నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో, సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం సీఎం నేరుగా అమ్మవారి గర్భగుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులను కూడా ఆయన అమ్మవారికి అర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులకు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. దర్శనానంతరం వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు.