Monday, September 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆగినా..అనుకూలమే !

ఆగినా..అనుకూలమే !

- Advertisement -

స్థానికంపై హైకోర్టు కామెంట్‌ రేవంత్‌ సర్కార్‌కు అస్త్రం
న్యాయస్థానం సూచనల మేరకు నడుచుకోవాల్సిందే
దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం
గవర్నర్ల వద్ద బిల్లులపై సుప్రీం తీర్పును సైతం సానుకూలంగా మల్చుకునే యత్నం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
”స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ రెండు, మూడు నెలలు ఆగితే నష్టమేంటి?” అన్న హైకోర్టు సూచనను రాష్ట్ర సర్కార్‌ అడ్వాంటేజ్‌గా మార్చుకునే పనిలో ఉంది. గవర్నర్‌ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉంటే జీవో చెల్లదనే విషయం రాష్ట్ర సర్కార్‌కు ముందే తెలుసు. కోర్టుల ముందు అది నిలవదనే సంగతీ తెలుసు. అయినా, ముందుకెళ్లింది. నోటిఫికేషన్‌ విడుదల కాని నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై విచారణ చేయొచ్చంటూ హైకోర్టు అక్టోబర్‌ 8 వరకు కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి విదితమే. ఇవన్నీ అందరూ ఊహించినవే. ప్రస్తుతం గవర్నర్‌ వద్ద బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు పెండింగ్‌ ఉన్నది. ఇది జరిగి నెల దాటింది. న్యాయసలహాల నిమిత్తం గవర్నర్‌ ఆ బిల్లును కేంద్ర హోం శాఖకు పంపారు. ఇటీవల రాష్ట్ర శాసనసభలు, మండళ్లు అసెంబ్లీల్లో బిల్లులను ఆమోదించి పంపినా.. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వాటిని చట్టరూపం దాల్చకుండా మోకాలడ్డుతోన్న విషయం విదితమే. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనైతే గవర్నర్‌ వర్సెస్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆ బిల్లులను అడ్డుకుంటున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి.

ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు రూపొందించిన బిల్లులను సహేతుక కారణాలు చూపెట్టకుండా ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడంపైనా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ గవర్నర్లు మూడు నెలలకుపైగా బిల్లులను పెండింగ్‌లో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్లొచ్చనే సంకేతాలను సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే, దీన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రపతి కార్యాలయం సుప్రీంకోర్టుకు ఐదు ప్రశ్నలను సంధించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఇదే అంశాన్ని లేవనెత్తింది. ”స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో రెండు మూడు నెలలు ఆగితే నష్టమేంటి? గవర్నర్‌ వద్ద బిల్లు ఉండగా జారీ చేసిన జీవో ఎలా చెల్లుబాటు అవుతుంది? ఈ విషయం ప్రభుత్వానికి తెల్వదా?” అని ప్రశ్నించింది. అయితే హైకోర్టు సంధించిన ఈ సూటి ప్రశ్నలను రాష్ట్ర సర్కార్‌ తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. హైకోర్టు సూచన మేరకు రెండు, మూడు నెలలు ఆగి… అప్పటికీ గవర్నర్‌ బిల్లుకు ఆమోద ముద్ర తెలుపకపోతే జీవో తీసుకొచ్చి ముందుకెళ్లే ఆలోచనలో రాష్ట్ర సర్కార్‌ ఉన్నది.

బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం బీజేపీకి ఇష్టం లేదు కాబట్టే టెక్నికల్‌గా గవర్నర్‌ అడ్డు తగులుతున్నారనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. బీజేపీని ఈ విషయంలో రాజకీయంగా ఇరుకున పెట్టే అవకాశం కూడా అధికార పార్టీకి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో యూరియా కొరత, భారీ వర్షాలతో పంట నష్టాలు, ఆరుగ్యారంటీల అమలు తీరు కొంతమేరకు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఎట్లాగూ హైకోర్టు చేసిన సూచన మేరకు నడుచుకుంటూ జీపీలకు పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌, సంక్షేమ పథకాలను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లి నష్టనివారణ చర్యలు చేపట్టాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే పూర్తిచేస్తే కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్లీప్‌ చేసేదనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన సీఎం కాగానే వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించడంతో అదే రాజకీయ వేడిలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిస్థాయిలో అనుకూల ఫలితాలు వచ్చిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇలా జాప్యం చేసుకుంటూ పోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనీ, అవి వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ప్రభావం చూపుతాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -