అరెస్టును ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : లడఖ్‌కు రాష్ట్రహోదా కావాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న, ఉద్యమానికి అగ్ర భాగాన ఉండి నడిపిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. నిరంకుశ జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద ఆయనను నిర్బంధించడం వెనుక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరి బహిర్గతమవుతోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది లడఖ్ ప్రజల నిజమైన ఆకాంక్షల పట్ల ధిక్కార ధోరణిని ప్రదర్శించడమేనని పేర్కొన్నది.
లడఖ్ ప్రజలకు చేసిన హామీలను గౌరవించడానికి బదులుగా అక్కడ జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచివేయడానికి కర్కశ చర్యలకు పాల్పడే పంథాను ప్రభుత్వం ఎంచుకుందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
ఇది, లడఖ్ ప్రజల ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛలపై తీవ్రంగా దాడి చేయడమే నని ఆ ప్రకటన పేర్కొన్నది. ఇటువంటి చర్యలతో తాము పరాయివారమనే భావన లడఖ్‌తో పాటూ జమ్మూకాశ్మీర్ ప్రజల్లో పెరుగుతుందని హెచ్చరించింది. తక్షణమే వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ప్రజలపై పెట్టిన అన్ని కేసులనూ బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరింది. అలాగే ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులను పూర్తిగా పరిరక్షించాలని పేర్కొ న్నది. ఈ ఉద్యమం న్యాయమైన డిమాండ్లను వెంటనే ఆమోదించాలనీ, వీటన్నింటికి తోడు ఆరో షెడ్యూల్‌లో లడఖ్‌ను చేర్చాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
సోనమ్ వాంగ్‌చుక్‌ను తక్షణమే విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -