‌తో కలిసి హార్ట్‌ మరణాలతో పాటుగా హార్ట్‌ స్ట్రోకుల కారణాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూనే ఉన్నది. 2022 గణాంకాల ప్రకారం ఆ ఒక్క సంవత్సరంలోనే 19.8 మిలియన్లుగా గుండెపోటు మరణాలు వున్నాయంటే తీవ్రత ఎంతో మనకు అర్థమవుతున్నది.
గుండెకు వచ్చే జబ్బులకు ముఖ్యంగా CVD (cardiovascular disease) ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా జరిగే గుండె సంబంధ మరణాలలో మూడింట ఒక వంతు భారతదేశంలో జరుగుతున్నవి. గుండెపోటుకు రోగులకు కారణం ఈ CVD లే అనేది నిజం. కార్డియోవాస్కులర్‌ వ్యాధులు (CVDలు) గుండె, రక్త నాళాలకు సంబంధించిన రుగ్మతల సమూహం. వీటిలో కరోనరీ హార్ట్‌ డిసీజ్‌, సెరెబ్రోవాస్కులర్‌ డిసీజ్‌, పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌, రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌, కంజెనిటల్‌ హార్ట్‌ డిసీజ్‌, డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌ పల్మనరీ ఎంబాలిజం ఉన్నాయి. 2016లో 17.9 మిలియన్ల మంది CVD ల వల్ల మరణించారని అంచనా, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం మరణాలలో 31%. ఈ మరణాలలో 85% గుండెపోటు, స్ట్రోక్‌ కారణంగా సంభవించాయి.

75% కంటే ఎక్కువ CVD మరణాలు తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో సంభవిస్తాయి. ఇక్కడ రక్తపోటు పెరగడం CVDలకు అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకాలలో ఒకటి. 2016లో భారతదేశంలో మొత్తం మరణాలలో 63% NCDల కారణంగా సంభవించాయని నివేదించబడింది. వీటిలో 27% CVDల వల్ల సంభవించాయి. 40-69 సంవత్సరాల వయస్సు గల వారిలో 45% CVDలు కూడా ఉన్నాయి. CVD ప్రమాదం ఉన్న వ్యక్తులలో రక్తపోటు, గ్లూకోజ్‌, లిపిడ్లు పెరగడంతో పాటు అధిక బరువు, ఊబకాయం కూడా ఉండవచ్చు. CVD ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిని గుర్తించడం, వారికి తగిన చికిత్స అందేలా చూసుకోవడం వల్ల అకాల మరణాలను నివారించవచ్చు. అవసరమైన వారికి చికిత్స, కౌన్సెలింగ్‌ లభించేలా చూసుకోవడానికి అన్ని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో అవసరమైన NCD మందులు ప్రాథమిక ఆరోగ్య సాంకేతికతలను పొందడం చాలా అవసరం.

కరోనరీ హార్ట్‌ డిసీస్‌ గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. CVD ఒక రకమైన గుండె జబ్బు. ధమనులు హృదయానికి ఆక్సిజన్‌ తగినంతగా అందించదు. కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వల్ల గుండె కండరాలకు రక్తం సమద్ధంగా సరఫరా కాక పోవడం వల్ల గుండె సోలిపోతుంది. దీనిని కొన్నిసార్లు కరోనరీ ఆర్టరీ వ్యాధి లేదా ఇస్కీమిక్‌ గుండె జబ్బు అని కూడా పిలుస్తారు. గుండె రక్తనాళాలలో ఇబ్బందులు రావడానికి వాటిపై అధిక ఒత్తిడికి కారణమయ్యే వాటిలో మొదటిది అధిక రక్తపోటు. మిగతా కారణాలు సెరిబ్రో వాస్కులర్‌ వ్యాధుల (cerebro vascular disease) వల్ల, రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ లాంటి కీళ్ల నొప్పుల సంబంధం ఉన్న గుండె జబ్బులు, ధమనుల్లో ఏర్పడే అడ్డంకులు అంటే డీప్‌ వెయిన్‌ త్రోంబోసిస్‌ (deep
vein thrombosis) పల్మనరీ ఎంబోలిజం (pulmonary embolism) సిరల్లో రక్తం గడ్డకట్టి గుండెకు చేరడం లాంటివి.

గుండెకు సంభవించే కొన్ని జబ్బులు
కరోనరీ హార్ట్‌ డిసీజ్‌ – గుండె కండరానికి రక్త సరఫరా చేసే రక్త నాళాల వ్యాధి.
సెరెబ్రోవాస్కులర్‌ వ్యాధి – మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల వ్యాధి.
పరిధీయ ధమని వ్యాధి – చేతులు, కాళ్ళకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల వ్యాధి.
రుమాటిక్‌ గుండె జబ్బులు – స్ట్రెప్టోకోకల్‌ బ్యాక్టీరియా వల్ల కలిగే రుమాటిక్‌ జ్వరం వల్ల గుండె కండరాలు, గుండె కవాటాలకు నష్టం.
పుట్టుకతోనే గుండె జబ్బులు – పుట్టుకతోనే గుండె నిర్మాణంలో లోపాలు ఏర్పడటం వల్ల గుండె సాధారణ అభివద్ధి, పనితీరును ప్రభావితం చేసే పుట్టుకతో వచ్చే లోపాలు.
డీప్‌ వెయిన్‌ థ్రాంబోసిస్‌, పల్మనరీ ఎంబాలిజం – కాళ్ళ సిరల్లో రక్తం గడ్డకట్టడం, ఇది తొలగిపోయి గుండె, ఊపిరితిత్తులకు చేరుతుంది.
గుండెపోటులు, స్ట్రోకులు సాధారణంగా తీవ్రమైన సంఘటనలు, ప్రధానంగా గుండె లేదా మెదడుకు రక్తం ప్రవహించకుండా నిరోధించే అడ్డంకి వల్ల సంభవిస్తాయి. దీనికి అత్యంత సాధారణ కారణం గుండె లేదా మెదడుకు సరఫరా చేసే రక్త నాళాల లోపలి గోడలపై కొవ్వు నిల్వలు పేరుకుపోవడం. మెదడులోని రక్తనాళం నుండి రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టడం వల్ల స్ట్రోకులు సంభవించవచ్చు.

గుండెపోటును ఎలా పసికట్టాలి?
నిజానికి గుండె ఇప్పటివరకు వైద్యశాస్త్రానికి పూర్తిగా అందని ఒక మిస్టరీ. చాలా సందర్భాలలో కొన్ని రకాల లక్షణాలతో రాబోయే గుండెపోటును పసిగట్టవచ్చు. కానీ మరికొన్ని సందర్భాలలో ఎటువంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు నిశ్శబ్దంగా కబళించవచ్చు. సాధారణంగా గుర్తించడానికి వీలున్న లక్షణాలలో…
చాతి మధ్యలో నొప్పి రావడం.
అసౌకర్యంగా అస్తిమితంగా అనిపించడం.
గ్యాస్‌ పట్టేసినట్టుగా ఛాతి బరువుగా అనిపించడం.
ఎడమ భుజం, మోచేయి, దవడ, వీపులోకి నొప్పి పాకడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడం.
వికారంగా ఉండడం, వాంతులు అవడం.
తల తిరగడం, చెమటలు పోయడం.
ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా వెంటనే వైద్య సహాయం పొందడం ముఖ్యం.

రుమాటిక్‌ గుండె జబ్బులు
రూమాటిక్‌ గుండె జబ్బులు చిన్న వయసులోనే మొదలయ్యి కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులతో మొదలయ్యి గుండెకు చేరుతుంది. దీనితో గుండె కండరాలు దెబ్బతిని మరణాలకు దారితీస్తుంది. ఈ జబ్బులో స్ట్రెప్టోకోకల్‌ బ్యాక్టీరియా ముఖ్యపాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న గుండె జబ్బులలో రెండు శాతం ఈ మరణాల సంఖ్య నమోదు అవుతున్నది. రుమాటిక్‌ గుండె జబ్బులు తీవ్రమైనప్పుడు కనిపించే లక్షణాలలో అలసట, శ్వాస ఆడక పోవడం, గతి తప్పిన హదయ స్పందనలు, చాతిలో బరువుగా అనిపించడం, నొప్పి రావడం, మూర్చ పోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి.

గుండెపోటులకు కారణాలు ఏమిటి?
గుండెపోట్లు రావడానికి చాలా రకాల కారణాలే ఉన్నాయి. అందులో కొన్ని కారణాలను తీవ్రంగా పరిగణించారు. మొత్తం 18 దేశాలలో జరిగిన వివిధ అధ్యయనాల ప్రకారంగా గుండెపోటులను నివారించే ప్రాథమిక నివారణలో భాగంగా అధిక రక్తపోటును నివారించడం ముఖ్య విషయంగా తేలింది. కాబట్టి రక్తపోటును నివారించడం వల్ల గుండె జబ్బులను చాలావరకు ఎదుర్కోవచ్చనే నిర్ణయానికి వచ్చారు. అధిక రక్తపోటు, హైపర్‌టెన్షన్‌ అని కూడా పిలుస్తారు. ఇది లక్షణాలు కనిపించడానికి ముందే సంవత్సరాల తరబడి శరీరాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. చికిత్స లేకుండా, అధిక రక్తపోటు ప్రాణాంతక గుండెపోటుకు దారితీస్తుంది. సాధారణంగా, రక్తపోటు 130/80 mm Hg లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నివారించడం ముఖ్యమైన పని. అధిక రక్తపోటు అనేక గుండె జబ్బులకు కారణమవుతుంది, వాటిలో: కరోనరీ ఆర్టరీ వ్యాధి. అధిక రక్తపోటు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ఇరుకుగా చేసి దెబ్బతీస్తుంది. ఈ నష్టాన్ని కరోనరీ ఆర్టరీ వ్యాధి అంటారు. గుండెకు చాలా తక్కువ రక్త ప్రవాహం వల్ల ఛాతీ నొప్పికి దారితీస్తుంది, దీనిని ఆంజినా అని పిలుస్తారు.

ఇది అరిథ్మియాస్‌ అని పిలువబడే క్రమరహిత గుండె లయలకు దారితీస్తుంది. లేదా గుండెపోటుకు దారితీస్తుంది. గుండె ఆగిపోవడం. అధిక రక్తపోటు గుండెను ఒత్తిడికి గురి చేస్తుంది. కాలక్రమేణా దీని వలన గుండె కండరాలు బలహీనపడతాయి లేదా బిగుసుకుపోతాయి. అవి చేయాల్సినంత బాగా పనిచేయవు. అధిక భారం ఉన్న గుండె నెమ్మదిగా పనిచేసి ప్రమాదానికి దారి తీస్తుంది. ఎడమ గుండె విస్తరించడం. అధిక రక్తపోటు శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్‌ చేయడానికి గుండెకు మరింత కష్టపడి పనిచేయవలసి వస్తుంది. దీనివల్ల ఎడమ జఠరిక అని పిలువబడే దిగువ ఎడమ గుండె గది చిక్కగా, పెద్దదిగా మారుతుంది. మందంగా, పెద్దదిగా ఉన్న ఎడమ జఠరిక గుండెపోటు, గుండె వైఫల్య ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, దీనిని సడన్‌ కార్డియాక్‌ డెత్‌ అని పిలుస్తారు.

వ్యాధులకు కారకాలు
గుండె జబ్బులు, స్ట్రోక్‌కు అత్యంత ముఖ్యమైన, ప్రమాద కారకాలలో అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, పొగాకు వినియోగం, అతిగా మద్యం వినియోగం.
పర్యావరణ ప్రమాద కారకాలలో వాయు కాలుష్యం ఒక ముఖ్యమైన అంశం. ప్రవర్తనా వ్యక్తులలో పెరిగిన రక్తపోటు, పెరిగిన రక్తంలో గ్లూకోజ్‌, అంటే షుగర్‌ జబ్బు, పెరిగిన రక్త లిపిడ్‌లు అంటే అధిక కొలెస్ట్రాల్‌, అధిక బరువు, ఊబకాయం వంటివి. ఇవన్నీ కూడా గుండెపోటు, స్ట్రోక్‌, గుండె వైఫల్యం, ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.

మరి ఏమి చేయాలి?
పొగాకు వాడకాన్ని మానేయడం, ఆహారంలో ఉప్పును తగ్గించడం, ఎక్కువ పండ్లు, కూరగాయలు తినడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, మద్యం వాడకాన్ని నివారించడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యకర వాతావరణం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన అలవాట్లు కొనసాగించడానికి ప్రజలను ప్రేరేపించడం చాలా అవసరం. గుండె జబ్బుల్లో కలుషిత పర్యావరణ ప్రభావం చాలా అధికంగానే ఉన్నట్టుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. అలాగే కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌లకు కారణమయ్యే వాటిలో ఇతరత్రా కారణాలతో పాటుగా సామాజిక, సాంస్కతిక, ఆర్థిక కారణాలు కూడా అంతర్లీనంగా తమ పాత్రను పోషిస్తున్నాయి. పేదరికం, మానసిక ఒత్తిడితో పాటుగా వంశపార్యత కూడా గుండె జబ్బులు ఒక కారణంగా చెప్పవచ్చు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కూడా ఇందులో ఉన్నాయి. గుండె జబ్బులకు తప్పనిసరిగా వాడవలసిన ఇంగ్లీష్‌ మందులలో ఆస్ప్రిన్‌, బీటా బ్లాకర్స్‌, క్యాల్షియం ఛానల్‌ బ్లాకర్స్‌ యాంజియోటెన్సిస్‌ కన్వరింగ్‌ ఎంజైమ్‌ ఇన్‌హిబిటర్లు, మూత్ర విసర్జన మందులు, రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం పెరగకుండా ఉండే స్టాటిన్స్‌ మొదలైనవి వున్నాయి.
ఆపరేషన్ల విషయానికి వస్తే కరోనరీ ఆర్టరీ బైపాస్‌, బెలూన్‌ యాంజియో ప్లాస్టి, వాల్‌ మరమ్మత్తు లేదా వాలు వేయడం, కొన్ని సందర్భాలలో గుండె మార్పిడి లాంటివి.

గుండె జబ్బులో ఆయుర్వేద చికిత్సలు
ఆయుర్వేద విధానంలో గుండె జబ్బులను వాత, పిత్త, కఫ దోషాలతో చూస్తారు కాబట్టి ఈ దోషాల సమతుల్యను సాధించడానికి అనుగుణంగా రోగి జీవనశైలిని, ఆహారపు అలవాట్లను సవరించడానికి ప్రయత్నం చేస్తారు. గుండె చికిత్సలో ఉపయోగించే ముఖ్యమైన ఆయుర్వేద ఔషధాలలో ‘అర్జున’ది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు. రక్తపోటును నివారించేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. జీర్ణక్రియ సరిచేసి మెటబాలిజం సిస్టం సవరించడానికి త్రిఫల వాడుతారు. రక్తాన్ని చిక్కబడనివ్వకుండా పలుచ బరచి గుండెకు రక్తప్రసరణ సరిగా జరగడానికి వీలుగా వెల్లుల్లిని వాడుతారు. కొలెస్ట్రాల్‌ను కూడా కరిగించే గుణం దీనికి ఉండడం వలన గుండెకు దీన్ని మంచి మిత్రునిలా భావిస్తారు. ఇంకా ఆమ్ల, అశ్వగంధ, మందార, దాల్చిన చెక్క లాంటి మూలికలతో పాటుగా భుజంగాసన, ప్రాణాయామం, అనులోమ విలోమా లాంటి యోగ సూత్రాలు గుండె శ్వాస ఆరోగ్యానికి సూచిస్తారు. ఇంకా హోమియోపతి, ఎలక్ట్రో హోమియోపతి, యునాని, సిద్ధ, లాంటి అనేక వైద్య విధానాలు గుండె సంబంధ వ్యాధులకు రకరకాల మందులను సూచిస్తున్నాయి. జీవనశైలిని మార్చుకోవడంతోపాటుగా ఆయా వైద్య విధానాల్లోని మందులను వైద్యుల సలహా మేరకు వాడి గుండె జబ్బులను తగ్గించుకునే అవకాశం ఉన్నది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి?
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ధూమపానం మానేయాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం వంటివి కూడా గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీ ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, తణధాన్యాలు చేర్చుకోండి. బీన్స్‌, చేపలు, పౌల్ట్రీ, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి వాటిని తీసుకోండి. సంతప్త కొవ్వులు (చీజ్‌, వేయించిన ఆహారాలు), ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ (ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, బేక్డ్‌ వస్తువులు) తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్‌ చేసిన ఆహారాలను తగ్గించండి.

జీవనశైలి మార్పులు:
వారానికి కనీసం 150 నిమిషాలు (ఉదాహరణకు, రోజుకు 30 నిమిషాలు, వారానికి 5 రోజులు) మధ్యస్తమైన ఏరోబిక్‌ వ్యాయామం చేయండి. ధూమపానం మానేయడం గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. అధిక బరువును నివారించి, ఆరోగ్యకరమైనఠ బరువును నిర్వహించండి. మద్యం సేవించడాన్ని పరిమితం చేయండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి పద్ధతులను పాటించండి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి.

డా. చెమన్‌, 9440385563

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -