Monday, September 29, 2025
E-PAPER
Homeమానవిగర్భిణీల్లో ఆరోగ్య సమస్యలు

గర్భిణీల్లో ఆరోగ్య సమస్యలు

- Advertisement -

స్త్రీలలో గర్భధారణ తొమ్మిది నెలలు కొనసాగే ఒక శారీరిక స్థితి. గర్భిణీకి మాత్రమే కాకుండా, ఆమె కుటుంబానికీ ప్రయాసతో కూడుకొన్నది. అయినప్పటికీ ఎంతో అపురూపమైనది. అటువంటి స్థితిలో గర్భిణీలలో కూడా అందరిలాగే ఏ అనారోగ్యమైనా కలుగవచ్చు. గర్భధారణ పరంగా ఆ స్థితికి మాత్రమే పరిమితమయ్యే కొన్ని రుగ్మతలు ఉన్నాయి. తొమ్మిది నెలల గర్భకాలంలోనే కాకుండా అంతకు మునుపు ఆరోగ్య స్థితి, తల్లి-బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితులను త్వరగా గుర్తించి వైద్యులను సంప్రదించి సకాల చర్యలు చేపడితే తల్లినీ, పుట్టబోయే బిడ్డనీ కాపాడుకోగలుగుతాము.

గర్భధారణ ఆడవారి శరీరంలో ఎన్నెన్నో మార్పులు తీసుకొస్తుంది. ఒక విధంగా ఆమె శరీర వ్యవస్థ మొత్తం మారిపోతుందని చెప్పొచ్చు. రక్త ఘన పరిమాణం పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకొంటుంది. శరీర తాపమానం హెచ్చు స్థాయిలో ఉంటుంది. ఇలా ఆమె శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. మొదటి త్రైమాసికంలో హార్మోన్ల ప్రభావం వలన ఎక్కువ మందిలో ముఖ్యంగా మొదటిసారి గర్భం దాల్చినపుడు కడుపులో వికారం, వాంతి అవబోతున్నట్టు అనిపిస్తుంది. కొందరిలో మొదలౌతాయి కూడా. దీన్ని మార్నింగ్‌ సిక్నెస్‌ అంటారు. వాంతులు ఉదయం పూటే కాకుండా రోజుకు ఒకటి రెండు సార్లు ఎప్పుడైనా జరగవచ్చు. ఇది సాధారణంగా గర్భధారణ జరిగిన నాలుగు వారాలకి మొదలయ్యి మొదటి త్రైమాసికం చివరి వారం, కొందరిలో అరుదుగా రెండవ త్రైమాసికం చివరి వరకు కూడా కొనసాగవచ్చు.

శక్తి హీనత
గర్భధారణ మొదటి త్రైమాసికంలో అలసట, స్తనాలలో ఇబ్బంది లేదా నొప్పి, తరచూ మూత్రవిసర్జన చేయవలసిరావడం వంటి ఇబ్బందులు కలుగవచ్చు. కొందరిలో ఇది తీవ్ర రూపం దాల్చి ఏది తిన్నా వెంటనే వాంతి చేసుకొంటుంటారు. ఈ స్థితిని ఆంగ్లంలో హైపరేమెసిస్‌ గ్రావిడేరం అంటారు. ఈ స్థితిలో కడుపులో ఆహారమేదీ నిలువనందున గర్భిణీ క్రమేపి నీరసపడిపోయి శక్తి హీనత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి అరుదుగా ప్రసవం అయ్యే వరకు కొనసాగవచ్చు. దీనివల్ల తల్లికే కాకుండా బిడ్డకు కూడా పోషకాహారం అందక ఇద్దరూ పలు ఆరోగ్య సమస్యలకు గురౌతారు. వీరికి వెంటనే చికిత్స అవసరం.

రక్తహీనత
ఇది గర్భధారణకు పూర్వం నుండే ఉన్నా ఆ తర్వాత మొదలైనా తల్లీ బిడ్డలిద్దరూ ప్రమాదంలో పడతారు. ఇరువురి అవసరాల రీత్యా ప్రసవం దగ్గరపడుతున్న కొద్దీ ఈ పరిస్థితి ఇంకా క్లిష్టతరమయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది సామాన్యంగా రక్తంలో ఐరన్‌ కొరత వల్ల ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఫోలిక్‌ ఆసిడ్‌, బి12 కొరత కూడా దీనికి తోడవ్వచ్చు. దీంతో తల్లిలో విపరీతమైన అలసట, నీరసం, తల తిరగడం, ఆయాసపడడం, ప్రసవ సమయంలో అధికంగా రక్త స్రావం వంటివి జరగొచ్చు. బిడ్డ పెరుగుదలలో లోపం, తక్కువ బరువు, నెలలు నిండకుండానే పుట్టడం జరగవచ్చు.

మధుమేహం
గర్భపూర్వం/గర్భసమయంలో స్త్రీ మధుమేహ వ్యాధిగ్రస్తురాలైతే తల్లీబిడ్డల్లో ఎన్నో సమస్యలు తలెత్తవచ్చు. గర్భస్రావం, నెలలు నిండక ముందే కాన్పు జరిగిపోవడం, కంటి, మూత్రపిండాల సమస్యలు, రక్తపోటు ఎక్కువవ్వడం వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావొచ్చు. బిడ్డ పరంగా ముందస్తుగా జన్మించడం, ఎక్కువ బరువు, రక్తంలో చక్కర తక్కువ ఉండడం, కామెర్లు, బిడ్డ పెరిగిన తర్వాత ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశాలు మొదలైన తీవ్ర సమస్యలు కలుగవచ్చు. గర్భసమయంలో మధుమేహం ఉత్పన్నమైన స్త్రీలలో ప్రసవానంతరం కూడా జబ్బు కొనసాగే అవకాశాలు ఎక్కువ.

అధిక రక్తపోటు
మొదటి కాన్పు, ఊబకాయం, కవలలు, ముప్పై ఐదేండ్లు పైబడ్డ తల్లి వయసు, గర్భపూర్వ మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, స్వీయప్రతి రక్షక వ్యాధి వంటివి రక్తపోటుకు దారితీస్తాయి. దీని ప్రభావం తల్లీబిడ్డపై తీవ్రంగానే పడవచ్చు. గర్భిణీలో రక్తపోటు మూడు రకాలుగా సంభవించవచ్చు. దీర్ఘ కాల-గర్భపూర్వం/ఇరవై వారాల గర్భావధికాలం లోపు, ఇరవై వారాల గర్భావధికాలం తర్వాత మూత్రంలో అల్బుమిన్‌ అంటే అవయవాలకు నష్టమైనట్టు సూచిక కనబడవచ్చు.
ఫలితంగా తల్లిలో ప్రీక్లేమ్సియా/మూర్ఛలతో కూడిన ఏక్లాంసియా రావచ్చు. బిడ్డ పెరుగుదలలో లోపం కలుగవచ్చు. నెలలు నిండక ముందే జన్మించవచ్చు. బరువు తక్కువగా లేదా మృత శిశువు పుట్టవచ్చు.

అంటు వ్యాధులు
తల్లికి మూత్రాశయ సంబంధిత, రుబెల్లా, సైటోమెగాలోవైరస్‌, హర్పిస్‌ వైరస్‌ వంటి కొన్ని వైరల్‌, బాక్టీరియల్‌, టోక్సోప్లాస్మా అనే పరాన్నజీవి ద్వారా వచ్చే అంటువ్యాధులు బిడ్డ పరంగా చాలా హాని కలిగించవచ్చు.

మావి సంబంధిత సమస్యలు
మాతృ గర్భాశయం నుండి పోషకాలను, ఆక్సీజన్‌ను బిడ్డకు అందజేసే మావి, గర్భాశయంలో ఉండవలిసిన స్థానంలో కాక కింద ఉండటం, గర్భాశయం నుండి విడిపోవడం, సరిగా వృద్ధి చెందకపోవడం వంటివి బిడ్డకు, తల్లికి ప్రమాదకర పరిస్థితులకు దారి తీయొచ్చు.

గర్భస్రావం
గర్భిణిలో అనియంత్రిత మధుమేహం, అంటువ్యాధులు, హార్మోన్ల ప్రభావం, గర్భకోశ వ్యత్యాసం, థైరాయిడ్‌ సమస్య, రక్తపోటు, ఊబకాయం, జన్యుపరమైన కారణాల వల్ల పిండం సరిగా పెరగక, గర్భకాలం ఇరవై వారాలు పూర్తి కాకుండానే హఠాత్తుగా జారిపోవడాన్ని గర్భస్రావం అంటారు. తల్లి వయసు ముప్పై ఐదేండ్లు దాటి ఉన్నా కూడా ఇలా జరగవచ్చు.

పిండ మరణం
ఇరవై నుండి నలభై వారాల పిండం జారిపోతే అది మృత పిండంగా పరిగణించ బడుతుంది. గర్భస్రావానికి వివరించిన కారకాలు ఈ స్థితికి కూడా వర్తిస్తాయి.

ప్రీ-ఏక్లాంసియా, ఏక్లాంసియా
ఇవి రెండు కూడా అధిక రక్తపోటుతో కూడుకున్నవి. రక్తపోటుతో పాటు మూత్రంలో అల్బుమిన్‌ విసర్జనం తోడైతే అది ప్రీ-ఏక్లాం సియా, మూర్ఛలు మొదలైతే ఏక్లాంసియా రెండూ బిడ్డ మరణానికి దారితీయవచ్చు. పైన పేర్కొన్న సమస్యలు సకాలంలో గుర్తిస్తే వెంటనే పరిష్కరించుకోగలిగినవే.

మానసిక సమస్యలు
ఎప్పటికప్పుడు నియమానుసారం జరిగే స్కానింగ్‌లో బిడ్డ పెరుగుదల/అభివృద్ధి/ అవయవాల అమరిక/ పనితీరు సరిగా లేనట్టుగా లేదా ఏవైనా అనారోగ్య సమస్యలున్నట్టు వెల్లడయితే మామూలుగానే గర్భావస్థలో అతి సున్నితంగా అయిపోయే గర్భిణీ మానసిక ఆరోగ్యం అటువంటప్పుడు మరింత సున్నితం అయిపోతుంది. ఆమెను మానసికంగా కృంగ దీసే సమస్యలు తలెత్తినప్పుడు కుటుంబసభ్యులు ఆప్యాయంగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు ఆమెకు మానసిక స్థైర్యం ఇవ్వవలిసిన బాధ్యత కుటుంబ సభ్యులదే.

డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -