Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆడపడుచుల అస్తిత్వానికి ప్రతీక పూల పండుగ 

ఆడపడుచుల అస్తిత్వానికి ప్రతీక పూల పండుగ 

- Advertisement -

పూలనే దేవతగా కొలిచే కళాత్మకమైన సంప్రదాయం 
నేడు సద్దుల బతుకమ్మ 
సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం 
నవతెలంగాణ – పాలకుర్తి

బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. ప్రాచీన కాలం నుండి అమ్మ దేవతల, ఆరాధనగా బతుకమ్మ నిలిచింది. ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయం. భాద్రపద మాసం మహాలయ అమావాస్య నుంచి మొదలై తొమ్మిది రోజులపాటు జరుపుకుని అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై చివరి రోజు అష్టమి తిథినాడు సద్దుల బతుకమ్మ వరకు నిత్యం ఆడబిడ్డగా పూజించే సంస్కృతి సాంప్రదాయాల ప్రతిబింబమే పూల పండగ. 

పూల పండగ ..

సాధారణంగా దేవుడిని అందరూ పూలతో పూజిస్తారు. కానీ పూలనే దేవతగా కొలిచే కళాత్మకమైన సంప్రదాయం తెలంగాణ ఆడపడుచులది. తంగేడు, గునుగు, కట్ల, రుద్రాక్ష, బంతి, చామంతి, గులాబి, గుమ్మడి లాంటి ఔషధ గుణాలన్నింటినీ తమలో నింపుకున్న పువ్వులు ఆడపడుచుల చేతుల్లో అందమైన ప్రకృతిని సంతరించుకొని బతుకమ్మగా వెలుగొందుతాయి. రంగురంగుల పూలు, అంత్రాలు, అంత్రాలుగా అలంకరించబడి దేవతగా రూపుదిద్దుకుంటాయి. బతుకమ్మ బతుకునిచ్చే గౌరమ్మగా శైవ సాంప్రదాయంలోనూ సిరులను ఇచ్చే శ్రీ లక్ష్మీ గా, వైష్ణవ సాంప్రదాయంలోను కొనసాగుతూ తెలంగాణలోని ప్రతి గడపలో ఆడబిడ్డగా బతుకమ్మను గౌరవిస్తారు. 

బతుకమ్మ పండుగకు ముందు తొమ్మిది రోజులపాటు పుట్ట మట్టితో తయారుచేసిన బొడ్డెమ్మగా ఆరాధిస్తారు. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కాల బిడ్డలేందరు అంటూ సంతానం గురించి పాడుకునే పాటలు, ఆటలు, బతుకమ్మను ఆరాధించడం తెలంగాణ సాంప్రదాయంలో భాగమే. తొమ్మిది రోజులపాటు పెళ్లి కాని ఆడపడుచులంతా బొడ్డెమ్మను ఆడి తొమ్మిదో నాడు బావుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ మరుసటి నాటి నుండే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. 

మేదరి సిబ్బిని తెచ్చి తంగేడు పూల భవంతిని గట్టి, గునుగు పూల మెట్లను పెట్టి మీదింటిలో కొలువైన పసుపు గౌరమ్మను, శ్రీ లక్ష్మీ నీ మహిమలు గౌరమ్మ నిత్యమైతో చిన్నమ్మ గౌరమ్మ అంటూ ముగ్గురమ్మల మూలపుట వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండుకుండలా జలకలలాడి రైతులకు పంటసిరులు అందిస్తాయి. చెరువులలో, కుంటలలో బతుకమ్మను నిమజ్జనం చేసి నీరాజనాలు అర్పిస్తారు. బతుకమ్మను పేర్చే పూలలో ఔషధ గుణాలు ఉండటం వలన చెరువులు, కుంటలు శుద్ధి అవుతాయి. పండుగ సందర్భంలో ఆరోగ్యాన్నిచ్చే రకరకాల పిండి వంటలు కూడా ఈ బతుకమ్మ పండుగకు ప్రత్యేకత. పల్లీలు, నువ్వులు, బెల్లం, బియ్యం వీటితో తయారు చేసే ప్రత్యేక పిండి వంటలు, సత్తు పిండి, తినుబండారాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపుతాయి.

బతుకమ్మ నాడు పాడే పాటలల్లో మానవ జీవితపు ఘట్టాలను జోడిస్తూ ఇద్దరక్క చెల్లెలు కోల్  ఒకోక్కిచ్చే కోల్… ఒక్కడే మాయన్న కాల్, వచ్చన్నపోడు కోల్ అంటూ పుట్టింటి మమకారాన్ని చాటుకుంటే.. పెద్దోడా పెరిమళ్ళ ఉయ్యా లో చెల్లెను తీసుకురా పోరా ఉయ్యాలో… అంటూ ఆడబిడ్డను ఇంటికి తీసుకొచ్చుకోవాలని ఆనవాయితీని బతుకమ్మ పండుగ తెలుపుతుంది. అత్తమామల తోపాటు కుటుంబంలోని వారితో మెలిగే పద్ధతులు, ఆరోగ్యపరమైన విషయాలను జోడించి బతుకమ్మ పాటలు పాడుతారు.

ఒకటో మాసం నెలల గర్భిణీ ఏమి కోరి నాదే చెలియా ఏమి కోరినదే.. అంటూ గర్భం దాల్చిన స్త్రీ మూర్తికి తీర్చాల్సిన కోరికలను తెలియజేస్తూ పాడే పాటలు అన్నీ తెలంగాణ సాంప్రదాయాన్ని పరిచయం చేయడంతో పాటు బాధ్యతలు తెలిపి వ్యవహరించాలని పాటల రూపంలో వివరిస్తారు. త్యాగం, ఆనందం, అందం, ఆరోగ్యం అన్నింటి మిశ్రమమే బతుకమ్మ పండుగ. ముఖ్యంగా ఆడపడుచులు తమ పుట్టింటి వారి నుండి ఇంటికి తప్పనిసరిగా వచ్చే ఈ పండుగ కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలా చూసేవారు ఇప్పటికీ ఉన్నారంటే నమ్మక తప్పదు. బతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ పండుగలు సాంప్రదాయాలు ఇలాగే కొనసాగుతూ మనుషుల మధ్య అనుబంధాలకు లోటు లేకుండా ఉండాలని బతుకమ్మ పండుగ దోహదపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -