Monday, September 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుభూములు గుంజుకోం.. రైతులను మెప్పిస్తాం

భూములు గుంజుకోం.. రైతులను మెప్పిస్తాం

- Advertisement -

అవకాశం ఇస్తే ఫ్యూచర్‌ సిటీని న్యూయార్క్‌కు దీటుగా తీర్చిదిద్దుతా
డిసెంబర్‌లో యంగ్‌ ఇండియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనం ప్రారంభం
ఇక ఫ్యూచర్‌సిటీ నుంచే పాలన
భాగ్యనగరం నుంచి బందర్‌పోర్ట్‌కు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి
చెన్నై, బెంగళూరు నగరాలకు బుల్లెట్‌ రైళ్లు
సింగరేణి కార్పొరేషన్‌ భవనాలకు పదెకరాలు కేటాయింపు
2026 డిసెంబర్‌లోగా పూర్తి చేయాలి
భారత్‌ ఫ్యూచర్‌ సిటీ మీర్‌ఖాన్‌పేటలో ఎఫ్‌సీడీఏ భవనాలు, గ్రీన్‌ఫిల్డ్‌ రోడ్డు : శంకుస్థాపనలో సీఎం రేవంత్‌రెడ్డి


నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

”రైతుల నుంచి అప్పనంగా భూములు లాక్కోం.. రైతులను ఒప్పించి, మెప్పించి ముందుకు వెళ్తాం. మీ తాతల ఆస్తులు గుంజుకునే ఆలోచన నాకు లేదు. భూమి విలువ ఏంటో, రైతు బాధలు ఏంటో అర్థం చేసుకునే వాడిని నేను. బాధితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే భూములు తీసుకుం టాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. డిసెంబర్‌లో యంగ్‌ ఇండియా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభించుకోబో తున్నామని, ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి పనులను ఇక్కడి నుంచే సమీక్షించబోతున్నామని తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వేదికగా ఎఫ్‌సీడీఏ భవనం సహా రావిర్యాల నుంచి ఆమనగల్‌ వరకు నిర్మించనున్న రేడియల్‌ రోడ్లకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ఇక సచివాలయంలో కాకుండా ‘ఫ్యూచర్‌సిటీ ఆఫీసులో కూర్చొంటా.. నెలకు మూడు సార్లు ఇక్కడే ఉంటా’ అని సీఎం తెలిపారు. పెట్టుబ డిదారులనే కాదు.. మొత్తం ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని, ఏ అభివృద్ధి కార్యక్రమమై నా ఇకపై ఇక్కడి నుంచే చేపడుతానని చెప్పారు.

తనతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి కూడా నెలకు నాలుగు సార్లు ఇక్కడికి వచ్చి తన కార్యకలాపాలను కొనసాగిస్తారన్నారు. సింగరే ణి సంస్థ కోసం 10 ఎకరాలు కేటాయించి, 2026 డిసెంబర్‌లోగా ఆఫీసును ప్రారంభించాల్సిం దిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. విజయ దశమి మనకు విజయాలను చేకూరుస్తోందన్నారు. వాతావరణ శాఖ చెప్పినట్టు నాలుగైదు రోజుల నుంచి విపరీతమైన వర్షాల వల్ల ఎవరూ బయటికి వెళ్లలేదని, కానీ మంచి సంకల్పంతో చేపట్టిన ‘నవ్య.. భవ్య.. భారత్‌ ఫ్యూచర్‌సిటీ’ శంకుస్థాపన కోసం ఈ రోజు వర్షం సహకరించిందన్నారు. ఇక్కడ రేవంత్‌రెడ్డికి భూములున్నాయని ఆయన కోసమే నగరం కడుతున్నారంటూ చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. భూములుంటే భూమి మీదే ఉంటుందని, రహస్యంగా దాచుకోవడానికి నా దగ్గరేమీ లేదని, దానికి రికార్డులు ఉంటాయని, తన గురించో.. తన సహచర మంత్రుల గురించో ఆలోచన చేయడం లేదని, తామంతా రేపటి తరాల కోసమే ఆలోచన చేస్తున్నామని సీఎం ఉద్ఘాటించారు.

436 ఏండ్ల క్రితం కులీకుతుబ్‌ షాహీ హైదరాబాద్‌ నగరానికి పునాదులు వేసినప్పుడు చెరువులు, నదుల్లో ఏ విధంగా చేపల సముహం ఉండేదో.. అదే విధంగా హైదరాబాద్‌ విరజిల్లాలని ఆకాంక్షించారు. అలాగే, నిజాం నవాబ్‌ 226 ఏండ్ల క్రితం సికింద్రాబాద్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. ఆనాడు చంద్రబాబు, వైఎస్సార్‌ తమకెందుకు అనుకుని ఉంటే.. హైటెక్‌సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్డు, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వచ్చేవి కాదన్నారు. ఆనాటి నాయకుల ఆలోచన వల్లనే ఫార్మా, ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీపడుతున్నామని తెలిపారు. న్యూయార్క్‌, జపాన్‌, సింగపూర్‌, దుబారు తరహాలో ఫ్యూచర్‌సిటీ గురించి గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతామన్నారు.

తమకు పదేండ్లు అవకాశం ఇస్తే.. న్యూయార్క్‌లో ఉన్నవాళ్లు కూడా ఫ్యూచర్‌ సిటీ గురించి గొప్పగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు. అలాగే, ఫ్యూచర్‌సిటీ నుంచి శ్రీశైలం వరకు 100 మీటర్ల రోడ్డు వేస్తున్నామని అన్నారు. ఇటు ఫ్యూచర్‌సిటీ నుంచి అటు బెంగళూరు వరకు రోడ్డు సహా బుల్లెట్‌ ట్రైన్‌ మంజూరు చేయించుకున్నామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఈ కొరతను తీర్చేందుకు మచిలీపట్నం వరకు రోడ్డు వేస్తున్నామన్నారు. ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు బుల్లెట్‌ ట్రైన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఫ్యూచర్‌సిటీలో ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్లు కూడా తొలగించి, యూజీ కేబుల్స్‌ వేయబోతున్నట్టు చెప్పారు.

విపక్షాల ఉచ్చులో చిక్కొద్దు.. కోర్టుకెళ్లి నష్టపోవద్దు
‘చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుందాం. కూర్చొని మాట్లాడుకుందాం.. లిబరల్‌గా పరిష్కార మార్గం చూపిస్తా.. అందరికీ న్యాయం చేస్తా, కోర్టు బయట కూర్చొని నష్టాన్ని పూడ్చుకుందాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు సూచించారు. కోర్టుకెళ్లి అడ్వకేట్లకు ఫీజులు చెల్లించి నష్టపోయే కంటే తానే స్వయంగా రైతులతో కూర్చొని చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జంగారెడ్డి, ఎమ్మెల్యేలు మాల్‌రెడ్డి రంగారెడ్డి, యాదయ్య, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచెన్నగారి లక్ష్మారెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ సత్యనారాయణ, సిటీ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ శశాంక్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -