సినిమా అంటే వినోదం అని సినీ రంగం వినోదం అందించే పరిశ్రమ అని అందరం ఏకగ్రీవంగా ఒప్పుకుంటాం. అయితే సినీరంగం దేశానికి సంబంధించిన ఓ అంతర్జాతీయ ఆపరేషన్‌లో భాగం పంచుకోవడం గురించి ఎవరన్నా చెప్పినా నమ్మాలనిపించదు. కాని ఇది అమెరికాలో జరిగిన వాస్తవం. చాలా కాలం రహస్యంగా ఉంచిన ఈ వాస్తవాన్ని బైట పెట్టిన సినిమా 2012లో వచ్చిన ‘ఆర్గో’. అమెరికన్ సి.ఐ.ఏ., కెనెడియన్ ప్రభుత్వం, హాలీవుడ్ చిత్ర నిర్మాణం మాటున సాగించిన ఆపరేషన్ ‘ఆర్గో’. సినిమా వివరాలలోకి వెళ్లబోయే ముంది ఆ ఆపరేషన్ గురించి ప్రాధమిక సమాచారం తెలుసుకుందాం.
1979 లో ఇస్లామిక్ ఇరానియన్ విప్లవం జరిగినప్పుడు, అమెరికా మద్దతు పొందిన ఇరాన్ షా, మొహమ్మద్ రెజా పహ్లవి ఆ దేశం విడిచి పారిపోయాడు. ఈ గందరగోళం మధ్య, ఇమామ్స్ లైన్ ముస్లిం స్టూడెంట్ ఫాలోవర్స్ అని పిలువబడే యువ ఇస్లామిస్టుల గుంపు నవంబర్ 4, 1979న టెహ్రాన్‌లోని యుఎస్ ఎంబసీపై దాడి చేసి, డజన్ల కొద్దీ దౌత్యవేత్తలను బంధించి, వారిని బంధీలుగా ఉంచింది. విచారణ కోసం షా ను ఇరాన్‌కు రప్పించాలని వారంతా డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తాత్కాలిక ప్రభుత్వం పడిపోయింది. ప్రధాన మంత్రి మెహదీ బజార్గన్, అతని మంత్రివర్గం రాజీనామా చేశారు.
అమెరికన్ ఎంబసీలో అపుడు రాబర్ట్ ఆండర్స్, కోరా అంబర్న్-లిజెక్, మార్క్ లిజెక్, జోసెఫ్ స్టాఫోర్డ్, కాథ్లీన్ స్టాఫోర్డ్, లీ స్కాట్జ్ అనే ఆరుగురు అమెరికన్ దౌత్యవేత్తలు అక్కడి కాన్సులేట్‌లో పనిచేస్తున్నారు. రాజకీయ సంక్షోభం నడుమ ఇరానియన్లు ఎంబసి గోడ దాటి వచ్చినప్పుడు వీళ్లు మరో దారిలో తప్పించుకున్నారు. కెనెడియన్ ఎంబసి అధికారులు వీరికి రక్షణ ఇచ్చారు. 444 రోజుల తరువాత కాని సి.ఐఎ. అధికారులు, అక్కడ చిక్కుకుపోయిన అమెరికన్లందరినీ విడిపించలేక పోయారు. దానికి ముందు ఈ ఆరుగురు దౌత్యవేత్తలను కెనెడా ప్రభుత్వ సహాయంతో ఇరాన్ నుండి తప్పించగలిగారు. ఓ సినిమాకు పని చేసే సాంకేతిక వర్గంగా వీరికి పాస్ పోర్టులు సష్టించి ఇరాన్ నుండి సురక్షితంగా అమెరికాకు తీసుకు వచ్చారు సి.ఐ.ఏ. అధికారులు. ఈ ఆపరేషన్‌ను కెనెడియన్ కేపర్ అని అమెరికా రాజకీయ చరిత్రలో ప్రస్తావిస్తారు. ఈ మిషన్ నేపధ్యంలో వచ్చిన అమెరికన్ చారిత్రక రాజకీయ గూఢచర్య డ్రామా థ్రిల్లర్ చిత్రం ‘ఆర్గో’. దీన్ని నిర్మించి దర్శకత్వం వహించింది బెన్ అఫ్లిక్. క్రిస్ టెర్రియో రాసిన ఈ స్క్రీన్‌ప్లే, 1999లో U.S. C.I.A. ఆపరేటివ్ టోనీ మెండెజ్ రాసిన ‘ది మాస్టర్ ఆఫ్ డిస్‌గైస్’ అనే పుస్తకం, 2007లో జాషువా బేర్‌మాన్ రాయగా నికోలస్ థాంప్సన్ సంపాదకీయం చేసిన ”ది గ్రేట్ ఎస్కేప్: హౌ ది CIA యూజ్డ్ ఎ ఫేక్ సైన్స్ ఫిక్షన్ ఫ్లిక్ టు రెస్క్యూ అమెరికన్స్ ఫ్రమ్ టెహ్రాన్” అనే 2007 వ్యాసం నుండి తీసుకున్నారు. ఈ వ్యాసం వైర్డ్ అనే పత్రికలో వచ్చింది.
ఈ చిత్రం 85వ అకాడమీ అవార్డులలో ఏడు నామినేషన్లను అందుకుని ఉత్తమ చిత్రం, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాలలో మూడు అవార్డులను గెలుచుకుంది. ఆర్ధకంగానూ ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ఐదు గోల్డెన్ గ్లోబ్ అవార్డు నామినేషన్లను పొందింది. 19వ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులలో గెలుపొందడమే కాకుండా 66వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే కోసం లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా 37వ హోచి ఫిల్మ్ అవార్డులను కూడా గెలుచుకుంది.
సినీ కథకు వస్తే, అమెరికా విదేశాంగ శాఖ ఇరాన్‌లో ఇరుక్కుపోయిన తమ దౌత్యవేత్తలను బయటకు రప్పించడానికి మార్గాలను వెతుకుతూ ఉంటుంది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిపుణుడు టోనీ మెండెజ్‌ను ఈ శాఖ అధికారులు సంప్రదిస్తారు. ‘బాటిల్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమా స్ఫూర్తితో అతను ఓ ఆలోచన చేస్తాడు. ఇరాన్‌లో సైన్స్-ఫిక్షన్ చిత్రం కోసం అన్యదేశ ప్రదేశాలను వెతుకుతున్న కెనడియన్ చిత్రనిర్మాతగా నటిస్తూ మెండెజ్ ఇరాన్‌లోకి ప్రవేశించాలని నిర్ణయం జరుగుతుంది. CIA కోసం పనిచేసిన హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జాన్ చాంబర్స్ సలహా ప్రకారం, మెండెజ్ చలనచిత్ర నిర్మాత లెస్టర్ సీగెల్‌తో కలిసి ఒక నకిలీ చిత్ర నిర్మాణ సంస్థను సష్టిస్తాడు. ఈ మిషన్ విశ్వసనీయత కోసం స్టార్ వార్స్ శైలిలో సైన్స్ ఫాంటసీ అడ్వెంచర్‌గా ‘ఆర్గో’ అనే సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తారు. మెండెజ్ ‘ఆర్గో’ సినిమా నిర్మాతగా ప్రకటించుకుని కెవిన్ హార్కిన్స్ అనే మారుపేరుతో ఇరాన్‌లోకి ప్రవేశిస్తాడు.
విప్లవకారులు ఎంబసీ టేకోవర్‌కు ముందు ముక్కలు చేసిన రాయబార కార్యాలయ ఛాయాచిత్రాలను మెండెజ్ పరిశీలిస్తాడు. చిక్కుకుపోయిన కొంతమంది సిబ్బంది ప్రభుత్వ లెక్కలోకి రాలేదని గ్రహిస్తాడు. కెనెడియన్ ఎంబసి అధికారుల ఇళ్లలో దాక్కున్న ఆరుగురు దౌత్యవేత్తలను ప్రత్యేకంగా కలుస్తాడు. రాజకీయ అశాంతితో వారంతా భయభ్రాంతులకు గురయి ఉంటారు. మెండెజ్ సూచన వారికి చిన్నపిల్లల ఆటగా అనిపిస్తుంది. మెండిజ్ చెప్పినట్లు చిత్ర యూనిట్‌గా నగరంలోకి వెళ్ళడానికి వారెవ్వరూ ముందు అంగీకరించరు. వారికి కెనడియన్ పాస్‌పోర్ట్‌లు, నకిలీ గుర్తింపుకార్డులను అందిస్తాడు మెండెజ్. తమను రక్షించడానికి మెండెజ్ తన ప్రాణాలను పణంగా పెడుతున్నాడని గ్రహించి చివరికి అతనికి సహకరించడానికి అంతా ఒప్పుకుంటారు. కవర్ స్టోరీ కోసం ఇరాన్ వీధులలోకి వెళ్లిన ఈ బృందం ప్రమాదంలో పడుతుంది.. కాని చాకచక్యంతో చివరి నిముషంలో అంతా తప్పించుకుంటారు.
అయితే కొన్ని పరిస్థితులలో ఈ ఆపరేషన్ రద్దు చేశారని, ఆ ఆరుగురు దౌత్యవేత్తల విషయం మరిచిపొమ్మని మెండెజ్‌కు సి.ఐ.ఏ అధికారుల నుండి కబురు అందుతుంది. కాని తమపై నమ్మకంతో ఉన్న ఆ ఆరుగురిని అలా మధ్యలో వదిలేయడానికి అతను ఒప్పుకోడు. తాను ఎలగన్నా వారిని తప్పిస్తానని మొండి పట్టుదలతో ఆపరేషన్ కొనసాగిస్తాడు. తన బాస్ డిప్యూటీ డైరెక్టర్ జాక్ ఓ డొన్నెల్‌ను ఈ మిషన్ కోనసాగింపు కోసం పై అధికారుల నుండి త్వరగా అనుమతి పొందమని, స్విస్ ఎయిర్ విమానంలో రద్దు చేసిన టిక్కెట్లను తిరిగి బుక్ చేయమని మెండెజ్ ఒత్తిడి తెస్తాడు. ఇక్కడ ఉత్కంఠంగా సాగుతుంది సినిమా. నకిలీ హాలీవుడ్ నిర్మాణ సంస్థకు ఇరాన్ ఏర్‌పోర్టులో హెడ్ గార్డ్ చేసిన కాల్‌కు చివరి క్షణంలో అటు వైపు నుండి సమాధానం దొరకడంతో వీరంతా విమానంలోకి ఎక్కగలుగుతారు. విమానంలోకి సిబ్బంది ఎక్కగానే ఏర్‌పోర్టులో అధికారులకు ఈ ఆపరేషన్ గురించి తెలుస్తుంది. కాని అప్పటికే విమానం టేకాఫ్ అయిపోవడంతో ఏమీ చేయలేకపోతారు. దౌత్యవేత్తలందరూ సురక్షితంగా బైటపడతారు.
అయితే ఈ ఆపరేషన్ విజయానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ కెనడియన్ ప్రభుత్వానికి ఇస్తుంది సీ. ఐ. ఏ. టేలర్ రాయబార కార్యాలయాన్ని మూసేసి, తన భార్యతో ఇరాన్ దేశాన్ని వదిలేస్తాడు. వారి ఇంట్లో పని చేసే ఇరానియన్ హౌస్‌కీపర్ అధికారులకు దొరకకుండా ఇరాక్‌కు పారిపోతాడు. ఆ ఆరుగురు దౌత్యవేత్తల గురించి మొదటి నుండి చివరి దాకా మొత్తం తెలిసింది వీరికే. మెండెజ్‌కు ప్రభుత్వం రహస్యంగా ఇంటెలిజెన్స్ స్టార్ అవార్డు ఇస్తుంది. అతను వర్జీనియాలోని తన భార్య, కొడుకు దగ్గరకు చేరుకుంటాడు. 444 రోజుల నిర్బంధం తర్వాత మిగిలిన అమెరికన్ బందీలంతా విడుదల అవుతారు. ఈ ఆపరేషన్‌లో చివరి దాకా మెండెజ్‌కు తోడు ఉన్న చాంబర్స్‌కు ఇంటెలిజెన్స్ మెడల్ ఆఫ్ మెరిట్ లభిస్తుంది. మెండెజ్ మరణించే వరకు అతనితో స్నేహంగా ఉన్నాడు చాంబర్స్. 1997లో బిల్ క్లింటన్ కెనడియన్ కేపర్‌ను వర్గీకరించిన తర్వాత మెండెజ్‌కు అతని ఇంటెలిజెన్స్ స్టార్ మెడెల్ తిరిగి లభించింది. అప్పటి దాకా ఈ ఆపరేషన్ అమెరికా రికార్డులలోనే రహస్యంగా ఉండిపోయింది. ఈ వివరాలన్నీ సినిమా చివర్లో క్రెడిట్శ్ లో చూపిస్తారు.
‘ఆర్గో’ సినిమా షూటింగ్ కోసం సి.ఐ. ఏ హెడ్ క్వార్టర్స్ లాబీను ఈ సినిమాకు ఒక షాట్‌లో వాడుకున్నారు. అప్పటి దాకా ఎవరికీ సాధ్యపడని ప్రయోగం ఇది. CIA కవర్ స్టోరీని రూపొందించడానికి ఉపయోగించిన స్క్రీన్‌ప్లే రోజర్ జెలాజ్నీ 1967 నవల ‘లార్డ్ ఆఫ్ లైట్’ అనుసరణ. నిర్మాత బారీ గెల్లర్ అసలు టైటిల్‌ను ఉపయోగించి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నించారు. కాని అది విఫలం అయింది. ఆ స్క్రీన్‌ప్లేను ‘అర్గో’ గా పేరు మార్చి CIA ఈ ఆపరేషన్ కు ఉపయోగించుకుంది. అంటే ఈ అంతర్జాతీయ ఆపరేషన్ కోసం ఉపయోగపడిన స్క్రీన్ ప్లే నిజంగా హాలీవుడ్‌లో చిత్ర నిర్మాణం కోసం తయారు చేసిందే.
టోనీ మెండెజ్ CIA ప్రణాళికలో భాగంగా సష్టించిన నకిలీ హాలీవుడ్ నిర్మాణ కార్యాలయం ‘స్టూడియో సిక్స్’ ఎంత నమ్మకాన్ని సంపాదించుకుందంటే, ఆపరేషన్ పూర్తయి, కార్యాలయం మూసివేసిన కొన్ని వారాల తర్వాత కూడా, 26 స్క్రిప్ట్‌లు సినిమా నిర్మాణం కోసం పరిశీలనకు ఆ చిరునామాకు అందాయి. అందులో ఒకటి ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ నుండి వచ్చింది. అది సి.ఐ.ఏ. నిర్మించిన కార్యాలయం అని, హాలీవుడ్ సి. ఐ. ఏ. ఆపరేషన్‌లో తెలియకుండానే పాలు పంచుకుందని చాలా మంది సినీ మేధావులకు ఈ సినిమా వచ్చే దాకా తెలియదు. సినిమా గొప్పతనం మొత్తం కూడా కథ నడిపించిన విధానం, పటిష్టమైన స్క్రీన్ ప్లేలో ఉంది. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు హత్యలు, దోపిడులు, తుపాకి యుద్దాల నడుమ సాగుతాయి. కాని ఈ సినిమా దానికి విరుద్దం. ఆ ఆరుగురు అసలు ఆ దేశం దాటగలరా అనే ఉత్కంఠతతో ప్రేక్షకులు అన్నీ మర్చిపోయి సినిమాలో లీనమయిపోతారు. చివరి సీన్ దాకా ఆ ఉత్కంఠతను అదే రీతిలో నిలిపి ఉంచడం బెన్ అఫ్లిక్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. ఒక్క నిముషం కూడా ప్రేక్షకులు మరో ఆలోచనలోకి వెళ్లలేనంతగా బంధింపబడి ఉండిపోతారు.
ఏప్రిల్ 2016లో, సమాచార స్వేచ్ఛా చట్టం కింద అందుకున్న పత్రాల ఆధారంగా వైస్ చేసిన పరిశోధన, CIAకి సంబంధించిన ప్రజా సంబంధాల విభాగం ‘ఆర్గో’ సినీ నిర్మాణంలో పాలుపంచుకుందని వెల్లడించింది. అంటే ఈ చిత్ర నిర్మాణ విషయంలో కొన్ని అంశాలకు సి. ఐ. ఏ సహకారం ఉంది. అయినా కొన్ని సందర్భాలలో ఇది వాస్తవానికి దూరంగా జరిగిందని విమర్శించిన వాళ్లూ ఉన్నారు. దానికి బెన్ అఫ్లిక్ సినిమాగా కథను మార్చే సందర్భంలో కొంత కళాత్మక స్వేచ్ఛ తీసుకున్న మాట వాస్తవం కాని జరిగిన వత్తాంతాలను ఎక్కడా మార్చలేదని చెప్పుకొచ్చారు. కెనెడా అమెరికా సంబంధాలు, ఆ దౌత్యవేత్తలను అమెరికా తీసుకురావడానికి కెనడా అధికారులు, ప్రభుత్వం చూపిన చొరవలో ఎక్కడా సినీ దర్శకుడిగా తాను జోక్యం చేసుకోలేదని, ఆ దేశం అందించిన స్నేహాన్ని ఇచ్చిన సహకారాన్ని గౌరవంగా తెరకెక్కించగలిగామని చెప్పారు. ఇరాన్‌లో మాత్రం ఈ చిత్రంపై ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి బెన్‌కు దర్శకత్వ విభాగంలో అకాడమి అవార్డు లభించకపోవడం ఆయనకు జరిగిన అన్యాయం అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
సినిమాలో చూపినట్లు బ్రిటీష్ న్యూజిలాండ్ ఎంబసీలు, అమెరికన్ ఎంబసిలో చిక్కుకున్న దౌత్యవేత్తల సహాయానికి రాలేదన్నది వాస్తవం కాదని, ముందు బ్రిటీష్ ఎంబసీ వారికి రక్షణ కల్పించిందని, కాని అది సురక్షితమైన చోటు కానందున కెనడా ఎంబసికి వీరి బాధ్యత అప్పగించబడిందని వాళ్లు ప్రకటించారు. న్యూజిలాండ్ అధికారులు కెనడా వర్గాల రక్షణ స్థావరంలో ప్రమాద సూచనలు కనిపిస్తే అమెరికన్ దౌత్యవేత్తలను ఉంచడానికి మరో చోటుతో తాము సిద్దంగా ఉన్నామని, ఆ తరువాత ఏర్‌పోర్ట్ వరకు అమెరికన్ దౌత్యవేత్తలతో వెళ్లింది తామే అని ఆ తరువాత మిగతా అమెరికన్లను విడిపించడంలో తాము ప్రముఖ పాత్ర పోషించామని ప్రకటించారు. సినిమాకు ఉత్కంఠతను జోడించడానికి ఆకరి సీన్లో చూపిన టెన్షన్ సినిమా కోసం దర్శకులు తీసుకున్న స్వేచ్ఛ కాని ఏర్ పోర్ట్ లో వారికి ఎటువంటి ప్రమాదమూ ఎదురవలేదని తరువాత ప్రకటించారు. ఏమైనా ‘ఆర్గో’ ఎక్కువ వాస్తవాలు, తక్కువ కల్పనతో సాగే రాజకీయ థ్రిల్లర్. టోనీ మెండెజ్ పాత్రలో బెన్ అఫ్లిక్ నటన చాలా బావుంటుంది. ఈ సినిమాను నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన బెన్ హాలివుడ్ లో మంచి ప్రతిభ ఉన్న నటులు. ఇది వారి నటనా జీవితంలోనూ హాలివుడ్ చరిత్రలోనూ గుర్తుండిపోయే గొప్ప చిత్రం.
పి.జ్యోతి, 98853 84740.