ఏఐఏడబ్ల్యూయూ అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూసేకరణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు పరిహారం చెల్లించాలని ఏఐఏడబ్ల్యూయూ అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర సమావేశాలు అధ్యక్షులు జి నాగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ పేదల అనుభవంలో ఉన్న భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాలనీ, గ్రామసభ ఆమోదం లేకుండా భూముల జోలికొస్తే ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. త్రిబుల్ ఆర్, రైల్వేలైన్, హైవే రోడ్లు, ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న భూసేకరణ ప్రాంతాల్లో సామాజిక సర్వే చేయాలనీ, వ్యవసాయ భూముల ఆధారంగా బతికే వ్యవసాయ కార్మికులు వృత్తిదారులు ఇతర పేదలకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ ఇవ్వాలనీ, పేదల అనుభవంలో ఉన్న అసైన్‌మెంట్ భూములు, బంజరు, ఇనాం, దేవాదాయ, భూదాన, ఫారెస్ట్ భూములకు పట్టా భూములతో సమానంగా మార్కెట్ రేటు కట్టివ్వాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి పేరుతో జరుగుతున్న భూసేకరణలో పోరాడి పేదలు సాధించుకున్న భూములను పాలకులు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల, రియల్ ఎస్టేట్ దారుల భూములను రక్షించడం కోసం ఎలైన్‌మెంట్‌ను ఇష్టం వచ్చిన రీతిలో మారుస్తున్నారని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలనీ, ఇంటికొకరికి ఉద్యోగం కల్పించాలనీ, 18 ఏండ్లు నిండిన వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులకు 20 ఏండ్ల పాటు రూ. రెండు వేల చొప్పున పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక సర్వే ఆధారంగా గుర్తించిన చెట్లు, బావులు, బోరు మోటర్లు, డబ్బి కొట్లు, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, ఆవులు, ఎడ్లు వంటి వాటికి కూడా మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వ భూములు మాత్రమే మొదటి ప్రాధాన్యతగా సేకరించాలని చట్టంలో ఉ ందన్నారు. అవసరమయితే తప్ప మొదటి పంట, రెండు పంటలు పండే భూములు జోలికి పోకూడదనీ, భూసేకరణ జరగాలంటే గ్రామసభలో 80 శాతం మంది ప్రజలు ఒప్పుకుంటేనే భూములు సేకరించే అధికారం కలెక్టర్‌కు ఉందని తెలిపారు.
కానీ బ్యాంకులో డబ్బులు వేస్తాం, భూములు బలవంతంగా లాక్కుంటామని అధికారులు కలెక్టర్లు మాట్లాడటం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. పోలీసులను, అధికారులను ఉపయోగించి బలవంతంగా భూసేకరణకు సిద్ధపడితే అధికారులపై కూడా న్యాయపోరాటానికి సిద్ధపడతామని హెచ్చరిం చారు. చట్టప్రకారం పరిహారం కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామనీ, ఈ పోరాటంలో భూములు కోల్పోయే రైతాంగం వ్యవసాయ భూములు ఆధారంగా బతుకుతున్న వ్యవసాయ కార్మికులు వృత్తిదారులు ఐక్యంగా కలిసి పోరాటాలకు రావాలని పిలుపునిచ్చారు. సమా వేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, మచ్చా వెంక టేశ్వర్లు, పెద్ది వెంకట్ రాములు, బి పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివ, ఆవుల వీరన్న, ఎం. నరసింహులు, ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.