రోగుల ప్రాణాలతో చెలగాటం
మితిమీరుతున్న శంకర్ దాదాల ఆగడాలు
ఎటు చూసినా డయాగ్నొస్టిక్, ఎక్స్ సెంటర్లే
రిజిస్ట్రేషన్ లేకుండానే నిర్వహణ
సర్కార్ నిబంధనలు పాటించని వైనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ప్రయివేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గల్లీకో ఆస్పత్రి ఏర్పాటవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్చగా నిర్వహిస్తున్నారు. నిర్లక్ష్యపు మాటున పేదలను నిలువునా దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. శంకర్ దాదాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రయివేటు డయాగ్నోస్టిక్స్, క్లినిక్స్ ఆడిందే ఆట, పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. వైద్య పరీక్షల పేరిట చేసే టెస్టులకు, ఫీజులకు నియంత్రణ లేకపోవడంతో శంకర్ దాదాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి అనుభవం, అర్హత లేకుండా క్లినిక్‌ను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా రోగులను చేర్చుకుని చికిత్సలు చేస్తున్నారు. వచ్చీరాని వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేస్తూ, జరిమానా విధిస్తూ, మూసేస్తున్నా కొందరికి భయం లేకుండా పోతోంది.
కొందరితో అందరికీ చెడ్డపేరు..
కొందరు అత్తెసరు వైద్యులతో అందరికీ చెడ్డపేరు వస్తోంది. పవిత్రమైన వైద్య వృత్తికి కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు మచ్చ తెస్తున్నారు. ప్రథమ చికిత్స చేయాల్సిన వారు డాక్టర్ల అవతారమెత్తి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అమాయకుల ప్రాణాలతో చెలగాటమా డుతున్నారు. అనుమతి లేకుండా ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్‌లను నిర్వహిస్తున్నారు. పరిధిని మించి వైద్యం చేస్తున్న కొందరి వల్ల నీతి, నిజాయితీతో ప్రాథమిక వైద్యం చేసే వాళ్లకూ ఇబ్బంది వస్తోంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల్లో లేని మెజారిటీ క్లినిక్స్ మేడిపల్లి, బోడుప్పల్, ఉప్పల్, మల్లంపేట, కుత్బుల్లాపూర్, పాతబస్తీ, చార్మినార్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఓ వైపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, మరోవైపు ఎస్‌వోటీ పోలీసులు, ఇంకో వైపు తెలంగాణ వైద్య మండలి సభ్యులు వరుస తనిఖీలు చేస్తున్నా.. నకిలీ వైద్యులు ఏమాత్రం వెరవడం లేదు. యథేచ్ఛగా ఎంబీబీఎస్ వైద్యులుగా చెలామణి అవుతూ గుట్టుగా ఆపరేషన్లు, అబార్షన్లు చేసేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయా క్లినిక్స్‌లో తనిఖీలు నిర్వహించాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాగా, ఎవరికైనా ఫిర్యాదు చేస్తేనే కానీ తనిఖీలు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
చంపేస్తున్నారు..!
వచ్చీరాని వైద్యంతో రోగులను చంపేస్తున్నారు. టెన్త్, ఇంటర్ పూర్తి చేయని వారు ప్రయివేటు ఆస్పత్రుల్లో వార్డు బార్సుగా చేరి.. ఆ తర్వాత ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులుగా అవతరమెత్తుతున్నారు. మరికొంత మంది ఏకంగా ఎంబీబీఎస్ వైద్యులుగా చెలామణి అవుతున్నారు. ప్రాథమిక చికిత్సలకే పరిమితం కావాల్సిన వారు ఏకంగా అబార్షన్లు, కస్తీలు, సున్తీలు చేస్తున్నారు. పేదలు, నిరక్ష్యరాస్యులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీవాసులు నివాసం ఉండే ప్రాంతాల్లో క్లినిక్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సగం ఏరియాల్లో నకిలీల బెడద ఉంది. డయాగ్నొస్టిక్, మెడికల్ షాపుల మాటున యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. సాధారణ జ్వరం, నొప్పులతో బాధపడుతున్న వారికి హైడోస్ యాంటీబయోటిక్, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు ఇస్తూ హస్తవాసి ఉన్న వైద్యులుగా చెలామణి అవుతున్నారు. వీరిచ్చే హైడోస్ మందులతో తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఘటనలు ఇలా..
హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని ఆల్ఫిన్ ఫార్మసీ లైసెన్స్‌ను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు ఇటీవల 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ ఫార్మసీలో అబార్షన్ కిట్ల అమ్మకాలకు సంబంధించిన బిల్లుల వివరాలను అందించాలని డీసీఏ అధికారులు కోరగా.. అందుకు యాజమాన్యం నిరాకరించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో ఘటనలో వారం రోజుల క్రితం వైద్యం వికటించి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ 13వ డివిజన్, దేవేందర్ నగర్ ఫేస్ 2లో జరిగింది. ఆరేండ్ల పాపకు డెంగీ పాటిజివ్, పసిరికలు ఎక్కువగా ఉండటంతో ఫేస్ 2లోని ఓ వైద్యుని వద్దకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో డెంగీ, పసిరికలు తగ్గిస్తానని చెప్పి వైద్యం అందిస్తుండగా గంటలోపే పాప మృతి చెందింది. దాంతో సత్య పాలి క్లినిక్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుని నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని ఆరోపించారు. ఆల్లోపతి వైద్యులు చేయాల్సిన వైద్యం కొందరు డబ్బే ధ్యేయంగా తెలిసీ తెలియని వైద్యం అందించడంతో ఎంతో సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. సంబంధిత అధికారులు మరింత దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.