గండిపేట్ 12, హిమాయత్ సాగర్ 11 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
నవతెలంగాణ-గండిపేట్
భారీ వర్షాలు కారణంగా జంట జలాశయాలు నిండుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దాంతో గండిపేట్ 12 గేట్లు, హిమాయత్‌సాగర్ 11 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గండిపేట్ గేట్లు ఎత్తడంతో నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు, మంచిరేవుల గ్రామానికి వెళ్లే రహదారిని పూర్తిగా మూసేశారు. వాహనదారులు రావద్దంటూ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బండ్లగూడ కార్పొరేషన్ హైదర్‌షాకోట్ ఐదో వార్డు సాయిరాంనగర్‌లో మూసీ వరద పెద్దఎత్తున వచ్చింది. హనుమాన్ టెంపుల్, సాయిబాబా గుడి పూర్తిగా నీట మునిగాయి. మున్సిపాలిటీ అధికారులు, మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలను అక్కడి నుంచి తరలించారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్లు సూచించారు.