Monday, September 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రజాస్వామిక హక్కుల హననంపై దేశవ్యాప్త ఉద్యమాలు

ప్రజాస్వామిక హక్కుల హననంపై దేశవ్యాప్త ఉద్యమాలు

- Advertisement -

యువత ముందుండి నడపాలి
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌
మోడీ పాలనలో దెబ్బతింటున్న లౌకిక విలువలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ప్రమాదకర స్థితిలో దేశం : ఎమ్మెల్యే కూనంనేని

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
”దేశంలో ప్రజాస్వామిక హక్కులు హననానికి గురవుతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు దేశవ్యాప్త ఉద్యమం రావాలి. ఆ పోరాటాన్ని యువత ముందుండి నడపాలి” అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీఎస్‌డీఎఫ్‌, జాగో నవతెలంగాణ ఆధ్వర్యంలో జస్టిస్‌ బి చంద్రకుమార్‌ అధ్యక్షతన ”ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం”, ”ఎన్నికల కమిషన్‌, న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి” అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని ప్రసంగించారు. ప్రశాంత్‌ భూషణ్‌ మాట్లాడుతూ దేశంలో ప్రజల జీవన పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో తాత్కాలిక ఉద్యోగులను నియమించటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతులు, కూలీలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని సూచించారు.

మరోపక్క దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతున్నదని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం డొల్లగా మారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో మోడీ సర్కారు మీడియాను కంట్రోల్‌ చేస్తున్నదని తెలిపారు. అయినా సోషల్‌ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. మోడీ విధానాలు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. బాబ్రీమసీదు కేసులో తీర్పు చెప్పిన ఐదుగురిలో నలుగురికి పదవులు లభించాయని ఆయన గుర్తు చేశారు. న్యాయమూర్తుల నియామకాల్లో సుప్రీంకోర్డు జడ్జి ఉండటాన్ని విస్మరించి, ఆ స్థానంలో క్యాబినెట్‌ మంత్రిని పెట్టటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనుకున్నవారే న్యాయమూర్తులవుతున్నారని చెప్పారు. లడఖ్‌లో సోనంవాంగ్‌చుక్‌ను అరెస్టు చేయటం ప్రజాస్వామిక హక్కులను ఉల్లంఘించటమేనని తెలిపారు. ఇలాంటి స్థితిలో దేశవ్యాప్త ఉద్యమాలు అవసరమని చెప్పారు.

దేశాన్ని దోచుకుంటున్న కార్పొరేట్లు : కూనంనేని
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందన్నారు. మతోన్మాదం వేయి తలల నాగుపాములా ప్రజలపై బుసకొడుతున్నదని వివరించారు. దొంగలు రాజ్యాన్ని ఏలుతున్నారని విమర్శించారు. మతోన్మాదులు, కార్పొరేట్లు ఒక్కటై దేశాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ మలినమవుతున్నదని అన్నారు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాపాడటం అత్యవసరమని చెప్పారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతతో మాత్రమే మతోన్మాద శక్తులను ఎదుర్కోగలమని కూనంనేని తెలిపారు.

బీజేపీ పాలనలో రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ సారధ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామిక హక్కులు, లౌకిక విలువలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ వ్యవహారంతో నచ్చిన వారికి ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని తెలిపారు. బీహార్‌లో సర్‌ పేరుతో చేస్తున్న చర్యలే ఇందుకు నిదర్శనమన్నారు. తమ మాట వినని రాజకీయ పార్టీలు, నాయకులపై కేంద్రం ఈడీ, సీబీఐ దాడులకు పాల్పడుతున్నదని చెప్పారు. మోడీ సర్కారు ఈసీని తమ జేబు సంస్థగా మార్చుకున్నదని విమర్శించారు. రైతులు, కార్మికులు, ఉపాధి కూలీలు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించటంలో కేంద్రం విఫలమయిందని విమర్శించారు. దళిత, గిరిజన, మైనార్టీలు, బడుగు జీవులు సామాజిక పీడనకు గురవుతున్నారని చెప్పారు.

తెలంగాణలో కూడా సర్‌ తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ అనాగరిక, నరహంతక ప్రభుత్వం కేంద్రంలో మోడీ రూపంలో కొలువుదీరిందని విమర్శించారు. ప్రజాస్వామిక హక్కులగురించి అడిగే వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నదని చెప్పారు. రాహుల్‌గాంధీ ఓట్ల చోరీపై చేసిన ప్రజెంటేషన్‌తో దేశం ఉలిక్కిపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌డీఎఫ్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు కందిమళ్ల ప్రతాపరెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలిపతిరావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్‌, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆప్‌ కన్వీనర్‌ దిడ్డి సుధాకర్‌, ఓట్‌నీడ్‌ గ్యారంటీ ఆర్గనైజేషన్‌ నాయకురాలు సోగరా బేగం, శాంతి చర్చల కమిటీ నాయకులు దుర్గ ప్రసాద్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -